India vs New Zealand 1st ODI: చేతులెత్తేసిన భారత బౌలర్లు.. న్యూజిలాండ్ ఘనవిజయం
India vs New Zealand 1st ODI: ఈడెన్ పార్క్ వేదికగా భారత్‌తో జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. టీమిండియా నిర్దేశించిన 306 పరుగుల లక్ష్యాన్ని 3 వికెట్లతో ఛేదించింది. టామ్ లాథమ్ సెంచరీతో విజృంబించగా.. కేన్ విలియమ్సన్ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు.
India vs New Zealand 1st ODI: న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా టీమిండియా నేడు ఆ జట్టుతో మొదటి వన్డే ఆడింది. ఈ మ్యాచ్‌లో కివీస్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈడెన్ పార్క్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టామ్ లాథమ్ సెంచరీతో విజృంభించగా.. కెప్టెన్ కేన్ విలియమ్సన్ అర్ధశతకంతో అదరగొట్టాడు. 307 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. వరుసగా కీలక మ్యాచ్‌ల్లో విఫలమవుతున్న టీమిండియా బౌలర్లు మరోసారి పేలవ ప్రదర్శన చేయడంతో భారీ స్కోరు చేసి కూడా భారత్ ఓటమి పాలైంది. ఉమ్రాన్ మాలిక్ 2 వికెట్లు తీయగా.. శార్దూల్ ఠాకూర్ ఓ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.
టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ తీసుకున్న న్యూజిలాండ్ జట్టు.. బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌పై భారత్‌ను చివర్లో అడ్డుకట్ట వేసింది. ఆరంభంలో పరుగులు సమర్పించుకున్నప్పటికీ చివర్లో టీమిండియాను నిలువరించారు. ఫలితంగా టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన న్యూజిలాండ్ జట్టుకు శుభారంభమేమి దక్కలేదు. ఆరంభంలో నిదానంగా ఆడిన కివీస్.. అనంతరం పుంజుకుంది. 8వ ఓవర్లోనే ఓపెనర్ అలెన్ ఫిన్ వికెట్ శార్దుల్ భారత్‌కు శుభారంభం ఇచ్చాడు. అనంతరం కాసేటపికే ఫామ్‌లో ఉన్న డేవాన్ కాన్వే వికెట్ తీశాడు ఉమ్రాన్ మాలిక్. స్వల్ప వ్యవధిలోనే ఉమ్రాన్ డారిల్ మిచెల్ వికెట్‌ను కూడా న్యూజిలాండ్‌ను ఆత్మరక్షణలోకి నెట్టాడు.
ఇలాంటి సమయంలో కెప్టెన్ కేన్ విలియమ్సన్(94), టామ్ లాథమ్ కలిసి అద్భుతమే చేశారు. ఆరంభంలో నిదానంగా ఆడుతూ.. అనంతరం ఇన్నింగ్స్‌పై పూర్తి పట్టు సాధించారు. ముఖ్యంగా టామ్ లాథమ్(145) వరుస పెట్టి బౌండరీలు, సిక్సర్లు బాదుతూ విద్వంసం సృష్టించాడు. ఇదే క్రమంలో అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. అనంతరం ఇంకా దూకుడు పెంచి సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. 104 బంతుల్లో 145 పరుగులతో అదరగొట్టాడు. ఇందులో 19 ఫోర్లు 5 సిక్సర్లు ఉన్నాయి.
మరోపక్క కేన్ విలియమ్సన్ కూడా లాథమ్‌కు చక్కగా సహకరిస్తూ ఆకట్టుకునే ప్రదర్శన చేశాడు. సింగిల్స్ రోటేట్ చేయడమే కాకుండా.. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీని బాదుతూ అదరగొట్టాడు. ఈ క్రమంలోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 98 బంతుల్లో 94 పరుగులతో మెరుగైన ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో 7 ఫోర్లు ఓ సిక్సర్ ఉన్నాయి. టామ్ లాథమ్‌తో కలిసి స్కోరు వేగాన్ని పెంచాడు. వీరిద్దరూ కలిసి మరో వికెట్ పడకుండా లక్ష్యాన్ని పూర్తి చేశారు. ఇద్దరూ కలిసి 221 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
భారత బౌలర్ల పేలవ ప్రదర్శనను న్యూజిలాండ్ బ్యాటర్లు చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. ఆరంభంలో నిదానంగా ఆడి.. అనంతరం దూకుడు పెంచారు. ఫలితంగా మరో మూడు ఓవర్లు మిగిలుండగానే లక్ష్యాన్ని పూర్తి చేశారు. 47.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి కివీస్ 309 పరుగులతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసింది. శిఖర్ ధావన్(72), శుభ్ మన్ గిల్(50), శ్రేయాస్ అయ్యర్(80) అర్ధశతకాలతో ఆకట్టుకున్నప్పటికీ టీమిండియాకు ఓటమి తప్పలేదు. ఫలితంగా 3 వన్డేల సిరీస్‌ను న్యూజిలాండ్ 1-0 తేడాతో ఆధిక్యాన్ని సాధించింది.
సంబంధిత కథనం