Manu Bhaker: వంట నేర్చుకుంటున్న మను బాకర్.. రాఖీ కట్టినందుకు ఆమె సోదరుడు ఏమిచ్చాడో తెలుసా?
Manu Bhaker: ఒలింపిక్స్ లో రెండు మెడల్స్ గెలిచి చరిత్ర సృష్టించిన షూటర్ మను బాకర్ ఇప్పుడు వంట నేర్చుకుంటోంది. అంతేకాదు రక్షా బంధన్ సందర్భంగా తన సోదరుడికి రాఖీ కడితే.. అతడు గిఫ్ట్ గా ఓ రూపాయి నోటును తనకు ఇస్తున్న ఫొటోను కూడా ఆమె షేర్ చేసింది.
Manu Bhaker: ఇండియా స్టార్ షూటర్, పారిస్ ఒలింపిక్స్ లో రెండు బ్రాంజ్ మెడల్స్ గెలిచిన మను బాకర్ ప్రస్తుతం హాలిడేస్ ఎంజాయ్ చేస్తోంది. ఒలింపిక్స్ నుంచి వచ్చిన తర్వాత మూడు నెలల పాటు బ్రేక్ తీసుకుంటున్నట్లు అనౌన్స్ చేసిన ఆమె.. ప్రస్తుతం తన తల్లి దగ్గర వంట నేర్చుకుంటుండటం విశేషం. అంతేకాదు రక్షా బంధన్ ను కూడా మను సెలబ్రేట్ చేసుకుంది.
వంట నేర్చుకుంటున్న మను బాకర్
పారిస్ ఒలింపిక్స్ లో ఇండియా మొత్తం ఆరు మెడల్స్ గెలవగా.. అందులో రెండు మను బాకరే తీసుకొచ్చిన విషయం తెలుసు కదా. ఇప్పుడీ షూటర్ తన ఖాళీ సమయాన్ని వంట నేర్చుకోవడానికి కేటాయిస్తోంది. అది కూడా తన తల్లి దగ్గరే కావడం విశేషం. సోమవారం (ఆగస్ట్ 19) రక్షా బంధన్ సందర్భంగా తన ఇన్‌స్టాగ్రామ్ లో మను తన వంట క్లాసుల వీడియోను షేర్ చేసింది.
పారిస్ ఒలింపిక్స్ నుంచి వచ్చిన తర్వాత తాను మూడు నెలల పాటు షూటింగ్ నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ బ్రేక్ లో ఆమె తన వ్యక్తిగత జీవితంపై దృష్టి సారిస్తోంది. ముఖ్యంగా రక్షా బంధన్ రోజు తాను వంట చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ చేసింది. "అమ్మ క్లాసులతో సెలవులను సద్వినియోగం చేసుకుంటున్నాను" అనే క్యాప్షన్ తో ఈ వీడియోను షేర్ చేసింది.
మను రక్షా బంధన్ వేడుకలు
ఇక మరో ఇన్‌స్టా స్టోరీలో తన సోదరుడికి ఆమె రాఖీ కట్టింది. ఈ సందర్భంగా అతడు ఓ రూపాయి నోటును గిఫ్ట్ గా ఇవ్వడం విశేషం. ఆ నోటును ముసిముసిగా నవ్వుతూ మను తీసుకోవడం ఫొటోలో చూడొచ్చు. రెండు బ్రాంజ్ మెడల్స్ గెలిచి వచ్చిన మనుకు ఆమె సోదరుడు ఇలా రూపాయి నోటు ఇవ్వడం మాత్రం అభిమానులను ఆకర్షిస్తోంది.
ఇక తన హాలిడేస్ ను ఎలా ఎంజాయ్ చేయాలో కూడా మను ఇప్పటికే నిర్ణయించుకుంది. ఈ సమయాన్ని ఆమె హార్స్ రైడింగ్, స్కేటింగ్, భరతనాట్యం, వయోలిన్ లాంటి వాటితో గడపాలని చూస్తోంది. తనకు ఇష్టమైన మార్షల్ ఆర్ట్స్ కొనసాగిస్తానని కూడా చెప్పింది. తన షూటింగ్ చెయ్యి పూర్తిగా కోలుకోవడం కోసమే తాను బ్రేక్ తీసుకుంటున్నట్లు మను తెలిపింది.