Paris Olympics Closing Ceremony Live streaming: పారిస్ ఒలింపిక్స్ 2024 క్లోజింగ్ సెర్మనీని ఎప్పుడు.. ఎక్కడ చూడొచ్చు?
Paris Olympics 2024 Closing Ceremony Live Streaming: పారిస్ ఒలింపిక్స్ 2024 ముగింపునకు వచ్చేసింది. క్లోజింగ్ సెర్మనీకి అంతా రెడీ అయింది. విశ్వక్రీడల ముగింపు వేడుకలు ఎప్పుడు జరుగుతాయి.. ఎక్కడ చూడొచ్చో ఇక్కడ తెలుసుకోండి.
రెండు వారాలకు పైగా సాగిన క్రీడా సమరం ‘పారిస్ ఒలింపిక్స్ 2024’కు తెరపడనుంది. మరికొన్ని గంటల్లో ఈ విశ్వక్రీడలు ముగియనున్నాయి. కళ్లు చెదిరేలా క్లోజింగ్ సెర్మనీ జరగనుంది. పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ అనుకున్న స్థాయిలో పతకాలు సాధించలేకపోయింది. అయితే, షూటర్ మనూ భాకర్ చరిత్ర సృష్టించారు. భారత హాకీ జట్టు కాంస్యం సాధించడంలో గోల్ కీపర్ పీఆర్ శ్రీజేశ్ కీలకపాత్ర పోషించారు. పారిస్ ఒలింపిక్స్ క్లోజింగ్ సెర్మనీలో భారత బృందానికి మనూ భాకర్, శ్రీజేశ్ ఫ్లాగ్ బేరర్లుగా ఉండనున్నారు.
ఒలింపిక్స్ 2024 క్లోజింగ్ సెర్మనీ చరిత్రాత్మక నగరం పారిస్‍లో అట్టహాసంగా జరగనుంది. 80వేల మందికిపైగా ప్రేక్షకులు ఈ సంబరాలను ప్రత్యక్షంగా వీక్షించనున్నారు. అలాగే, లాస్ ఏంజిల్స్ 2028 ఒలింపిక్స్ నిర్వహించే ఆర్గనైజింగ్ కమిటీకి ఒలింపిక్స్ ఫ్లేమ్‍ను ఈ వేడుకలోనే అందించనున్నారు పారిస్ క్రీడల నిర్వాహకులు. ఈ పారిస్ ఒలింపిక్స్ 2024 క్లోజింగ్ సెర్మనీని ఇండియాలో ఎప్పుడు, ఎక్కడ చూడొచ్చంటే..
పారిస్ ఒలింపిక్స్ క్లోజింగ్ సెర్మనీ టైమింగ్
పారిస్ ఒలింపిక్స్ 2024 ముగింపు వేడుకలు భారత కాలమానం ప్రకారం ఈ అర్ధరాత్రి (ఆగస్టు 12) 12 గంటల 30 నిమిషాలకు ప్రారంభం అవుతాయి. ఇండియాలోని ఫ్యాన్స్ ఈ మిడ్‍నైట్ నుంచి క్లోజింగ్ సెర్మనీ చూడొచ్చు. పారిస్‍లోని స్టేడే డే ఫ్యాన్స్ వేదికగా ఈ వేడుకలు అత్యంత ఘనంగా జరగనున్నాయి.
క్లోజింగ్ సెర్మనీ లైవ్ టెలికాస్ట్, స్ట్రీమింగ్
ఇండియాలో పారిస్ ఒలింపిక్స్ 2024 క్లోజింగ్ సెర్మనీని స్పోర్ట్స్ 18 నెట్‍వర్క్ టీవీ ఛానెళ్లలో లైవ్ చూడొచ్చు. డిజిటల్ విషయానికి వస్తే, జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు. ఈ అర్ధరాత్రి 12.30 గంటల నుంచి వాటిలో ప్రత్యక్ష ప్రసారం వీక్షించవచ్చు.
పారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ పతకాలు
పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ అనుకున్న స్థాయిలో పతకాలు దక్కించుకోలేకపోయింది. డబుల్ డిజిట్ టార్గెట్‍తో బరిలోకి దిగిన ఇండియా ఆ స్థాయిలో రాణించలేదు. పారిస్ క్రీడల్లో భారత్‍కు ఓ రజతం, ఐదు కాంస్య పతకాలు దక్కాయి. మొత్తంగా 6 మెడల్స్ వచ్చాయి. స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ రజత పతకంపై సీఏఎస్ తీర్పు ఇవ్వాల్సి ఉంది. ఫైనల్ వరకు చేరి అనర్హత వేటుకు గురైన వినేశ్‍కు పతకం దక్కితే.. భారత్ ఖాతాలో ఏడో పతకం చేరుతుంది. ఈ పారిస్ క్రీడల్లో భారత్‍కు ఒక్క స్వర్ణం కూడా దక్కలేదు. గత టోక్యోలో ఓ గోల్డ్ సహా ఏడు పతకాలను భారత్ దక్కించుకుంది. దాన్ని కూడా పారిస్‍లో ఇండియా దాటలేకపోయింది.
పారిస్ ఒలింపిక్స్‌లో భారత షూటర్ మనూ భాకర్ రెండు కాంస్య పతకాలను సాధించి చరిత్ర సృష్టించారు. ఒకే ఎడిషన్ ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ సాధించిన తొలి భారత అథ్లెట్‍గా నిలిచారు. వ్యక్తిగత, మిక్స్డ్ టీమ్ ఈవెంట్లలో మనూకు మెడల్స్ వచ్చాయి. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా రజతం పతకం దక్కించుకున్నారు. షూటింగ్‍లో స్వప్నిల్ కుషాలే కూడా కాంస్య సాధించారు. రెజ్లింగ్‍లో అమన్ షెరావత్ కాంస్యం గెలిచారు. భారత హాకీ పురుషుల జట్టు కూడా కాంస్య పతకం సాధించింది.