New Zealand vs Afghanistan: టీ20 వరల్డ్‌కప్‌లో మరో మ్యాచ్‌ను మింగేసిన వర్షం
New Zealand vs Afghanistan: టీ20 వరల్డ్‌కప్‌లో మరో మ్యాచ్‌ను వర్షం మింగేసింది. మెల్‌బోర్న్‌లో కురిసిన ఎడతెరిపి లేని వర్షం కారణంగా న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది.
New Zealand vs Afghanistan: టీ20 వరల్డ్‌కప్‌ను వరుణుడు వెంటాడుతూనే ఉన్నాడు. సూపర్ 12 స్టేజ్‌లో ఇప్పటికే సౌతాఫ్రికా, జింబాబ్వే మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది. ఆ తర్వాత ఇంగ్లండ్, ఐర్లాండ్ మ్యాచ్ కూడా వర్షం కారణంగా ముందే ముగియగా.. అది ఐర్లాండ్‌కు కలిసొచ్చింది. ఇక ఇప్పుడు గ్రూప్ 1లోనే న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది.
దీంతో ఈ రెండు టీమ్స్ పాయింట్లు పంచుకున్నాయి. ఈ వర్షం పెద్ద టీమ్స్ కొంప ముంచుతోంది. వాళ్ల సెమీస్ అవకాశాలను ప్రభావితం చేస్తోంది. మంగళవారం (అక్టోబర్ 25) జింబాబ్వేపై సౌతాఫ్రికా సులువుగా గెలిచే సమయంలో వర్షం కారణంగా మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది. ఇక బుధవారం (అక్టోబర్ 26) ఉదయం మెల్‌బోర్న్‌లోనే జరిగిన మ్యాచ్‌లో వర్షం కారణంగా డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఇంగ్లండ్‌ను 5 రన్స్ తేడాతో ఐర్లాండ్ ఓడించింది.
ఈ రెండు మ్యాచ్‌లు సౌతాఫ్రికా, ఇంగ్లండ్ సెమీస్ అవకాశాలను దెబ్బ తీసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇప్పుడు న్యూజిలాండ్‌కు కూడా అదే పరిస్థితి ఎదురైంది. అయితే ఆ టీమ్ తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను చిత్తు చేయడంతో ఇప్పటికీ గ్రూప్ 1లో టాప్‌లో కొనసాగుతోంది. ఆ టీమ్ నెట్ రన్‌రేట్ 4.45తో చాలా మెరుగ్గా ఉంది. అటు ఆఫ్ఘనిస్థాన్ తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతుల్లో ఓడి, ఈ మ్యాచ్ రద్దవడంతో చివరి స్థానంలో ఉంది.
నిజానికి ఆదివారం ఇండియా, పాకిస్థాన్ మధ్య మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లోనే జరిగిన మ్యాచ్‌కు వర్షం అడ్డు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే ఆ మ్యాచ్ ఎలాంటి అడ్డంకి లేకుండా సజావుగా సాగడంతో కోట్లాది మందికి ఓ థ్రిల్లింగ్ మ్యాచ్ చూసే అవకాశం దక్కింది. ముఖ్యంగా మెల్‌బోర్న్, హోబర్ట్, బ్రిస్బేన్ వేదికల్లో జరిగే మ్యాచ్‌లకు వర్షం అడ్డు తగులుతోంది. మరి రానున్న రోజుల్లో వరుణుడు ఏ టీమ్ అవకాశాలను ఎలా ప్రభావితం చేయనున్నాడో చూడాలి.