Naseem Shah in Hospital: హాస్పిటల్‌లో చేరిన పాకిస్థాన్‌ పేస్‌ బౌలింగ్‌ సెన్సేషన్-naseem shah in hospital as he is suffering from serious viral infection ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Naseem Shah In Hospital As He Is Suffering From Serious Viral Infection

Naseem Shah in Hospital: హాస్పిటల్‌లో చేరిన పాకిస్థాన్‌ పేస్‌ బౌలింగ్‌ సెన్సేషన్

Hari Prasad S HT Telugu
Sep 28, 2022 03:54 PM IST

Naseem Shah in Hospital: హాస్పిటల్‌లో చేరాడు పాకిస్థాన్‌ పేస్‌ బౌలింగ్‌ సెన్సేషన్‌ నసీమ్‌ షా. దీంతో బుధవారం (సెప్టెంబర్‌ 28) ఇంగ్లండ్‌తో జరగబోయే ఐదో టీ20 మ్యాచ్‌కు అతడు దూరం కానున్నాడు.

పాకిస్థాన్ పేస్ బౌలర్ నసీమ్ షా
పాకిస్థాన్ పేస్ బౌలర్ నసీమ్ షా (AFP)

Naseem Shah in Hospital: ఆసియాకప్‌ 2022తో వెలుగులోకి వచ్చిన పాకిస్థాన్‌ పేస్‌ బౌలింగ్‌ సెన్సేషన్‌ నసీమ్‌ షాను హుటాహుటిన హాస్పిటల్‌కు తరలించారు. అతడు తీవ్రమైన వైరల్‌ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతుండటమే ఇందుకు కారణం. దీంతో బుధవారం (సెప్టెంబర్ 28) ఇంగ్లండ్‌తో జరగబోయే ఐదో టీ20 మ్యాచ్‌కు నసీమ్‌ దూరం కానున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

మంగళవారం రాత్రి అతని ఆరోగ్యం క్షీణించడంతో వెంటనే లాహోర్‌లోని హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. బుధవారం అతని పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు మేనేజ్‌మెంట్‌ చెప్పింది. అయితే మిగతా సిరీస్‌లో అతడు ఆడతాడా లేదా అన్నది అనుమానంగా మారింది. వైరల్ ఇన్ఫెక్షన్‌ కారణంగానే అతన్ని హాస్పిటల్‌కు తీసుకెళ్లినట్లు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ఒక ప్రకటనలో వెల్లడించింది.

బుధవారం ఇంగ్లండ్‌తో జరగబోయే ఐదో టీ20లో అతడు ఆడబోవడం లేదని, మిగతా సిరీస్‌లో ఆడతాడా లేదా అన్నదానిపై డాక్టర్ల సలహా మేరకు తుది నిర్ణయం తీసుకుంటామని పీసీబీ స్పష్టం చేసింది. కొన్ని రోజులుగా పాకిస్థాన్‌లోని లాహోర్‌ నగరంలో డెంగ్యూ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రతి రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి.

దీంతో ప్లేయర్స్‌ అందరికీ డెంగ్యూ టెస్టులు నిర్వహించారు. కరాచీలో తొలి నాలుగు టీ20 ముగించుకొని మంగళవారం పాకిస్థాన్‌, ఇంగ్లండ్‌ టీమ్స్‌ లాహోర్‌ చేరుకున్నాయి. అయితే అక్కడికి వచ్చిన తర్వాత తన ఛాతీలో నొప్పిగా ఉందని, జ్వరం కూడా ఉన్నట్లు నసీమ్‌ చెప్పాడు. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌ ఆడిన నసీమ్‌.. తర్వాత మూడు టీ20లకు దూరంగా ఉన్నాడు.

21 ఏళ్ల నసీమ్‌ షా ఆసియాకప్‌లో సంచలనం రేపిన విషయం తెలిసిందే. తన బౌలింగ్‌తోపాటు ఓ మ్యాచ్‌లో బ్యాట్‌తోనూ అద్భుతం చేశాడు. ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన కీలకమైన మ్యాచ్‌లో వరుసగా రెండు సిక్స్‌లు కొట్టి పాక్‌ను ఫైనల్‌ చేర్చాడు. ఆ తర్వాత ఈ బ్యాట్‌ను పాకిస్థాన్‌ వరదల వల్ల నష్టపోయిన వారికి సాయం చేసేందుకు వేలం వేయడానికి షాహిద్‌ అఫ్రిది ఫౌండేషన్‌కు ఇచ్చాడు. టీ20 వరల్డ్‌కప్‌ టీమ్‌లోనూ నసీమ్‌ షా చోటు సంపాదించాడు.

WhatsApp channel