Olympics Day 3 India Schedule: షూటర్లు మరో పతకం గెలుస్తారా? - ఆర్చరీ బరిలో తెలుగు అథ్లెట్ - నేటి షెడ్యూల్ ఇదే!
Olympics Day 3 India Schedule: ఒలింపిక్స్‌లో సోమవారం షూటింగ్‌లో రమితా జిందాల్, అర్జున్ ఫైనల్ రౌండ్ పోటీలకు సిద్ధమై పతకాలపై ఆశలు రేపుతోన్నారు. ఆర్చరీ, బ్యాడ్మింటన్‌తో పాటు పలు ఈవెంట్స్‌లో భారత అథ్లెట్లు బరిలోకి దిగుతోన్నారు.
Olympics Day 3 India Schedule: పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు షూటర్ మను భాకర్ తొలి పతకాన్ని అందించింది. పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో కాంస్య పతకం గెలిచి చరిత్రను సృష్టించింది. మను భాకర్ ఇచ్చిన స్ఫూర్తితో మూడో రోజు షూటర్లు మెడల్స్ సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతోన్నారు. సోమవారం రోజు షూటింగ్, ఆర్చరీతో పాటు పలు ఈవెంట్స్‌లో మెడల్ మ్యాచ్‌లు జరుగనున్నాయి. మూడో రోజు భారత్ మరో పతకం దక్కుతుందా లేదా అన్నది క్రీడాభిమానుల్లో ఆసక్తి కరంగా మారింది.
షూటింగ్...
పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలోనే రమితా జిందాల్, అర్జున్ బబుతా నేడు ఫైనల్ రౌండ్‌లో పోటీపడనున్నారు. వారు పతకాలు సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు. క్వాలిఫయర్ రౌండ్‌లో రమితా ఐదో స్థానంలో, అర్జున్ ఏడో స్థానంలో నిలిచి ఫైనల్‌కు అర్హత సాధించారు. పది మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో మిక్స్‌డ్ టీమ్ క్వాలిఫయర్ రౌండ్ పోటీలు సోమవారం నిర్వహించనున్నారు. ఇందులో మను భాకర్ - సరోబ్‌జోత్ సింగ్, రిథమ్ సాంగ్వాన్ - అర్జున్ సింగ్ పోటీపడనున్నారు. ట్రాప్ షూటింగ్ విభాగంలో పృథ్వీరాజ్ క్వాలిఫయర్ రౌండ్ పోటీల కోసం సిద్ధమయ్యాడు.
అర్చరీ
ఆర్చరీలో మెన్స్ టీమ్ క్వార్టర్ ఫైనల్, సెమీస్ పోటీలు జరుగున్నాయి. ఇందులో తరుణ్‌దీప్ రాజ్, ప్రవీణ్ జాదవ్‌తో కలిసి తెలుగు ఆర్చరీ ఆటగాడు బొమ్మదేవర ధీరజ్ బరిలో దిగుతోన్నాడు. సెమీస్ దాటితే ఇండియాకు పతకం ఖాయం అవుతుంది.
బ్యాడ్మింటన్
బ్యాడ్మింటన్‌లో నేడు మెన్స్, ఉమెన్స్ డబుల్స్, సింగిల్స్ పోటీలు జరుగనున్నాయి. సింగిల్స్‌లో లక్ష్య సేన్ డెన్మార్క్‌కు చెందిన జూలియన్ కర్రాగీతో తలపడనున్నాడు. మెన్స్ డబుల్స్‌లో సాత్విక్‌రాజ్, చిరాగ్ శెట్టి, ఉమెన్స్ డబుల్స్‌లో అశ్విని పొన్నప్ప, తానీషా లకు చెందిన గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు జరుగనున్నాయి.
హాకీలో సోమవారం అర్జెంటీనాతో ఇండియా తలపడనుంది. న్యూజిలాండ్‌పై తొలి మ్యాచ్‌లో విజయం సాధించిన భారత జట్టు అర్జెంటీనాపై ఆ జోరును కొనసాగించాలనే పట్టుదలతో ఉంది.
టేబుల్ టెన్నిస్‌లో
ఉమెన్స్ రౌండ్ 32 మ్యాచ్ జరుగనుంది. ఇందులో శ్రీజ ఆకుల సింగపూర్‌కు చెందిన జియాన్ జంగ్‌తో సవాల్‌కు సిద్ధమైంది.
టెన్నిస్‌లో మెన్స్ డబుల్స్ సెకండ్ రౌండ్ మ్యాచ్ జరుగనుంది. వీటితో పాటు మరికొన్ని ఈవెంట్స్‌లో భారత అథ్లెట్లు బరిలోకి దిగుతోన్నారు.
ప్రస్తుతం ఒలింపిక్స్ మెడల్స్ లిస్ట్‌లో జపాన్ ఫస్ట్ ప్లేస్‌లో ఉండగా, ఆస్ట్రేలియా, అమెరికా రెండు, మూడు స్థానాల్లో కొనసాగుతోన్నాయి. భారత్ ఒకే ఒక కాంస్య పతకంతో 22వ స్థానంలో ఉంది.