KL Rahul Injured: టీమిండియాకు మరో షాక్‌.. కేఎల్‌ రాహుల్‌కు గాయం-kl rahul injured during practice ahead of second test against bangladesh ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Kl Rahul Injured During Practice Ahead Of Second Test Against Bangladesh

KL Rahul Injured: టీమిండియాకు మరో షాక్‌.. కేఎల్‌ రాహుల్‌కు గాయం

Hari Prasad S HT Telugu
Dec 21, 2022 06:14 PM IST

KL Rahul Injured: టీమిండియాకు మరో షాక్‌ తగిలింది. బంగ్లాదేశ్‌తో రెండో టెస్ట్‌కు ముందు స్టాండిన్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ కూడా గాయపడ్డాడు. ఈ విషయాన్ని బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోడ్‌ వెల్లడించాడు.

కేఎల్ రాహుల్ నెట్ ప్రాక్టీస్
కేఎల్ రాహుల్ నెట్ ప్రాక్టీస్ (AFP)

KL Rahul Injured: బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్‌ గెలిచి సిరీస్‌లో ఆధిక్యం సంపాదించిన టీమిండియా.. గురువారం (డిసెంబర్‌ 22) నుంచి ప్రారంభం కాబోయే రెండో టెస్ట్‌కు సిద్ధమవుతోంది. ఈ టెస్ట్‌కు ఇప్పటికే రోహిత్‌ శర్మ దూరమయ్యాడు. అయితే ఇప్పుడు స్టాండిన్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ కూడా గాయపడ్డాడు. ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో రాహుల్‌కు కూడా బొటన వేలు గాయమైంది.

ట్రెండింగ్ వార్తలు

ఈ విషయాన్ని టీమిండియా బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోడ్‌ వెల్లడించాడు. అయితే గాయం తీవ్రత ఎక్కువగా లేదని కూడా అతడు చెప్పడం కాస్త ఊరట కలిగించే విషయం. టీమ్‌ డాక్టర్‌ ప్రస్తుతం రాహుల్‌ గాయాన్ని పర్యవేక్షిస్తున్నాడు. "గాయం అంత తీవ్రంగా లేదు. అతడు బాగానే ఉన్నాడు. డాక్టర్లు అతని గాయాన్ని పర్యవేక్షిస్తున్నారు. అతడు పూర్తిగా ఫిట్‌గా ఉంటాని ఆశిస్తున్నాం" అని ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో రాథోడ్‌ తెలిపాడు.

నెట్‌ ప్రాక్టీస్‌ ముగుస్తున్న సమయంలో రాహుల్‌కు గాయమైంది. ఆ సమయంలో విక్రమ్‌ రాథోడే త్రోడౌన్స్‌ వేస్తున్నాడు. అందులో ఒక బాల్‌ రాహుల్‌ చేతికి బలంగా తాకింది. ఒకవేళ గాయం తీవ్రత ఎక్కువగా ఉండి రాహుల్‌ కూడా ఈ మ్యాచ్‌కు దూరమైతే.. కెప్టెన్సీ భారాన్ని పుజారా మోయాల్సి ఉంటుంది. ప్రస్తుతం పుజారా వైస్‌ కెప్టెన్‌గా ఉన్న విషయం తెలిసిందే.

ఇప్పటికే తొలి టెస్ట్‌కు దూరమైన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. పూర్తిగా కోలుకోకపోవడంతో ఈ మ్యాచ్‌కు కూడా అందుబాటులో లేడు. మరోవైపు పేసర్‌ నవ్‌దీప్‌ సైనీ కూడా గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. రెండు టెస్ట్‌ల సిరీస్‌లో టీమిండియా ప్రస్తుతం 1-0 లీడ్‌లో ఉంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ చేయడమే కాదు.. వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ చేరే అవకాశాలు మరింత మెరుగవుతాయి.

WhatsApp channel