Karthik on Kohli: విరాట్ కోహ్లి ఫీల్డ్ లో ఎంత దూకుడుగా ఉంటాడో అందరికీ తెలుసు. వికెట్ పడినప్పుడల్లా అతడు చేసుకునే సంబరాలు చూసే ఉంటారు. దాదాపు ప్రత్యర్థిని కొట్టినంత పని చేస్తాడు. అతనికి ఆవేశం కూడా ఎక్కువే. అయితే ఇదంతా క్రికెట్ ఫీల్డ్ లో అడుగుపెట్టినప్పుడే. బయట మాత్రం అతడు పూర్తిగా ఓ భిన్నమైన వ్యక్తి.
గతంలో ఎంతోమంది ఈ విషయం చెప్పారు. తాజాగా కోహ్లి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్మేట్ దినేష్ కార్తీక్ కూడా ఇదే చెబుతున్నాడు. కోహ్లి చాలా ఎమోషనల్, కేరింగ్ వ్యక్తి అని అతడు అన్నాడు. ఆర్సీబీ పాడ్‌కాస్ట్ లో మాట్లాడిన కార్తీక్.. కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఎంత ఎత్తుకు ఎదిగినా విరాట్ ఎప్పుడూ వినయంగా ఉండటమే అతనిలోని గొప్ప లక్షణం అని కార్తీక్ చెప్పాడు.
"గత పదేళ్లుగా టీమ్ భారాన్ని అతడు మోస్తున్నాడు. ఓ వ్యక్తిగా అతడు సాధించిన ఘనత ఇదే. అతని నిలకడ, ఆటపై ఉన్న పట్టు.. చాలా కాలంగా క్రికెట్ లో ఇలాంటి ఘనత సాధించిన మరో వ్యక్తి లేరు. పదేళ్లుగా కోహ్లి ఆటను డామినేట్ చేయడం అసలు అసమానమైనది. క్రికెట్ లో మూడు ఫార్మాట్లు ఉన్నాయి.
ఈ మూడు ఫార్మాట్లు ఆడటమే కష్టం. అలాంటిది ఈ మూడింట్లోనూ 50కిపైగా సగటు ఉండటం అసాధారణం. విదేశాల్లోనూ భారీగా పరుగులు సాధించాడు. అతని గురించి ఎంతైనా మాట్లాడగలను. టీమ్ లోని బౌలర్లు, యువ ఆటగాళ్లతో సరదాగా ఉంటాడు" అని కార్తీక్ అన్నాడు.
కెప్టెన్ గా ఉన్న సమయంలో కోహ్లి దూకుడు మరింత ఎక్కువగా ఉండేది. చాలా గంభీరంగా ఉండేవాడు. కానీ ఇదంతా ఫీల్డ్ లోనే అని, బయట అతడు చాలా కేరింగ్ అని కార్తీక్ వెల్లడించాడు. "కోహ్లితో నాకు చాలా మంది సంబంధాలు ఉన్నాయి. ఓ వ్యక్తిగా అతడంటే నాకు చాలా ఇష్టం.
పరిస్థితులను అతడు హ్యాండిల్ చేసే విధానం బాగుంటుంది. ఒత్తిడిలోనూ నవ్వుతూ కనిపిస్తాడు. అతనంటే నాకు చాలా గౌరవం ఉంది. అభిమానుల నుంచి అతడు పొందుతున్న ప్రేమ, అభిమానాలకు పూర్తి అర్హుడు. అతడు చాలా చాలా ఎమోషనల్, దయ గల వ్యక్తి" అని కార్తీక్ అన్నాడు.
సంబంధిత కథనం