IPL 2022 CSK vs GT | మిల్లర్‌ సూపర్‌ హిట్టింగ్‌.. రషీద్‌ సంచలన ఇన్నింగ్స్‌.. చెన్నైకి షాక్‌-miller and rashid khan wins it for gt against csk in ipl 2022 ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Miller And Rashid Khan Wins It For Gt Against Csk In Ipl 2022

IPL 2022 CSK vs GT | మిల్లర్‌ సూపర్‌ హిట్టింగ్‌.. రషీద్‌ సంచలన ఇన్నింగ్స్‌.. చెన్నైకి షాక్‌

Hari Prasad S HT Telugu
Apr 17, 2022 11:18 PM IST

గుజరాత్‌ టైటన్స్‌కు అసలు ఆశలే లేని స్థితి నుంచి మ్యాచ్‌ను గెలిపించారు డేవిడ్‌ మిల్లర్‌, స్టాండిన్‌ కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌. క్రిస్‌ జోర్డాన్‌ చెత్త బౌలింగ్‌కు తోడు రషీద్‌ సంచలన ఇన్నింగ్స్, మిల్లర్‌ పవర్‌ హిట్టింగ్‌.. చెన్నై కొంప ముంచింది.

గుజరాత్ టైటన్స్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్
గుజరాత్ టైటన్స్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ (PTI)

పుణె: డేవిడ్‌ మిల్లర్‌ సూపర్‌ పవర్‌ హిట్టింగ్‌తో గుజరాత్‌ సంచలన విజయం సాధించింది. 170 పరుగుల లక్ష్యాన్ని మరో బంతి మిగిలి ఉండగానే 7 వికెట్లు కోల్పోయి చేజ్‌ చేసింది గుజరాత్‌. అంతకుముందు స్టాండిన్‌ కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌ కూడా అద్భుతమే చేశాడు. గుజరాత్‌ విజయంపై ఆశలు వదులుకున్న సమయంలో కేవలం 21 బంతుల్లో 40 పరుగులు చేసిన రషీద్‌.. చెన్నై గెలుపు ఆశలపై నీళ్లు చల్లగా.. చివరి వరకూ క్రీజులో ఉన్న మిల్లర్‌.. గుజరాత్‌ను గెలిపించాడు. 

ట్రెండింగ్ వార్తలు

మిల్లర్‌ 51 బంతుల్లో 94 పరుగులు చేసి నాటౌట్‌గా నిలవడం విశేషం. అతని ఇన్నింగ్స్‌లో 8 ఫోర్లు, 6 సిక్స్‌లు ఉన్నాయి. అసలు ఈ మ్యాచ్‌ను మలుపు తిప్పింది ఇన్నింగ్స్‌ 18వ ఓవర్‌. అప్పటికి గుజరాత్‌కు 18 బంతుల్లో 48 పరుగులు అవసరం కాగా.. అది అసాధ్యంగానే అనిపించింది. అయితే జోర్డాన్‌ వేసిన ఆ ఓవర్లో ఏకంగా 25 రన్స్ వచ్చాయి. ఈ ఓవర్లో గుజరాత్‌ స్టాండిన్‌ కెప్టెన్‌ రషీద్‌ ఖాన్‌ ఏకంగా 3 సిక్స్‌లు, ఒక ఫోర్‌ కొట్టడం విశేషం. చెన్నై కొంప ముంచిన జోర్డాన్‌.. చివరి ఓవర్లో 13 పరుగులను కూడా కాపాడలేకపోయాడు. మిల్లర్ ను నాలుగో బంతికి ఫుల్ టాస్ తో ఔట్ చేసినా.. అది కాస్తా నోబాల్ అని తేలింది. జోర్డాన్ 4 ఓవర్లలో ఏకంగా 58 పరుగులు ఇచ్చాడు.

