Mohammad Amir: పాకిస్థాన్‌ను వదిలేస్తున్నా.. ఇక ఐపీఎల్లో ఆడతా: మహ్మద్ ఆమిర్
Mohammad Amir: పాకిస్థాన్‌ను వదిలేస్తున్నా.. ఇక ఐపీఎల్లో ఆడతానని మాజీ పేస్ బౌలర్ మహ్మద్ ఆమిర్ చెప్పడం గమనార్హం. అతనికి వచ్చే ఏడాది బ్రిటన్ పాస్‌పోర్టు దక్కబోతోంది.
Mohammad Amir: పాకిస్థాన్‌కు చెందిన ప్రస్తుత లేదంటే మాజీ ప్లేయర్స్ ఐపీఎల్లో ఆడగలరా? అస్సలు ఛాన్సే లేదు. 2008లో జరిగిన తొలి సీజన్‌లో ఆడే అవకాశం దక్కినా.. అదే ఏడాది ముంబై దాడుల తర్వాత ఏ పాకిస్థాన్ ప్లేయర్ కు కూడా అవకాశం ఇవ్వలేదు. అయితే ఆ దేశానికి చెందిన మాజీ పేస్ బౌలర్ మహ్మద్ ఆమిర్ మాత్రం ఐపీఎల్లో ఆడతానన్న ఆశాభావం వ్యక్తం చేశాడు.
ఎలా అని ఆలోచిస్తున్నారా? ఆమిర్ కు వచ్చే ఏడాది బ్రిటిష్ పాస్‌పోర్ట్ రాబోతోంది. అంటే అతడు ఇక ఏమాత్రం పాకిస్థాన్ పౌరుడు కాదు. మరి బ్రిటన్ ప్లేయర్ గా అతడు ఐపీఎల్లో ఆడతాడా? ఈ ప్రశ్నకు ఆమిర్ సమాధానమిచ్చాడు. అవకాశం వస్తే కచ్చితంగా అని అతడు అనడం విశేషం.
"నాకు ఏడాది సమయం ఉంది. పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. నేను ఎప్పుడూ ఒక్కో అడుగూ వేస్తాను. ఏడాది తర్వాత నేను ఎలా ఉంటానో తెలియదు. భవిష్యత్తు ఎవరికీ తెలియదు. నాకు పాస్‌పోర్టు దక్కిన తర్వాత నాకు దక్కే అత్యుత్తమ అవకాశాన్ని అందిపుచ్చుకుంటాను" అని ఆమిర్ స్పష్టం చేశాడు. అయితే తాను ఇంగ్లండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ మాత్రం ఆడబోనని తేల్చి చెప్పాడు.
"నేను ఇంగ్లండ్ తరఫున ఆడను. నేను ఇప్పటికే ఆడాల్సిన అంతర్జాతీయ క్రికెట్ మొత్తం పాకిస్థాన్ తరఫున ఆడేశాను. అల్లా కరుణిస్తే మళ్లీ పాకిస్థాన్ తరఫున ఆడతాను. కానీ నేను పాకిస్థాన్ సూపర్ లీగ్ లో ఆడి, రాణించాలని కోరుకుంటున్నాను" అని ఆమిర్ అన్నాడు.
2020లో మహ్మద్ ఆమిర్ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు. అప్పటి టీమ్ మేనేజ్‌మెంట్ తనతో వ్యవహరించిన తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన ఆమిర్.. అర్ధంతరంగా క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. అంతకుముందు జట్టులోకి వచ్చిన కొత్తలోనే స్పాట్ ఫిక్సింగ్ లో ఇరుక్కొని కొన్నేళ్ల పాటు నిషేధానికి కూడా గురయ్యాడు.
సంబంధిత కథనం
టాపిక్