Paris Olympics: మందు, సిగరెట్ తాగుతూ జిమ్నాస్టిక్ కెప్టెన్ జల్సాలు - ఒలింపిక్స్ నుంచి ఔట్
Paris Olympics: ఒలింపిక్స్ క్రీడల కోసం పారిస్ వచ్చిన జపాన్ జిమ్నాస్టిక్ ఉమెన్స్ టీమ్ కెప్టెన్‌పై పోటీల్లో పాల్గొనకుండానే స్వదేశానికి వెళ్లిపోయింది. సిగరెట్ తాగుతూ దొరికిపోవడంతో ఆమెను ఒలింపిక్స్ నుంచి తప్పించారు
Paris Olympics: ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలని, ఈ విశ్వ క్రీడల్లోపతకం సాధించాలని ప్రపంచంలోని ప్రతి అథ్లెట్ కలలు కంటుంటాడు. ఫస్ట్ టైమ్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించినవారిలో పతకం గెలవాలనే కసి, పట్టుదల ఎక్కువగా కనిపిస్తుంది. ఒలింపిక్స్‌కు మొదటిసారి అర్హత సాధించడమే కాకుండా పోటీల కోసం పారిస్ వచ్చిన ఓ అథ్లెట్ పై అనూహ్యంగా అనర్హత వేటు పడింది. ఒలింపిక్స్ ప్రారంభానికి మరో ఆరేడు రోజుల ముందే ఇంటి బాట పట్టింది.

జిమ్నాస్టిక్ కెప్టెన్...
జపాన్ జిమ్నాస్టిక్స్ ప్లేయర్ షోకో మియాటా ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ ఉమెన్స్ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తోంది. 1964 టోక్యో ఒలింపిక్స్ లో చివరగా ఉమెన్స్ జిమ్నాస్టిక్స్ లో టీమ్ విభాగంలో జపాన్ గోల్డ్ మెడల్ సొంతం చేసుకున్నది. చాలా రోజుల తర్వాత మళ్లీ ఈ ఈవెంట్‌లో షోకో మియాటా ఆధ్వర్యంలో ఉమెన్స్ జిమ్నాస్టిక్ టీమ్ ఖచ్చితంగా మెడల్ సాధిస్తుందని జపాన్ స్పోర్ట్స్ ఫ్యాన్స్‌తో పాటు క్రీడాధికారులు భావించారు.
ఒలింపిక్ కమిటీ రూల్...
ఒలింపిక్స్‌లో జపాన్ నుంచి ప్రాతినిథ్యం వహించే క్రీడాకారులు ఎవరూ మద్యం, సిగరెట్‌తో పాటు మత్తు పదార్థాల జోలికి వెళ్లకూడదని ఆ దేశ ఒలింపిక్ కమిటీ రూల్ పెట్టింది. ఈ రూల్‌ను అతిక్రమించిన షోకో మియాటా సిగరెట్ తాగుతూ అధికారులకు పట్టుబడింది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా మియాటోను ఒలింపిక్స్ క్రీడల నుంచి జపాన్ తప్పించింది. సిగరెట్ మాత్రమే కాకుండా ఆమె మద్యం సేవిస్తూ పారిస్‌లో జల్సాల చేసినట్లు జపాన్ ఒలింపిక్ కమిటీ అనుమానిస్తోంది. అదే నిజమని తెలితే ఆమెపై కఠిన చర్యలు తీసుకుంటామని ఒలింపిక్ కమిటీ చెబుతోంది. షోకో మియాటాను విచారణను హాజరుకావాలని ఆదేశించింది.
ఐదుగురు కాదు...నలుగురే...
ఒలింపిక్స్ నుంచి తప్పుకున్న మియాటో గురువారమే జపాన్‌కు తిరిగి వచ్చినట్లు సమాచారం. ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్ క్రీడల కోసం ఐదుగురు సభ్యులతో కూడిన టీమ్‌ను జపాన్...పారిస్‌కు పంపించింది. తాజాగా షోకో మియాటా తప్పుకోవడంతో ఈ ఈవెంట్‌లో తమ ప్లేయర్లు నలుగురు మాత్రమే పాల్గనబోతున్నట్లు జపాన్ ప్రకటించింది. నిబంధనలు ఉల్లంఘించిన తమ ప్లేయర్ తరఫున ఇంటర్నేషనల్ ఒలింపిక్ అసోషియేసన్‌కు జపాప్ ఒలింపిక్ కమిటీ క్షమాపణలు చెప్పింది.
10714 మంది అథ్లెట్లు...
పారిస్ ఒలింపిక్స్‌లో 32 క్రీడాంశాలకు గాను 10714 మంది అథ్లెట్లు పతకాల కోసం పోటీపడుతోన్నారు. ఇండియా నుంచి 14 గేమ్స్‌కు గాను 117 మంది అథ్లెట్లు మాత్రమే క్వాలిఫై అయ్యారు. జూలై 26 నుంచి పారిస్ ఒలింపిక్స్ ప్రారంభంకానున్నాయి.