Joe Root About India: క్రికెట్ అంటే అక్కడ పిచ్చి ప్రేమ.. రూట్ షాకింగ్ కామెంట్స్
Joe Root About India: ఇంగ్లాండ్ క్రికెటర్ జో రూట్ భారత్‌లో తన జ్ఞాపకాలను గురించి నెమరేసుకున్నాడు. భారతీయులు క్రికెట్‌ను అమితంగా ఇష్టపడతారని, స్టేడియంలో అడుగుపెట్టిన ప్రేక్షకుల్లో ఆటపై మక్కువ స్పష్టంగా కనిపిస్తుందని అన్నాడు.
Joe Root About India: ఇంగ్లాండ్ మాజీ టెస్టు కెప్టెన్ జో రూట్.. ప్రస్తుతం మూడు ఫార్మాట్లు ఆడే అంతర్జాతీయ క్రికెటర్లలో అతికొద్దిమందిలో ఇతడు కూడా ఒకడు. తనదైన శైలి ఆటతీరుతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఐఎల్‌టీ20 లీగులో దుబాయ్ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్న రూట్.. భారత్ తరఫునే తను మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేశానని చెప్పాడు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భారత్‌లో ఆడటం గురించి గత జ్ఞాపకాలను నెమరేసుకున్నాడు. అక్కడ స్టేడియంలో అడుగుపెట్టినప్పుడు క్రికెట్‌పై మక్కువ ఎలా ఉంటుందో స్పష్టంగా కనిపిస్తుందని అన్నాడు.
"భారత్‌లోనే నా మూడు ఫార్మాట్ల అరంగేట్రం జరిగింది. ఇప్పటికి చాలా రోజులైంది. నా 50వ టెస్టు కూడా భారత్‌లోనే ఆడాను. క్రికెట్ ఆడేందుకు భారత్ చాలా గొప్ప ప్రదేశం. స్టేడియంలో అడుగుపెట్టినప్పుడే క్రికెట్ పట్ల మక్కువ స్పష్టంగా కనిపిస్తుంది. మీకు మైదానంలో ఉన్నామని కూడా అనిపించదు. ఆటపై అంత మక్కువ, అభిరుచిని భారతీయులు చూపిస్తారు. అందుకే నేను ఎప్పుడు భారత్‌లో ఆడటాన్ని ఆస్వాదిస్తాను. అక్కడ ఆడటం చాలా సరదాగా ఉంటుంది" అని జో రూట్ అన్నాడు.
అంతర్జాతీయ క్రికెట్, ఫ్రాంఛైజీ క్రికెట్‌లో కుర్రాళ్లు భాగమవడంపై రూట్ స్పందించాడు. "ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్ చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. క్షేత్ర స్థాయిలో ఉన్న ప్రజలు కూడా ఆటలో పాల్గొంటున్నారు. ఇది క్రికెట్ వృద్ధికి దోహదపడుతుంది." అని రూట్ తెలిపాడు.
రూట్ చాలా కాలం తర్వాత ఈ ఏడాది జరగనున్న ఐపీఎల్ 2023లో పునరాగమనం చేయనున్నాడు. 2018 వేలంలో రూట్ అమ్ముడుపోలేదు. గత నెలలో జరిగిన మినీ వేలంలో రాజస్థాన్ రాయల్స్ జట్టు అతడి బేస్ ప్రైస్ కోటి రూపాయలకు కొనుగోలు చేసింది. దీంతో ఐపీఎల్ 2023లో సందడి చేయనున్నాడు.