Kohli on Dhoni and deVilliers: వికెట్ల మధ్య చిరుతలు వాళ్లు.. ధోనీ, డివిలియర్స్‌పై కోహ్లి ప్రశంసలు
Kohli on Dhoni and deVilliers: వికెట్ల మధ్య చిరుతలు వాళ్లు అంటూ ధోనీ, డివిలియర్స్‌పై కోహ్లి ప్రశంసలు కురిపించాడు. ఇక పుజారా అయితే మరీ చెత్తగా పరుగెత్తుతాడని కూడా అతడు సరదాగా అన్నాడు.
Kohli on Dhoni and deVilliers: విరాట్ కోహ్లి గురించి తెలుసు కదా. అతని ఫిట్‌నెస్, వికెట్ల మధ్య అతడు పరుగెత్తే వేగం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరి అలాంటి వ్యక్తి క్రికెట్ లో వికెట్ల మధ్య వేగంగా పరుగెత్తే వాళ్లు ఎవరో చెప్పాడు. అందులో ఒకరు టీమిండియా మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ కాగా.. మరొకరు అతని ఆర్సీబీ మాజీ టీమ్మేట్ ఏబీ డివిలియర్స్.
డివిలియర్స్ తో 360 షోలో మాట్లాడిన విరాట్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఈ ఇద్దరితో తాను పరుగెత్తుతుంటే వాళ్లను కనీసం పరుగు కోసం పిలవాల్సిన అవసరం కూడా లేదని అనడం విశేషం. "అసలు ఇందులో ప్రశ్నే లేదు. ఇంతకుముందు కూడా ఇదే ప్రశ్న అడిగారు. నాతో కలిసి ఆడిన వాళ్లలో ఎలాంటి సందేహం లేకుండా ఏబీ డివిలియర్స్ వికెట్ల మధ్య అత్యంత వేగంగా పరుగెత్తే వ్యక్తి. ఇక అతని స్థాయి మరో వ్యక్తి ధోనీ మాత్రమే. వికెట్ల మధ్య వాళ్లు ఎంత వేగంగా పరుగెత్తుతారన్నది నాకు తెలియదు కానీ వాళ్లతో ఆడుతుంటే పరుగు కోసం పిలవాల్సిన అవసరం కూడా ఉండదు" అని కోహ్లి అన్నాడు.
ఇక వికెట్ల మధ్య మరీ చెత్తగా పరుగెత్తే వ్యక్తి ఎవరు అని అడిగితే.. కోహ్లి సరదాగా చెతేశ్వర్ పుజారా పేరు చెప్పాడు. అంతేకాదు 2018లో సౌతాఫ్రికా టూర్ లో ఉన్నప్పుడు జరిగిన ఓ సంఘటన గురించి కూడా వివరించాడు. ఓ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో పుజారా తన టీమ్మేట్ ను రనౌట్ చేయగా.. రెండో ఇన్నింగ్స్ లో తానే రనౌట్ కావడం విశేషం.
గ్రౌండ్ లో తాను అనుభూతి చెందిన అత్యుత్తమ వాతావరణం ఏదని అడిగినప్పుడు విరాట్.. 2011 వరల్డ్ కప్ ఫైనల్, 2022 టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ తో మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో జరిగిన మ్యాచ్ అని చెప్పాడు.
"నేను అనుభూతి చెందిన అత్యుత్తమ వాతావరణం గురించి చెప్పాలంటే.. 2016 ఐపీఎల్ ఫైనల్ చాలా స్పెషల్. కానీ దాని కంటే కూడా ముంబైలో 2011లో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్. గ్రౌండ్ లో నమ్మశక్యం కాని వాతావరణం అది. అంతకుముందెప్పుడూ అలాంటి అనుభూతి చెందలేదు. మళ్లీ గతేడాది అక్టోబర్ 23న పాకిస్థాన్ తో ఎంసీజీలో జరిగిన మ్యాచ్ లోనూ అలాంటి అనుభూతి కలిగింది" అని కోహ్లి చెప్పాడు.
సంబంధిత కథనం