Khel Ratna Award: మను బాకర్, గుకేశ్‌లకు ఖేల్ రత్న.. మరో ఇద్దరికి కూడా అత్యున్నత క్రీడా పురస్కారం.. వివాదానికి తెర
Khel Ratna Award: దేశ అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న అవార్డు ఈసారి నలుగురిని వరించనుంది. ఒలింపిక్ మెడలిస్ట్ మను బాకర్ తోపాటు చెస్ కింగ్ గుకేశ్ దొమ్మరాజు, మరో ఇద్దరికి కూడా ఈసారి అవార్డు ఇవ్వనున్నట్లు క్రీడా మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Khel Ratna Award: ఖేల్ రత్న అవార్డు విషయంలో వివాదానికి కేంద్ర ప్రభుత్వం తెరదించింది. ఈసారి షార్ట్ లిస్ట్ అయిన వాళ్లలో పారిస్ ఒలింపిక్స్ మెడలిస్ట్ మను బాకర్ పేరు లేదన్న వార్తల నేపథ్యంలో వివాదం రేగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మను బాకర్ తోపాటు యంగెస్ట్ చెస్ వరల్డ్ ఛాంపియన్ గుకేశ్ దొమ్మరాజు, ఇండియన్ హాకీ టీమ్ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్, పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్ లకు కేంద్రం అత్యున్నత క్రీడా పురస్కారమైన మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఇవ్వనుంది.
నలుగురికి ఖేల్ రత్న
ఖేల్ రత్న ఎంతో ప్రతిష్టాత్మకమైన అవార్డు. క్రీడల్లో ఇదే అత్యున్నత పురస్కారం. అలాంటి అవార్డు ఈసారి ఒలింపిక్స్ లో రెండు మెడల్స్ సాధించి చరిత్ర సృష్టించిన మను బాకర్ కు దక్కడం ఖాయం అనుకున్న సమయంలో ఆమె పేరు లేకపోవడం మొదట వివాదానికి కారణమైంది. అయితే వెబ్‌సైట్ లో దరఖాస్తు సమయంలో తానే ఏదైనా పొరపాటు చేసి ఉంటానని మను చెప్పింది. మొత్తానికి ఇప్పుడు ఆమెతోపాటు మరో ముగ్గురికి కూడా కేంద్ర ఖేల్ రత్న అనౌన్స్ చేసి వివాదానికి తెర దించింది.
పారిస్ ఒలింపిక్స్ లో మను 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ తోపాటు 10 మీటర్ల పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్లోనూ బ్రాంజ్ మెడల్స్ గెలిచిన విషయం తెలిసిందే. ఒక ఒలింపిక్స్ లో రెండు మెడల్స్ గెలిచిన తొలి ఇండియన్ గా ఆమె చరిత్ర సృష్టించింది. దీంతో ఆమెకు ఖేల్ రత్న అవార్డును ప్రకటించారు.
చెస్ ఛాంపియన్ గుకేశ్‌కు కూడా..
ఇక అటు యంగెస్ట్ వరల్డ్ చెస్ ఛాంపియన్ గా నిలిచిన దొమ్మరాజు గుకేశ్ కు కూడా కేంద్రం ఖేల్ రత్న అవార్డు ఇవ్వనుంది. 18 ఏళ్ల వయసులోనే అతడు ఈ మధ్యే ఛాంపియన్ అయిన విషయం తెలిసిందే. ఇక ఒలింపిక్స్ లో ఇండియన్ మెన్స్ హాకీ జట్టుకు వరుసగా రెండో బ్రాంజ్ మెడల్ సాధించి పెట్టిన కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ కు కూడా ఖేల్ రత్న ఇవ్వనున్నారు.
2021లో టోక్యో గేమ్స్, 2024లో పారిస్ గేమ్స్ లో హాకీ టీమ్ మెడల్స్ గెలిచింది. అటు పారిస్ పారాలింపిక్స్ లోనే టీ64 హైజంప్ గోల్డ్ మెడల్ గెలిచిన పారా అథ్లెట్ ప్రవీణ్ కుమార్ కు కూడా ఖేల్ రత్న దక్కనుంది. ఈ నలుగురికి జనవరి 17న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఖేల్ రత్న అవార్డు ఇవ్వనున్నట్లు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ వెల్లడించింది.