Karthik to Labuschagne: ఇండియాలో కూడా మంచి కాఫీ దొరుకుతుంది.. ఎందుకు అన్ని బ్యాగ్స్: కార్తీక్
Karthik to Labuschagne: ఇండియాలో కూడా మంచి కాఫీ దొరుకుతుందని ఆస్ట్రేలియా బ్యాటర్ మార్నస్ లబుషేన్ కు సూచించాడు టీమిండియా వికెట్ కీపర్ దినేష్ కార్తీక్. లబుషేన్ చేసిన ట్వీట్ పై అతడు సరదాగా స్పందించాడు.

Karthik to Labuschagne: ఇండియాలో నాలుగు టెస్టుల బోర్డర్ గవాస్కర్ సిరీస్ లో ఆడేందుకు వస్తోంది ఆస్ట్రేలియా. వచ్చే నెల 9 నుంచి ఈ సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. చాలా రోజులుగా ఇండియా దగ్గరే ఉన్న బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎగరేసుకుపోవాలని చూస్తున్న ఆస్ట్రేలియా.. కనీసం ప్రాక్టీస్ మ్యాచ్ కూడా ఆడకుండా నేరుగా బరిలోకి దిగుతోంది.
సిరీస్ కోసం సిద్ధమై రావాల్సి ఉండగా.. ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ మాత్రం కాఫీ బ్యాగులు వెంట తెచ్చుకుంటున్నాడు. "కొన్ని కిలోల కాఫీ బ్యాగులు ఇండియాకు వెళ్తున్నాయి. ఎన్ని బ్యాగులో చెప్పగలరా?" అంటూ లబుషేన్ ఓ బ్యాగు నిండా కాఫీ ప్యాకెట్లు ఉన్న ఫొటోను ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కు కార్తీక్ సరదాగా స్పందించాడు.
"ఇండియాలో కూడా మంచి కాఫీ దొరుకుతుంది మేట్" అంటూ కార్తీక్ లబుషేన్ కు రిప్లై ఇచ్చాడు. కార్తీక్ ఇచ్చిన రిప్లై చాలా మంది అభిమానులకు నచ్చింది. వాళ్లు కూడా అతనితో అంగీకరించారు. ముఖ్యంగా సౌత్ ఇండియాలో దొరికే ఫిల్టర్ కాఫీ రుచి చూశావా అంటూ లబుషేన్ ను నెటిజన్లు ప్రశ్నించారు.
నిజానికి ఈ ఆస్ట్రేలియా బ్యాటర్ కు కాఫీ అంటే చాలా ఇష్టం. ఏ దేశానికి టూర్ కు వెళ్లినా.. తన క్రికెట్ కిట్ తోపాటు తన ఫేవరెట్ కాఫీ ప్యాకెట్స్ కూడా వెంట తీసుకెళ్తుంటాడు. ఈసారి ఇండియాలో నెలకుపైగా ఉండాల్సి ఉండటంతో కొన్ని కిలోల మేర కాఫీ ప్యాకెట్లను వెంట తెచ్చుకుంటున్నాడు.
లబుషేన్ కు సొంత కాఫీ బ్రాండే ఉంది. తన ఫ్రెండ్స్ తో కలిసి దీనిని ప్రారంభించాడు. ఇంటి కాఫీ రుచిని అందరికీ అందించాలన్న ఉద్దేశంతో ఈ బ్రాండ్ ను ప్రారంభించినట్లు గతంలో లబుషేన్ చెప్పాడు. ఇప్పుడు ఇండియాకు వస్తూ కూడా తన బ్రాండ్ కాఫీ ప్యాకెట్లనే తెచ్చుకుంటున్నాడు. లబుషేనే కాదు.. చాలా మంది ఆస్ట్రేలియా క్రికెటర్లకు కాఫీ అంటే ప్రాణం. గతేడాది పాకిస్థాన్ లో పర్యటించిన సమయంలోనూ లబుషేన్ తన వెంట ఇలాగే కాఫీ ప్యాకెట్లను తీసుకెళ్లాడు.
ఇక టెస్ట్ సిరీస్ విషయానికి వస్తే 2004 నుంచి భారత గడ్డపై సిరీస్ కోసం వెంపర్లాడుతున్న ఆస్ట్రేలియా ఈసారి ఏం చేస్తుందో చూడాలి. లబుషేన్ తోపాటు స్మిత్, ఖవాజాలాంటి బ్యాటర్లు కీలకపాత్ర పోషించబోతున్నారు. ఫిబ్రవరి 9న తొలి టెస్ట్ ప్రారంభం కానుండగా.. మార్చి 9న అహ్మదాబాద్ లో చివరి టెస్ట్ జరుగుతుంది.
సంబంధిత కథనం