KKR vs LSG | ఓడినా గర్వపడుతున్నాం.. శ్రేయాస్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు-kkr captain shreyas iyer post match response on against lucknow ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Kkr Vs Lsg | ఓడినా గర్వపడుతున్నాం.. శ్రేయాస్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు

KKR vs LSG | ఓడినా గర్వపడుతున్నాం.. శ్రేయాస్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు

Maragani Govardhan HT Telugu
May 19, 2022 05:16 PM IST

లక్నోతో మ్యాచ్‌లో పరాజయంపై కోల్‌కతా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ స్పందించాడు. తమ జట్టు చేసిన కృషికి ఎంతో గర్వపడుతున్నట్లు తెలిపారు. తమ బాధ్యత పూర్తిగా నిర్వర్తించామని స్పష్టం చేశాడు.

శ్రేయాస్ అయ్యర్
శ్రేయాస్ అయ్యర్ (PTI)

లక్నో సూపర్ జెయింట్స్‌తో బుధవారం నాడు ఉత్కంఠ భరితంగా జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ ఓటమితో కేకేఆర్ ప్లేఆఫ్స్‌ ఆశలపై నీళ్లు చల్లుకుంది. చివర వరకు పోరాడినప్పటికీ విజయం లక్నోనే వరించింది. 210 పరుగుల లక్ష్య ఛేదనంలో కోల్‌కతా 2 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ పరాభవంపై కేకేఆర్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ స్పందించాడు. తమ జట్టు చేసిన కృషికి ఎంతో గర్వపడుతున్నానని, తాము చేయాల్సిందంతా చేశామని ట్విటర్ వేదికగా తెలిపాడు.

"మ్యాచ్‌లో మేము మా వంతు కృషి చేశాం. మైనాదనంలోనే ప్రతీది వదిలేశాము. మా కృషిని చూసి ఎంతో గర్వంగా ఉంది. మాకు మద్దతు ఇచ్చిన అభిమానులందరికీ ధన్యవాదాలు. మీ ప్రేమాభిమానాలకు ఇప్పుడే కాదు.. ఎల్లప్పుటికీ రుణపడి ఉంటాను." అని శ్రేయాస్ అయ్యర్ తన ట్వీట్ పేర్కొన్నాడు.

ఈ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ సరైన కాంబినేషన్‌ లేక విఫలమైంది. ఓటములు చవిచూసినప్పుడు అందుకు తగిన రివర్స్ పంచ్ ఇవ్వలేకపోయింది. చివరి ఐదు మ్యాచ్‌ల్లో ఆకట్టుకునే ప్రదర్శన చేసినప్పటికీ అప్పటికే ఆలస్యమైంది. కేకేఆర్ జట్టులో ఆండ్రీ రసెల్, ప్యాట్ కమిన్స్, రింకూ సింగ్‌లు ఈ సీజన్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చారు.

కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఆడిన 14 మ్యాచ్‌ల్లో 401 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఈ మిడిలార్డర్ బ్యాటర్ షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోవడంలో మెరుగుదలను కనబర్చాడు. ఇంక స్పిన్నర్లనైతే ఎప్పటిలాగే అద్బుతంగా ఆడాడు. కేకేఆర్ ప్రధాన కోచ్ బ్రెండన్ మెక్‌కల్లమ్ ఆ జట్టును వీడనున్నాడు. ఇంగ్లాండ్ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టనుండటంతో వచ్చే సీజన్‌కు నూతన కోచ్‌ కోసం అన్వేషించాల్సి ఉంది. వచ్చే ఏడాది స్థిరంగా ఆడాలంటే ఓపెనర్‌తో పాటు వికెట్ కీపింగ్ బ్యాటర్ కోసం చూడాల్సి ఉంది.

ఈ మ్యాచ్‌లో కోల్‌కతాపై లక్నో 2 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో వికెట్లేమి కోల్పోకుండా 210 పరుగులు చేసింది. ఓపెనర్లు క్వింటన్ డికాక్(140), కేఎల్ రాహుల్(68) విధ్వంసం సృష్టించి అత్యుత్తమ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. డికాక్ సెంచరీతో కదం తొక్కగా.. రాహుల్ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. అనంతరం లక్ష్య ఛేదనంలో తడబడుతూ పైకి లేచిన కోల్‌కతా చివరి వరకు పోరాడి 208 పరుగులకు పరిమితమైంది. శ్రేయాస్ అయ్యర్(50), నితీశ్ రాణా(42) ఆకట్టుకునే ప్రదర్శన చేయగా.. చివర్లో రింకూ సింగ్ 15 బంతుల్లో 40 పరుగులతో విజయాన్ని దాదాపు చేరువ చేశాడు. కానీ గెలుపు మాత్రం లక్నోను వరించింది.

సంబంధిత కథనం

టాపిక్