Olympics Medalist: మాకు రూ.5 కోట్లు, ఓ ఫ్లాట్ కావాలి: ఒలింపిక్స్ మెడలిస్ట్ తండ్రి డిమాండ్.. కంగుతిన్న ప్రభుత్వం
Olympics Medalist: పారిస్ ఒలింపిక్స్ బ్రాంజ్ మెడలిస్ట్ స్వప్నిల్ కుశాలె తండ్రి సురశ్ కుశాలె తమకు రూ.5 కోట్లు, ఓ ఫ్లాట్ కావాలని డిమాండ్ చేయడం విశేషం. హర్యానా ప్రభుత్వం ఇస్తున్నప్పుడు మీరెందుకు ఇవ్వరంటూ మహారాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.
Olympics Medalist: ఒలింపిక్స్ లో మెడల్ గెలిచి దేశాన్ని గర్వపడేలా చేసిన అథ్లెట్లకు ఆయా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు భారీ ప్రైజ్ మనీ ఇవ్వడం సాధారణమే. అయితే ఈసారి మాత్రం ఓ అథ్లెట్ తండ్రి తమకు రూ.5 కోట్లు కావాలని డిమాండ్ చేస్తున్నారు. పారిస్ ఒలింపిక్స్ షూటింగ్ లో అనూహ్యంగా బ్రాంజ్ మెడల్ గెలిచిన స్వప్నిల్ కుశాలె తండ్రి సురేశ్ కుశాలె చేసిన ఈ డిమాండ్ కు ప్రభుత్వం కంగుతిన్నది.
![yearly horoscope entry point](https://telugu.hindustantimes.com/static-content/1y/astro-pages-content/astro-entry-point-mobile.png)
రూ.5 కోట్లు ఇవ్వాల్సిందే..
స్వప్నిల్ కుశాలె పారిస్ ఒలింపిక్స్ 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్ లో బ్రాంజ్ మెడల్ గెలిచాడు. తన కొడుకు సాధించిన ఘనతకు తగిన గుర్తింపు దక్కాల్సిందే అని అతని తండ్రి సురేశ్ కుశాలె ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి తమకు కేవలం రూ.2 కోట్లే దక్కినట్లు ఆయన చెప్పారు.
"హర్యానా ప్రభుత్వం మెడల్ గెలిచిన ఒక్కొక్కరికి రూ.5 కోట్లు ఇస్తోంది కదా" అని పీటీఐతో మాట్లాడుతూ సురేశ్ అన్నారు. నిజానికి హర్యానా ప్రభుత్వం గోల్డ్ గెలిస్తే రూ.6 కోట్లు, సిల్వర్ గెలిస్తే రూ.4 కోట్లు, బ్రాంజ్ గెలిస్తే రూ.2.5 కోట్లు ఇస్తోంది. ఈసారి పారిస్ ఒలింపిక్స్ లో వచ్చిన ఐదు వ్యక్తిగత పతకాల్లో హర్యానాకు చెందిన అథ్లెట్లే నాలుగు సాధించారు.
72 ఏళ్లలో మావాడే తొలి వ్యక్తి..
ఇక 72 ఏళ్ల తర్వాత మహారాష్ట్ర నుంచి ఒలింపిక్స్ లో మెడల్ గెలిచిన తొలి వ్యక్తిగా స్వప్నిల్ నిలిచాడు. 1952లో రెజ్లింగ్ లో కేడీ జాదవ్ తర్వాత ఇప్పుడు స్వప్నిల్ షూటింగ్ లో బ్రాంజ్ సొంతం చేసుకున్నాడు. మరి ఇంతటి ఘనత సాధించిన తన కొడుకుకు ఇచ్చేది ఇంతేనా అంటూ సురేశ్ ప్రశ్నించారు.
"మహారాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిన కొత్త పాలసీ ప్రకారం బ్రాంజ్ మెడల్ గెలిచిన వారికి రూ.2 కోట్లే ఇస్తారట. కానీ 72 ఏళ్లలో మహారాష్ట్ర నుంచి మెడల్ గెలిచిన తొలి వ్యక్తిగా నిలిచిన స్వప్నిల్ కు ఇలాంటి రూల్ ఎందుకు పెడతారు" అని ప్రశ్నించారు.
తన కొడుకు ఓ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినందుకే ఇలా చేశారా అని కూడా నిలదీశారు. "స్వప్నిల్ ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడని ఇలా తక్కువ మొత్తం ఇచ్చారా? అదే ఓ ఎమ్మెల్యే లేదా మంత్రి కొడుకు గెలిస్తే ఇంతే ఇస్తారా? స్వప్నిల్ కు రూ.5 కోట్లు ఇవ్వాలి. బాలేవాడీ స్పోర్ట్స్ స్టేడియం దగ్గర ఓ ఫ్లాట్ ఇవ్వాలి. అంతేకాదు 50 మీటర్ల త్రీ పొజిషన్ అరెనాకు స్వప్నిల్ పేరు పెట్టాలి" అని సురేశ్ డిమాండ్ చేశారు.
గతంలో మహారాష్ట్రకే చెందిన చిరాగ్ శెట్టి కూడా ఇలాగే నిలదీశాడు. టీ20 వరల్డ్ కప్ గెలవగానే రోహిత్ లాంటి ప్లేయర్స్ ను మహారాష్ట్ర ప్రభుత్వం సత్కరించిందని, కానీ తాను థామస్ కప్ గెలిచినా పట్టించుకోలేదని అన్నాడు. ఇప్పుడు స్వప్నిల్ కుశాలె తండ్రి కూడా అలాగే అక్కడి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. మరి ఈ డిమాండ్లపై అక్కడి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.