Kohli turns mentor for Rahul: రాహుల్‌కు బ్యాటింగ్ పాఠాలు చెప్పిన కోహ్లి.. వీడియో వైరల్
Kohli turns mentor for Rahul: టీ20 వరల్డ్‌కప్‌లో ఇబ్బంది పడుతున్న కేఎల్ రాహుల్‌కు బ్యాటింగ్ పాఠాలు చెప్పాడు విరాట్ కోహ్లి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
Kohli turns mentor for Rahul: టీ20 వరల్డ్‌కప్‌లో ఎన్నో ఆశలతో అడుగుపెట్టాడు ఓపెనర్ కేఎల్ రాహుల్. అయితే ఇప్పటి వరకూ ఆడిన మూడు మ్యాచ్‌లలో దారుణంగా విఫలమై విమర్శలు ఎదుర్కొంటున్నాడు. మూడు ఇన్నింగ్స్‌లో కలిపి 34 బాల్స్ ఎదుర్కొన్న రాహుల్ 22 రన్స్ మాత్రమే చేశాడు. అందులో ఒక ఫోర్, ఒక సిక్స్ మాత్రమే ఉన్నాయి.
దీంతో రాహుల్‌ను టీమ్‌లో నుంచి తప్పించాలన్న డిమాండ్ పెరుగుతోంది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో అతన్ని పక్కన పెట్టాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. అన్ని వైపుల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న రాహుల్‌కు హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ అండగా నిలిచాడు. అతడు వామప్ మ్యాచ్‌లో అద్భుతంగా ఆడిన విషయాన్ని గుర్తు చేశాడు.
ఇక ఇప్పుడు బంగ్లాదేశ్‌తో అడిలైడ్‌లో కీలక మ్యాచ్‌కు ముందు సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా రాహుల్‌కు అండగా నిలిచాడు. నెట్స్‌లో చెమటోడుస్తున్న అతనికి విరాట్ బ్యాటింగ్ పాఠాలు చెబుతూ కనిపించాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది. నెట్స్‌లో చాలాసేపు రాహుల్, కోహ్లి మాట్లాడుకుంటూ కనిపించారు. ఈ సమయంలో కోచ్ రాహుల్ ద్రవిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ కూడా రాహుల్ ప్రాక్టీస్‌ను గమనించారు.
కోహ్లితో 20 నిమిషాల పాటు మాట్లాడిన తర్వాత రాహుల్ నెట్స్‌లో బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టడం గమనార్హం. నెట్స్‌లో బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ అతని త్రోడౌన్ స్పెషలిస్ట్‌గా వ్యవహరించాడు. ఇక రాహుల్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలోనూ కోహ్లి అతని దగ్గరికి వెళ్లాడు. ఫుట్‌వర్క్, స్టాన్స్ విషయంలో ఈ సందర్భంగా రాహుల్‌కు విరాట్ కొన్ని సలహాలు ఇచ్చాడు.
గ్రూప్ 2లో ఉన్న టీమిండియా తొలి రెండు మ్యాచ్‌లు గెలిచి వరల్డ్‌కప్‌కు మంచి ఆరంభాన్నిచ్చినా.. మూడో మ్యాచ్‌లో సౌతాఫ్రికా చేతిలో ఓడటంతో ఇంకా సెమీస్ బెర్త్ ఖరారు కాలేదు. బుధవారం (నవంబర్ 2) బంగ్లాదేశ్‌తో మ్యాచ్ కీలకంగా మారనుంది. ఈ మ్యాచ్‌లో గెలిస్తే మెరుగైన నెట్ రన్‌రేట్ ఉన్న ఇండియా దాదాపుగా సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకుంటుంది. మరోవైపు పాకిస్థాన్‌కు కూడా సాంకేతికంగా ఇంకా అవకాశం ఉన్నా.. ఆ టీమ్ సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌లతో కఠినమైన మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. పైగా ఆ టీమ్ నెట్ రన్‌రేట్ కూడా అంత మెరుగ్గా లేదు.