టెన్నిస్ లెజెండ్ నొవాక్ జకోవిచ్ రికార్డు నమోదు చేశాడు. హిస్టరీ క్రియేట్ చేశాడు. ఏటీపీ మాస్టర్స్ 1000 టోర్నీలో సెమీస్ చేరిన ఓల్డెస్ట్ ప్లేయర్ గా నిలిచాడు. 37 ఏళ్ల ఈ సెర్బియా ఆటగాడు అతిపెద్ద వయస్సు ఆటగాడిగా రికార్డు అందుకున్నాడు. తాజాగా మియామి ఓపెన్ లో జకోవిచ్ సెమీఫైనల్ చేరాడు. క్వార్టర్స్ లో సెబాస్టియన్ కోర్డాపై విజయం సాధించాడు.
37 ఏళ్ల 10 నెలల వయసులో జకోవిచ్ ఈ ఫీట్ సాధించాడు. ఈ క్రమంలో ఫెదరర్ (37 నెలల 7 నెలలు) రికార్డును బ్రేక్ చేశాడు.
మియామి ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ లో నొవాక్ జకోవిచ్ దూసుకెళ్తున్నాడు. క్వార్టర్స్ లో జకోవిచ్ 6-3, 7-6 (7/4)తో అమెరికాకు చెందిన సెబాస్టియన్ కోర్డాపై గెలిచాడు. ఈ విజయంతో మాస్టర్స్ 1000 టోర్నీలో సెమీఫైనల్ కు చేరిన అతి పెద్ద వయస్కుడిగా నిలిచాడు.
37 ఏళ్ల సెర్బియా ఆటగాడు జకోవిచ్.. కోర్డాపై ఆధిపత్యం ప్రదర్శించాడు. తొలి సెట్లో దూకుడుతో విజయం సాధించిన జకోవిచ్ కు రెండో సెట్లో పోటీ తప్పలేదు. అయినా టైబ్రేకర్ లో ఆ సెట్ ను గెలిచిన జకోవిచ్.. మ్యాచ్ ను ఖాతాలో వేసుకున్నాడు. సెమీస్ లో దిమిత్రోవ్ తో జకోవిచ్ తలపడనున్నాడు.
జకోవిచ్ ఏడోసారి మియామి ఓపెన్ లో విజేతగా నిలవాలనే లక్ష్యంతో ఉన్నాడు. ఇప్పటికే ఈ టోర్నీలో అతను ఆరు సార్లు ఛాంపియన్ గా నిలిచాడు. మరోసారి టైటిల్ ముద్దాడేందుకు అతను రెండు విజయాల దూరంలో ఉన్నాడు. సర్వీస్ పాయింట్లలో జకోవిచ్ దూసుకెళ్తున్నాడు. ఈ టోర్నీలో గెలిస్తే జకోవిచ్ కు అది 100వ సింగిల్ టైటిల్ అవుతుంది.
‘‘ఒకటే వర్డ్. సర్వ్. సర్వీస్ చాలా బాగా చేస్తున్నా. బహుశా ఈ విషయంలో ఉత్తమంగా ఆడుతున్నా. ఇక్కడే కాదు.. సుదీర్ఘ కాలంగా ఇలాగే సర్వీస్ బెటర్ గా చేస్తున్నా. ఫస్ట్ సర్వీస్ కు ముందు పదకొండు ఏస్ లు పడ్డాయి. సెకండ్ సెట్లో కోర్డా నుంచి గట్టి పోటీ ఎదురైంది’’ అని మ్యాచ్ తర్వాత జకోవిచ్ తెలిపాడు.
మరో వైపు చెక్ టీనేజర్ జాకుబ్ మెన్సిక్ 7-6 (7/5), 6-1తో ఆర్థర్ ఫిల్స్ (ఫ్రాన్స్)ను ఓడించి తన తొలి మాస్టర్స్ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. బుధవారం టాప్ సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ ను ఓడించడం ద్వారా ఫిల్స్ తన కెరీర్ లో అతిపెద్ద విజయాన్ని సాధించాడు.
సంబంధిత కథనం