170 రన్స్‌ టార్గెట్‌తో బరిలోకి దిగిన గుజరాత్ టైటన్స్‌కు దారుణమైన ఆరంభం లభించింది. స్కోరు రెండు పరుగులకు చేరేసరికి రెండు వికెట్లు పడిపోయాయి. ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (0) తొలి ఓవర్లోనే ఔటవగా.. తర్వాతి ఓవర్లో విజయ్‌ శంకర్‌ (0) కూడా డకౌటయ్యాడు. తర్వాత వచ్చిన అభినవ్‌ మనోహర్‌ (12) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. దీంతో 16 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది గుజరాత్‌ టైటన్స్‌. ఈ దశలో మిల్లర్‌ క్రీజులో అడుగుపెట్టాడు. ఆస్ట్రేలియా వికెట్‌ కీపర్‌ మాథ్యూ వేడ్‌ చెత్త ఫామ్‌ కారణంగా అతని స్థానంలో వచ్చిన వృద్ధిమాన్‌ సాహా కూడా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. 

18 బంతుల్లో కేవలం 11 రన్స్‌ చేసి ఔటవడంతో గుజరాత్‌ 48 పరుగుల దగ్గర నాలుగో వికెట్‌ కోల్పోయింది. ఓవైపు వికెట్లు పడుతూనే ఉన్నా.. మరోవైపు మిల్లర్‌ మాత్రం చెన్నై బౌలర్లను బాదుతూ వెళ్లాడు. దీంతో స్కోరు బోర్డు ముందుకు కదిలింది. అటు చివర్లో మెరుపులు మెరిపించే అలవాటు ఉన్న రాహుల్‌ తెవాతియా ఈ మ్యాచ్‌లో మాత్రం నిరాశపరిచాడు. అతడు 14 బంతులు ఆడి కేవలం 6 పరుగులే చేసి ఔటయ్యాడు. దీంతో 39 పరుగుల ఐదో వికెట్‌ పార్ట్‌నర్‌షిప్‌కు తెరపడింది.

రుతురాజ్, రాయుడు బాదినా..

అంతకుముందు రుతురాజ్‌ గైక్వాడ్‌ తన సొంతూరు పుణెలో జరిగిన మ్యాచ్‌లో మళ్లీ ఫామ్‌ అందుకున్నాడు. అతడు 48 బంతుల్లోనే 73 పరుగులు చేయడంతోపాటు అంబటి రాయుడు (31 బంతుల్లో 46)తో కలిసి మూడో వికెట్‌కు 92 రన్స్‌ జోడించడంతో చెన్నై ఫైటింగ్‌ స్కోరు సాధించింది. డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 169 రన్స్ చేసింది.

చెన్నై ఇన్నింగ్స్‌ మొత్తం రుతురాజ్ చుట్టే తిరిగింది. గత సీజన్‌లో అదరగొట్టినా.. ఈసారి తొలి ఐదు మ్యాచ్‌లలో దారుణంగా విఫలమైన అతడు.. గుజరాత్‌తో మ్యాచ్‌లో తన మునుపటి ఫామ్‌ను అందుకున్నాడు. అతడు తన ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లు బాదడం విశేషం. రుతురాజ్‌కు రాయుడు మంచి సహకారం అందించాడు. 31 బంతుల్లోనే 46 రన్స్‌ చేసిన రాయుడు ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. చివరి ఓవర్లో జడేజా రెండు సిక్స్‌లు బాదడంతో చెన్నై మంచి స్కోరు సాధించగలిగింది. జడేజా 12 బంతుల్లో 22, దూబె 17 బంతుల్లో 19 రన్స్‌ చేసి అజేయంగా నిలిచారు.

ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై సూపర్‌ కింగ్స్‌కు అంత మంచి ఆరంభమేమీ లభించలేదు. స్టార్‌ ఓపెనర్‌ రాబిన్‌ ఉతప్ప కేవలం 3 పరుగులకే చేసి ఔటయ్యాడు. తర్వాత వచ్చిన మొయిన్‌ అలీ (1) కూడా మరోసారి నిరాశపరిచాడు. దీంతో చెన్నై 32 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో రుతురాజ్‌తో జత కలిసి అంబటి రాయుడు.. చెన్నై ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. ఈ ఇద్దరూ గుజరాత్‌ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. బౌండరీలతో హోరెత్తించారు. మూడో వికెట్‌కు 56 బంతుల్లోనే 92 పరుగులు జోడించారు. వీళ్ల పార్ట్‌నర్‌షిప్‌ వల్లే చెన్నై ఆ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. గుజరాత్ బౌలర్లలో మహ్మద్‌ షమి తన 4 ఓవర్లలో కేవలం 20 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ తీసుకున్నాడు.

WhatsApp channel

టాపిక్