Mansukh Mandaviya: కొత్త స్పోర్ట్స్ మినిస్టర్ ఈయనే.. పారిస్ ఒలింపిక్స్‌కు ముందు మారిపోయిన మంత్రి
Mansukh Mandaviya: స్పోర్ట్స్ మినిస్టర్ మారిపోయారు. మోదీ 3.0లో ఈ బాధ్యతలను అనురాగ్ ఠాకూర్ నుంచి మన్సుఖ్ మాండవీయ తీసుకోవడం గమనార్హం. పారిస్ ఒలింపిక్స్ కు ముందు క్రీడల మంత్రి మారిపోయారు.
Mansukh Mandaviya: ఇండియాకు కొత్త స్పోర్ట్స్ మినిస్టర్ వచ్చారు. మంత్రిగా ఆదివారం (జూన్ 9) ప్రమాణ స్వీకారం చేసిన మన్సుఖ్ మాండవీయకు సోమవారం (జూన్ 10) క్రీడల శాఖ కేటాయించారు. దీంతోపాటు కార్మిక, ఉపాధి శాఖల బాధ్యతలు కూడా ఆయనే చూడనున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల ముందు వరకు అనురాగ్ ఠాకూర్ స్పోర్ట్స్ మినిస్టర్ గా ఉన్న విషయం తెలిసిందే.
మన్సుఖ్ మాండవీయకు క్రీడల శాఖ
మోదీ 3.0లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వాళ్లకు సోమవారం (జూన్ 10) శాఖలు కేటాయించారు. ఇందులో భాగంగా క్రీడల శాఖ అనురాగ్ ఠాకూర్ నుంచి మన్సుఖ్ మాండవీయ చేతుల్లోకి వెళ్లింది. కేంద్రంలో కొలువుదీరిన ఎన్డీయే ప్రభుత్వంలో మొత్తం 71 మంది మంత్రులుగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా 52 ఏళ్ల మాండవీయకు స్పోర్ట్స్ మినిస్ట్రీ దక్కింది.
జులై చివర్లో పారిస్ ఒలింపిక్స్ జరగనున్న నేపథ్యంలో క్రీడల మంత్రి మారిపోవడం గమనార్హం. 2021లో టోక్యో ఒలింపిక్స్ లో రికార్డు మెడల్స్ సాధించిన ఇండియా.. ఇప్పుడు పారిస్ లో వాటిని మరింత పెంచే ఉద్దేశంతో బరిలోకి దిగబోతోంది. ఈ నేపథ్యంలో కొత్త క్రీడల మంత్రి ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారన్నది ఆసక్తికరంగా మారింది.
పదేళ్లలో ఏడుగురు
మూడేళ్లుగా పారిస్ ఒలింపిక్స్ కోసం భారత్ సంసిద్ధతను పూర్తి అనురాగ్ ఠాకూర్ చేపట్టారు. ఇప్పుడు ఆ బాధ్యతలు మన్సుఖ్ చేతికి వెళ్లాయి. నిజానికి 2014లో తొలిసారి మోదీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇప్పటి వరకూ ఏడుగురు క్రీడల మంత్రులు రావడం గమనార్హం. సర్బానంద సోనోవాల్, జితేంద్ర సింగ్, విజయ్ గోయెల్, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్, కిరణ్ రిజిజు, అనురాగ్ ఠాకూర్ గతంలో స్పోర్ట్స్ మినిస్టర్స్ గా ఉన్నారు.
ఇప్పుడు ఆ బాధ్యతలు చేపట్టిన ఏడో వ్యక్తిగా మన్సుఖ్ మాండవీయ నిలిచారు. గత కేబినెట్ లో ఈయన ఆరోగ్య మంత్రిగా ఉన్నారు. 2021లో ఆ బాధ్యతలు చేపట్టారు. అయితే కొవిడ్ సమయంలో ఈయన పనితీరుపై విమర్శలు వచ్చాయి. హెల్త్ తోపాటు కుటుంబ సంక్షేమం, ఎరువులు, రసాయనాల మంత్రిగా కూడా గతంలో మాండవీయ వ్యవహరించారు.
ఇక తాజా కేబినెట్ లో మాండవీయకు సహాయ మంత్రిగా రక్షా నిఖిల్ ఖడ్సే వ్యవహరించనున్నారు. గత రెండుసార్లు రాజ్యసభ ఎంపీగా కేంద్ర మంత్రిగా ఉన్న మాండవీయ.. తొలిసారి 2024లో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. గుజరాత్ లోని పోరుబందర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి లలిత్ వసోయాపై ఏకంగా 3 లక్షలకుపైగా మెజార్టీతో విజయం సాధించడం విశేషం.
పారిస్ ఒలింపిక్స్ 2024
33వ ఒలింపిక్స్ కు ఈసారి ఫ్రాన్స్ రాజధాని పారిస్ ఆతిథ్యమిస్తోంది. అందుకే వీటిని పారిస్ ఒలింపిక్స్ 2024గా పిలుస్తున్నారు. ఈ ఒలింపిక్స్ జులై 26 నుంచి ఆగస్ట్ 11 వరకు జరగనున్నాయి. ఈసారి ఇండియా నుంచి 89 మంది అథ్లెట్లు పారిస్ ఒలింపిక్స్ కు వెళ్తున్నారు. 2020 టోక్యో ఒలింపిక్స్ లో 122 మంది పాల్గొనగా.. 7 పతకాలు వచ్చాయి. ఒలింపిక్స్ చరిత్రలో ఇండియాకు వచ్చిన అత్యధిక మెడల్స్ ఇవే కావడం విశేషం.