Asad Rauf: అంపైర్ గా సుదీర్ఘకాలం పాటు క్రికెట్ అభిమానులను అలరించిన అసద్ రౌఫ్ గుండెపోటుతో లాహోర్ లో కన్నుమూశాడు. 2000 ఏడాది నుంచి 2013 వరకు దాదాపు పదమూడేళ్ల పాటు 231 అంతర్జాతీయ మ్యాచ్ లకు అంపైర్ గా వ్యవహరించాడు అసద్ రౌఫ్. 1998లో ఫస్ట్ క్లాస్ క్రికెట్ తో రౌఫ్ అంపైరింగ్ కెరీర్ మొదలైంది. 2000 ఏడాదిలో తొలి వన్డే ఇంటర్ నేషనల్ మ్యాచ్ కు అంపైరింగ్ చేశాడు. 2005లో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు.
2006లో ఐసీసీ ఎలైట్ ఎంపైర్ ప్యానల్ లో చోటు దక్కించుకున్నాడు. అలీమ్ దార్ తర్వాత పాకిస్థాన్ నుంచి అంపైర్ గా ఎక్కువ పేరు ప్రఖ్యాతులు దక్కించుకున్నది రౌఫ్ మాత్రమే. అంపైర్ గానే కాకుండా ఫస్ట్ క్లాస్ క్రికెటర్ గా రౌఫ్ ప్రతిభను చాటుకున్నాడు. 71 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లలో 3423 రన్స్ చేశాడు. 1986 87 ఏడాదిలో ఒక సెంచరీ, ఐదు హాఫ్ సెంచరీలతో రాణించాడు.
2013 ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ లో అసద్ పేరు వెలుగులోకి రావడంతో అతడి కెరీర్ ప్రశ్నార్థకంగా మారిపోయింది. బుకీల నుంచి ఖరీదైన బహుమతులు తీసుకోవడంతో పాటు లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో బీసీసీఐ రౌఫ్ పై నిషేదం విధించింది. నిషేదం ముగిసినా అంపైర్ గా తిరిగి కెరీర్ మొదలుపెట్టడానికి ఇష్టపడలేదు రౌఫ్. ఇటీవలే లాహోర్ లో సెకండ్ హ్యాండ్ బట్టల షాపు నిర్వహిస్తూ రౌఫ్ కనిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోపై రౌఫ్ స్పందిస్తూ తన వద్ద పనిచేసే వారి కోసమే ఈ షాప్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నాడు.