Paris Olympics 2024 Shooting: తృటిలో మరో మెడల్ మిస్.. షూటింగ్‌లో నాలుగో స్థానంతో సరిపెట్టుకున్న అర్జున్
Paris Olympics 2024 Shooting: పారిస్ ఒలింపిక్స్ 2024లో ఇండియా తృటిలో మరో మెడల్ మిస్ అయింది. మెన్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ షూటింగ్ ఈవెంట్లో అర్జున్ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
Paris Olympics 2024 Shooting: పారిస్ ఒలింపిక్స్ 2024 షూటింగ్ ఈవెంట్లో ఇండియా మరో మెడల్ కు దగ్గరగా వచ్చినా అందుకోలేకపోయింది. పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో భారత షూటర్ అర్జున్ బబుతా చివరి వరకూ మెడల్ పై ఆశలు రేపినా.. చివరికి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈ ఈవెంట్లో చైనా, స్వీడన్, క్రొయేషియా షూటర్లు మెడల్స్ గెలిచారు.
మెడల్ మిస్
పారిస్ ఒలింపిక్స్ మూడో రోజు పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ ఫైనల్ జరిగింది. ఈ ఫైనల్ చేరడమే కాదు.. చివరి వరకూ మెడల్ కోసం భారత షూటర్ అర్జున్ బబుతా గట్టిగానే పోరాడాడు. ఒక దశలో 16 రౌండ్ల తర్వాత రెండో స్థానంలో నిలిచిన అతడు.. 20 రౌండ్ల తర్వాత ఎలిమినేట్ అయ్యాడు. 20 రౌండ్ల తర్వాత అతడు 208.4 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచాడు.
ఈ ఈవెంట్లో చైనా షూటర్ షెంగ్ లిహావో 24 రౌండ్ల తర్వాత 252.2 పాయింట్లతో ఒలింపిక్స్ రికార్డు క్రియేట్ చేసి గోల్డ్ మెడల్ ఎగరేసుకుపోయాడు. ఇక రెండో స్థానంలో స్వీడన్ కు చెందిన షూటర్ విక్టర్ లిండ్‌గ్రెన్ నిలిచాడు. అతడు 251.4 పాయింట్లతో సిల్వర్ మెడల్ గెలిచాడు. క్రొయేషియా షూటర్ మార్సిస్ 230 పాయింట్లతో బ్రాంజ్ మెడల్ సొంతం చేసుకున్నాడు.
చివరి షాట్‌లో బోల్తా పడ్డ అర్జున్
ఈ క్రొయేషియా షూటర్ తోనే తన 20వ రౌండ్లో అర్జున్ తలపడ్డాడు. అయితే చివరి షాట్ లో 9.5 పాయింట్లే సాధించడంతో అతడు నాలుగో స్థానంతో పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అంతకుముందు వుమెన్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో మరో ఇండియన్ షూటర్ రమితా జిందల్ కూడా 7వ స్థానంలో నిలిచి మెడల్ కోల్పోయింది.
క్వాలిఫికేషన్ రౌండ్లో అర్జున్ 60 షాట్లలో 630.1 పాయింట్లతో ఫైనల్ చేరి మెడల్ పై ఆశలు రేపాడు. క్వాలిఫికేషన్ రౌండ్లో ఏడో స్థానంలో నిలిచినా.. ఫైనల్లో మాత్రం చాలా వరకు అతడు రెండు, మూడు స్థానాల్లో ఉంటూ వచ్చాడు. అయితే 20వ షాట్ అతని మెడల్ ఆశలపై నీళ్లు చల్లింది.
పారిస్ ఒలింపిక్స్ లో ఇప్పటి వరకూ ముగ్గురు ఇండియన్ షూటర్లు ఫైనల్ కు అర్హత సాధించారు. అందులో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో మను బాకర్ బ్రాంజ్ మెడల్ గెలిచింది. రమితా, అర్జున్ మాత్రం నిరాశ పరిచారు.