Pakistan vs Zimbabwe: జింబాబ్వే అధ్యక్షుడికి పాకిస్థాన్ ప్రధాని వార్నింగ్-pakistan vs zimbabwe as both the countries leaders indulge in twitter war ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Pakistan Vs Zimbabwe As Both The Countries Leaders Indulge In Twitter War

Pakistan vs Zimbabwe: జింబాబ్వే అధ్యక్షుడికి పాకిస్థాన్ ప్రధాని వార్నింగ్

Hari Prasad S HT Telugu
Oct 28, 2022 09:40 AM IST

Pakistan vs Zimbabwe: జింబాబ్వే అధ్యక్షుడికి పాకిస్థాన్ ప్రధాని గట్టి వార్నింగ్‌ ఇచ్చారు. గురువారం (అక్టోబర్‌ 27) టీ20 వరల్డ్‌కప్‌లో పాకిస్థాన్‌ను జింబాబ్వే ఓడించిన తర్వాత దేశాధినేతల మధ్య మాటల యుద్ధం జరగడం గమనార్హం.

పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్, జింబాబ్వే అధ్యక్షుడు ఎమర్సన్
పాకిస్థాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్, జింబాబ్వే అధ్యక్షుడు ఎమర్సన్

Pakistan vs Zimbabwe: పాకిస్థాన్‌, జింబాబ్వే మధ్య టీ20 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ కాస్తా రాజకీయ యుద్ధానికి దారి తీసింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌ను జింబాబ్వే ఓడించిన తర్వాత ఆ దేశ అధ్యక్షుడు ఎమర్సన్‌ డంబుడ్జో ఎంనంగాగ్వా చేసిన ట్వీట్‌పై పాకిస్థాన్‌ ప్రధాని షాబాజ్‌ షరీఫ్‌ మండిపడ్డారు. ఆ వెంటనే జింబాబ్వే అధ్యక్షుడికి ట్వీట్‌ ద్వారానే ఆయన వార్నింగ్‌ ఇచ్చారు.

ట్రెండింగ్ వార్తలు

జింబాబ్వే అధ్యక్షుడు తన ట్వీట్‌లో 'అసలైన మిస్టర్‌ బీన్‌' అనే పదాన్ని వాడటం ఈ వివాదానికి కారణమైంది. అసలు ఈ రెండు దేశాల క్రికెట్‌ మ్యాచ్‌, దేశాధ్యక్షుల మధ్య మాటల యుద్ధానికి ఈ మిస్టర్‌ బీన్‌ ఎలా కారణమయ్యాడు అన్న సందేహం మీకు కలగొచ్చు. దీని వెనుక ఆసక్తికరమైన స్టోరీయే ఉంది. అదేంటో చూడండి.

పాక్‌ vs జింబాబ్వే.. ఏంటీ మిస్టర్‌ బీన్‌ వివాదం?

ఈ స్టోరీ తెలుసుకోవాలంటే 2016కు వెళ్లాలి. పాపులర్‌ బ్రిటిష్‌ కమెడియన్‌ రోవన్‌ అట్కిన్సన్‌ వేసిన మిస్టర్‌ బీన్‌ రోల్‌ తెలుసు కదా. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులను ఆకట్టుకున్న పాత్ర. అచ్చూ ఈ మిస్టర్‌ బీన్‌లాగే పాకిస్థాన్‌లోనూ ఆసిఫ్‌ ముహ్మద్‌ అనే కమెడియన్‌ ఉంటాడు. అతడు తానే అసలైన మిస్టర్‌ బీన్‌ అని చెప్పుకుంటూ 2016లో జింబాబ్వేకు వెళ్లాడు.

ఈ మోసాన్ని జింబాబ్వే ప్రజలు ఇప్పటికీ తట్టుకోవడం లేదు. అందుకే వరల్డ్‌కప్‌లో పాక్‌తో జింబాబ్వే తలపడే ఒక రోజు ముందు ఆ దేశానికి చెందిన అభిమాని చేసిన ట్వీట్‌ వైరల్‌ అయింది. ఎన్‌గూగి చసురా అనే ఆ వ్యక్తి తన ట్వీట్‌లో.. "జింబాబ్వియన్లుగా మేము మిమ్మల్ని క్షమించం. మిస్టర్‌ బీన్‌ రోవన్‌కు బదులుగా ఒకప్పుడు మీరు మాకు మోసపూరిత పాక్‌ బీన్‌ను ఇచ్చారు. దానికి రేపు మేము బదులు తీర్చుకోబోతున్నాం. మిమ్మల్ని కాపాడమని వరుణ దేవుడిని వేడుకోండి" అని అన్నాడు.

ఆ ట్వీట్‌ తెగ వైరల్‌ అయింది. అతడు అన్నట్లుగా పాకిస్థాన్‌ను చివరి బంతికి ఒక పరుగు తేడాతో జింబాబ్వే ఓడించడంలో ఆ దేశాభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇప్పుడదే మిస్టర్‌ బీన్‌ కామెంట్‌తో పాకిస్థాన్‌ను జింబాబ్వే అధ్యక్షుడు కూడా టార్గెట్‌ చేశాడు.

జింబాబ్వే అధ్యక్షుడి ట్వీట్‌లో ఏముంది?

గురువారం (అక్టోబర్‌ 27) పాకిస్థాన్‌ను జింబాబ్వే ఓడించిన తర్వాత ఆ దేశ అధ్యక్షుడు ఎమర్సన్‌ ఓ ట్వీట్‌ చేశారు. "జింబాబ్వేకు గొప్ప విజయం. చెవ్రాన్లకు శుభాకాంక్షలు. ఈసారి నిజమైన మిస్టర్ బీన్‌ను పంపించండి" అంటూ పాకిస్థాన్‌కు చురక అంటించారు. అయితే ఈ ట్వీట్‌కు రెండు గంటల్లోనే పాక్‌ ప్రధాని షాబాజ్‌ షరీఫ్‌ కూడా రిప్లై ఇచ్చారు.

"మా దగ్గర నిజమైన మిస్టర్ బీన్ లేకపోవచ్చు, కానీ నిజమైన క్రికెట్‌ స్ఫూర్తి ఉంది. మా పాకిస్థానీలకు బలంగా పుంజుకునే సరదా అలవాటు ఉంది. మిస్టర్ ప్రెసిడెంట్‌.. కంగ్రాచులేషన్స్‌. మీ టీమ్ చాలా బాగా ఆడింది" అని షాబాజ్ షరీఫ్‌ ట్వీట్‌ చేశారు. ఓ క్రికెట్‌ మ్యాచ్‌పై, అందులోనూ ఓ అభిమాని చేసిన ట్వీట్‌పై ఈ ఇద్దరు దేశాధినేతల మధ్య ట్వీట్‌ వార్‌ వైరల్‌ అవుతోంది.

WhatsApp channel