Paris 2024 Olympics: ఈ ఏడాది ఒలింపిక్స్ షెడ్యూల్ ఇదే.. లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడ చూడొచ్చంటే..
Paris 2024 Olympics: ఈ ఏడాది ఒలింపిక్ క్రీడలు పారిస్ వేదికగా జరగున్నాయి. వేలాది మంది అథ్లెట్లు పతకాల కోసం పోటీ పడనున్నారు. ఈ ఏడాది ఒలింపిక్స్ తేదీలు, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇక్కడ చూడండి.
Paris 2024 Olympics: ప్రతిష్టాత్మక క్రీడా సమరం ‘ఒలింపిక్స్’ ఈ ఏడాది ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదికగా జరగనుంది. ఈ పారిస్ ఒలింపిక్స్ 2024లో వివిధ దేశాలకు చెందిన 10వేల మందికి పైగా అథ్లెట్లు పాల్గొననున్నారు. ఇప్పటికే ఈ ఒలింపిక్స్ ఏర్పాట్లు పూర్తి కావొస్తున్నాయి. మూడోసారి ఒలింపిక్ క్రీడలకు పారిస్ ఆతిథ్యమిస్తోంది. ఈ ఏడాది జూలై 26వ తేదీన మెగా స్పోర్ట్స్ ఈవెంట్ మొదలుకానుంది. పారిస్ ఒలింపిక్స్ 2024 వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

ఓపెనింగ్ సెర్మనీ ఎప్పుడు?
జూలై 26వ తేదీన 2024 పారిస్ ఒలింపిక్ క్రీడలకు తెరలేవనుంది. జూలై 26వ తేదీ రాత్రి 11 గంటల 30 నిమిషాలకు (భారత కాలమానం) ఓపెనింగ్ సెర్మనీ మొదలుకానుంది. ఈ కార్యక్రమాన్ని కళ్లు చెదిరేలా అత్యంత భారీగా నిర్వహించేందుకు పారిస్ ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు నిర్వాహకులు. విభిన్న కార్యక్రమాలను చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
2024 ఒలింపిక్స్ ముగింపు ఎప్పుడంటే..
పారిస్ ఒలింపిక్స్ 2024 జూలై 26వ తేదీ నుంచి ఆగస్టు 11వ వరకు జరగనున్నాయి. ఆగస్టు 11వ తేదీన క్లోజింగ్ సెర్మనీ ఉండనుంది. క్లోజింగ్ సెర్మనీ కూడా అత్యంత అట్టహాసంగా జరగనుంది.
ఎన్ని స్టోర్ట్స్, ఈవెంట్స్?
పారిస్ 2024 ఒలింపిక్స్‌లో 32 స్పోర్ట్స్‌లో 329 ఈవెంట్లు ఉండనున్నాయి. ఈ ఒలింపిక్స్‌లో కొత్తగా బ్రేకింగ్, స్కేట్ బోర్డింగ్, స్పోర్ట్ క్లైంబింగ్, సర్ఫింగ్ కూడా యాడ్ అయ్యాడు. దీంతో మొత్తంగా 32 స్పోర్ట్స్ అయ్యాయి. స్ప్రింటింగ్‍లో ఓ కొత్త ఈవెంట్ వచ్చింది.
ఎక్కడ చూడొచ్చు?
పారిస్ 2024 ఒలింపిక్ క్రీడలు జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరగనున్నాయి. అయితే, ఓపెనింగ్ సెర్మనీ కంటే ముందే జూలై 24 నుంచే కొన్ని పోటీలు జరగనున్నాయి. పారిస్ 2024 ఒలింపిక్స్ ‘స్పోర్ట్స్18 నెట్‍వర్క్’ టీవీ ఛానెళ్లలో లైవ్ టెలికాస్ట్ అవుతాయి. డిజిటల్ విషయానికి వస్తే, 'జియోసినిమా' ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు.
భారత్ తలపడే ఈవెంట్లు
పారిస్ 2024 ఒలింపిక్ క్రీడల్లో ఆర్చరీ, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాక్సింగ్, ఈక్వెస్ట్రియన్, హాకీ, రోయింగ్, సెయిలింగ్, షూటింగ్, టేబుల్ టెన్నిస్, టీమ్ టెన్నిస్, రెజ్లింగ్ ఈవెంట్లలో భారత అథ్లెట్లు బరిలోకి దిగనున్నారు.
పారిస్ 2024 ఒలింపిక్స్‌కు వివిధ ఈవెంట్లలో ఇప్పటి వరకు 97 మంది భారత అథ్లెట్లు అర్హత సాధించారు. అయితే, మొత్తంగా 115 నుంచి 120 మంది భారత అథ్లెట్లు ఒలింపిక్స్‌కు క్వాలిఫై అవుతారని అంచనా వేస్తున్నట్టు కేంద్ర క్రీడాశాఖ నూతన మంత్రి మన్‍సుఖ్ మాండవీయ అన్నారు. ఒలింపిక్ క్రీడలపై నేడు (జూన్ 13) ఐఓఏ చీఫ్ పీటీ ఉష సహా అధికారులతో భేటీ అయ్యారు మాండవీయ. ఈ విషయాన్ని ఆయన వెల్లడించారు. “నేను నేడు ఐఓఏ అధికారులను కలిశాను. పారిస్ ఒలింపిక్స్ క్రీడలకు భారత్ సన్నద్ధత గురించి వారి నుంచి తెలుసుకున్నా. అవసరమైనంత మద్దతు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది” అని మీడియాతో చెప్పారు మాండవీయ. ఒలింపిక్ క్రీడలకు భారత అథ్లెట్లు సిద్ధమవుతున్నారని టీవీ ఉష తెలిపారు.