Neeraj Chopra Asian Games: నీరజ్ చోప్రాకు స్వర్ణం.. రజతం కూడా భారత్‍కే-neeraj chopra wins gold kishore jena bags silver in asian games javelin throw ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Neeraj Chopra Asian Games: నీరజ్ చోప్రాకు స్వర్ణం.. రజతం కూడా భారత్‍కే

Neeraj Chopra Asian Games: నీరజ్ చోప్రాకు స్వర్ణం.. రజతం కూడా భారత్‍కే

Chatakonda Krishna Prakash HT Telugu
Oct 04, 2023 06:51 PM IST

Neeraj Chopra - Asian Games: ఏషియన్ గేమ్స్‌లో భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా సత్తాచాటారు. స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఈ విభాగంలో రజత పతకం కూడా ఇండియాకే వచ్చింది.

నీరజ్ చోప్రా
నీరజ్ చోప్రా (REUTERS)

Neeraj Chopra - Asian Games: భారత స్టార్ జావెలిన్ త్రోవర్, ప్రపంచ చాంపియన్ నీరజ్ చోప్రా మరోసారి సత్తాచాటారు. చైనాలోని హాంగ్జౌ వేదికగా జరుగుతున్న 19వ ఏషియన్ క్రీడల్లో విజృంభించారు. స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఏషియన్ గేమ్స్‌లో నేడు (అక్టోబర్ 4) జరిగిన పురుషుల జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా బంగారు పతకం గెలిచారు. ఈటెను 88.88 మీటర్లు విసిరి అగ్రస్థానంలో నిలిచారు. పసిడిని పట్టారు. ఇదే ఈవెంట్‍లో భారత అథ్లెట్ కిశోర్ జెనా రజత పతకం గెలిచారు. 87.54 మీటర్లు ఈటెను విసిరిన కిశోర్.. రెండో స్థానంలో నిలిచి వెండి పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఏషియన్ గేమ్స్ జావెలిన్‍ త్రోలో ఒకేసారి భారత్‍కు స్వర్ణం, రజతం రావడం ఇదే తొలిసారి.

గత ఏషియన్ క్రీడల్లో స్వర్ణ పతకాన్ని నిలిచిన నీరజ్ చోప్రా.. మరోసారి చాంపియన్‍గా నిలిచారు. ఈసారి ఆసియా క్రీడల్లోనూ బంగారు మెడల్ కైవసం చేసుకొని అదరగొట్టారు. ఇక రజత పతకాన్ని గెలిచిన కిశోర్ జెనా.. 2024 పారిస్ ఒలింపిక్ క్రీడలకు కూడా అర్హత సాధించారు.

ఈ జావెలిన్ త్రో ఫైనల్‍లో నాలుగో ప్రయత్నంలో 88.88 మీటర్లు ఈటెను విసిరి టాప్‍లో నిలిచారు నీరజ్. బంగారు పతకాన్ని గెలిచారు. కిశోర్ జెనా కూడా నాలుగో ప్రయత్నంలో 87.54 మీటర్లు ఈటెను విసిరి రెండో స్థానంలో నిలిచారు.

2020 ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించారు నీరజ్ చోప్రా. ఈ ఏడాది ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‍షిప్‍లోనూ బంగారు మెడల్ గెలిచి ప్రపంచ చాంపియన్‍గా నిలిచారు. ఇప్పుడు ఏషియన్ గేమ్స్‌లోనూ మరోసారి స్వర్ణంతో నీరజ్ మెరిశారు.

పురుషుల 4x400 మీటర్ల విభాగంలోనూ నేడు భారత్‍కు స్వర్ణ పతకం దక్కింది. అనస్ మహమ్మద్ యహియా, అమోజ్ జాకోబ్, మహమ్మద్ అజ్మల్ వరియతోడి, రాజేశ్ రమేశ్‍తో కూడిన భారత జట్టు బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది.

భారత్ ఇప్పటి వరకు..

19వ ఏషియన్ క్రీడల్లో ఇప్పటి వరకు (అక్టోబర్ 4, సాయంత్రం) భారత్ 80 పతకాలను దక్కించుకుంది. ఇందులో 18 స్వర్ణాలు, 30 రజతాలు, 32 కాంస్య పతకాలు ఉన్నాయి. ఏషియన్ గేమ్స్ చరిత్రలో ఇండియా తొలిసారి 80 పతకాల మార్కు చేరింది. ఈసారి ఆసియా క్రీడల్లో 100 పతకాలు గెలవాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంది.