Lionel Messi: రిటైర్మెంట్‍పై హింట్ ఇచ్చిన ఫుట్‍బాల్ స్టార్ మెస్సీ
Lionel Messi: అర్జెంటీనా జాతీయ జట్టుకు రిటైర్మెంట్‍పై స్టార్ ఫుట్‍బాల్ ప్లేయర్ లియోనెస్ మెస్సీ బిగ్ హింట్ ఇచ్చాడు. ఇంటర్ మియామీ ఫుట్‍బాల్ క్లబ్‍లో చేరే ముందు ఈ విషయంపై మాట్లాడాడు.
Lionel Messi: అర్జెంటీనా ఫుల్‍బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ.. తన రిటైర్మెంట్‍పై బిగ్ హింట్ ఇచ్చాడు. అర్జెంటీనా జాతీయ ఫుట్‍బాల్ జట్టుకు వీడ్కోలు పలికే విషయంపై తాజాగా మాట్లాడాడు. 2022 ఫిఫా ప్రపంచకప్‍లో అర్జెంటీనాను గెలిపించి.. తొలిసారి విశ్వటోర్నీ టైటిల్‍ను అందుకున్నాడు మెస్సీ. కాగా, లీగ్ ఫుట్‍బాల్‍లో తాను ఇంటర్ మియామీ ఫుట్‍బాల్ క్లబ్‍కు మారనున్నట్టు మెస్సీ ఇటీవల ప్రకటించాడు. జూలై 16న ఇంటర్ మియామీతో చేరనున్నాడు. అయితే, ఇంతలోనే అర్జెంటీనా జట్టు నుంచి తన రిటైర్మెంట్‍పై ఎదురైన ప్రశ్నపై మాట్లాడాడు మెస్సీ.
అర్జెంటీనా టీమ్‍కు రిటైర్మెంట్ ఇస్తావా అని ఎక్సిక్యుయెల్ పలాసియోస్ అడిగిన ప్రశ్నకు లియోనెల్ మెస్సీ స్పందించాడు. రిటైర్మెంట్‍పై హింట్ ఇచ్చాడు. “నిజం చెప్పాలంటే.. ఎప్పటి వరకు ఆడతానో నాకే తెలియదు. జరగాల్సిన సమయంలో జరుగుతుంది. తాజాగా అంతా సాధించేశా. ఇక ఎంజాయ్ చేయడం మాత్రమే మిగిలింది. ఆ సందర్భం ఎప్పుడు వస్తుందో దేవుడే చెప్పాలి. లాజికల్‍గా చెప్పాలంటే.. నా వయసు కారణంగా.. అది (రిటైర్మెంట్) త్వరలోనే ఉంటుంది. అయితే, అందుకు సరైన సమయం ఏదో కచ్చితంగా నాకు తెలియదు” అని 36 ఏళ్ల మెస్సీ చెప్పాడు. అంటే త్వరలోనే అర్జెంటీనా టీమ్‍కు గుడ్‍బై చెబుతాననేలా మాట్లాడాడు.
“జాతీయ జట్టు తరఫున కఠిన సమయాన్ని మేం దాటుకొని వచ్చాం. అయితే, ప్రపంచకప్, కోపా అమెరికా చాంపియన్లుగా నిలిచాం. ఇక ఇది ఎంజాయ్ చేసే సమయం” అని మెస్సీ అన్నాడు. అర్జెంటీనా జట్టు తరఫున ప్రపంచకప్ గెలువాలన్న మెస్సీ కల 2022లో సాకారమైంది. అదే ఏడాది కోపా అమెరికా చాంపియన్‍గా అర్జెంటీనా అవతరించింది. అర్జెంటీనా తరఫున తన కెరీర్లో 103 గోల్స్ చేశాడు లియోనెల్ మెస్సీ. క్లబ్ కెరీర్లో ఏకంగా 700కు పైగా గోల్స్ చేశాడు.
2026 ఫిఫా ప్రపంచకప్‍లో లియోనెల్ మెస్సీ ఆడడని కొంతకాలంగా వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు మెస్సీ కూడా అవే సంకేతాలు ఇచ్చాడు. కాగా, ఇంటర్ మియామీ ఫుట్‍బాల్ క్లబ్ తరఫున మెస్సీ త్వరలోనే బరిలోకి దిగనున్నాడు.