Novak Djokovic Out: షాకింగ్.. గాయంతో సెమీస్ నుంచి జోకొవిచ్ ఔట్.. రిటైర్మెంట్ హింట్ ఇచ్చిన సెర్బియన్ సెన్సేషన్
Novak Djokovic Out: నొవాక్ జోకొవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీఫైనల్లో తొలి సెట్ ఓటమి తర్వాత గాయం కారణంగా తప్పుకున్నాడు. అంతేకాదు తన కండరాల్లో చీలిక ఏర్పడిందని చెబుతూ రిటైర్మెంట్ హింట్ కూడా ఇచ్చాడు.
Novak Djokovic Out: పదిసార్లు ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన సెర్బియన్ సెన్సేషన్ నొవాక్ జోకొవిచ్ ఈసారి మాత్రం గాయంతో సెమీఫైనల్ తొలి సెట్ ముగియగానే తప్పుకున్నాడు. అలెగ్జాండర్ జ్వెరెవ్ తో జరిగిన మ్యాచ్ లో తొలి సెట్ ను జోకొవిచ్ 6-7తో కోల్పోయాడు. ఆ వెంటనే గాయం కారణంగా ఇక కొనసాగలేనంటూ కోర్టు వదిలి వెళ్లిపోయాడు. తన కాలి కండరాల్లో చీలిక ఉన్నట్లు చెప్పాడు.
జోకొవిచ్ పోరాడినా..
సెర్బియన్ స్టార్, అత్యధిక గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ గెలిచిన ప్లేయర్ అయిన నొవాక్ జోకొవిచ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ లో మొదటి రౌండ్ నుంచే గాయంతో బాధపడుతూ పోరాడాడు. క్వార్టర్ ఫైనల్లోనూ గాయం వేధిస్తున్నా కార్లోస్ అల్కరాజ్ ను ఓడించి సెమీఫైనల్లో అడుగుపెట్టాడు.
అయితే ఇక్కడ మాత్రం తొడ కండరాల గాయంతో తొలి సెట్ ను మించి ఆడలేకపోయాడు. తొలి సెట్ లోనూ జోకర్ ఇబ్బంది పడుతూనే కనిపించాడు. తొలి సెట్ ముగియగానే అతడు తప్పుకుంటున్నట్లు చెప్పడంతో ప్రత్యర్థి జ్వెరెవ్, రాడ్ లేవర్ అరెనాలోని అభిమానులు షాక్ కు గురయ్యారు. కొందరు ఫ్యాన్స్ అతన్ని హేళన చేశారు.
జోకొవిచ్ రిటైరవుతున్నాడా?
సెమీ ఫైనల్ తర్వాత జోకొవిచ్ మీడియాతో మాట్లాడాడు. తన తొడ కండరాల్లో చీలిక వచ్చిందని ఈ సందర్భంగా అతడు చెప్పాడు. "కండరాల్లో చీలిక ఉన్నా నాకు సాధ్యమైనంత వరకు ప్రయత్నించాను. మెడికేషన్స్, ఫిజియో వల్ల ఈరోజు కాస్త ఆడగలిగాను.
కానీ తొలి సెట్ ముగిసే సమయానికి మరింత నొప్పి బాధించింది. దీనిని హ్యాండిల్ చేయడం నాకు చాలా ఎక్కువగా అనిపించింది. ఇది దురదృష్టకరం. కానీ నేను ప్రయత్నించాను" అని జోకొవిచ్ అన్నాడు.
ఇక రిటైర్మెంట్ పైనా అతడు హింట్ ఇచ్చాడు. "నాకు తెలియదు. ఆ ఛాన్స్ కూడా ఉంది. ఎవరికి తెలుసు? ఈ సీజన్ ఎలా గడుస్తుందో చూడాలి. నేను ఆడుతూనే ఉండాలని అనుకుంటున్నాను.
కానీ వచ్చే ఏడాది రివైజ్డ్ షెడ్యూల్ ఉంటుందో లేదో చూడాలి, కచ్చితంగా తెలియదు" అని రిటైర్మెంట్ గురించి అడిగినప్పుడు జోకొవిచ్ అన్నాడు. కెరీర్లో ఇప్పటికే 24 గ్రాండ్ స్లామ్స్ గెలవగా.. అందులో 10 ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్సే కావడం విశేషం.
సంబంధిత కథనం