Unadkat return to ODI Squad: 9 ఏళ్ల తర్వాత వన్డే జట్టులోకి భారత పేసర్.. ఆసీస్‌తో సిరీస్‌కు ఛాన్స్-jaydev unadkat returns after nine years in odi squad for australia series
Telugu News  /  Sports  /  Jaydev Unadkat Returns After Nine Years In Odi Squad For Australia Series
జయదేవ్ ఉనాద్కత్
జయదేవ్ ఉనాద్కత్ (PTI)

Unadkat return to ODI Squad: 9 ఏళ్ల తర్వాత వన్డే జట్టులోకి భారత పేసర్.. ఆసీస్‌తో సిరీస్‌కు ఛాన్స్

20 February 2023, 6:57 ISTMaragani Govardhan
20 February 2023, 6:57 IST

Unadkat return to ODI Squad: భారత పేసర్ జయదేవ్ ఉనాద్కట్ 9 ఏళ్ల విరామం తర్వాత భారత జట్టులోకి రానున్నాడు. చివరగా 2013లో వెస్టిండీస్‌పై వన్డే ఆడిన అతడు.. 9 ఏళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత టీమ్‌లోకి పునరాగమననం చేయనున్నాడు.

Unadkat return to ODI Squad: బోర్డర్ -గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్ అదరగొడుతోంది. ఇప్పటకే ఆస్ట్రేలియాపై 2-0 తేడాతో భారత్ ఆధిక్యంలో ఉండటంతో సిరీస్ సులభంగా గెలిచేస్తుందని ఫ్యాన్స్ ఊహిస్తున్నారు. ఆసీస్‌తో టెస్టు సిరీస్‌తో పాటు వన్డే సిరీస్ ఆడనుంది. మార్చి 17 నుంచి ఈ మూడు వన్డేల సిరీస్ జరగబోతుంది. ఈ సిరీస్‌లో ఆడే భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. ప్రదర్శన ఆధారంగా ఈ జట్టు ఎంపిక జరిగినట్లు తెలుస్తోంది. టీమిండియా ఆటగాడు జయదేవ్ ఉనాద్కత్‌కు వన్డే జట్టులోకి అవకాశం కల్పించారు సెలక్టర్లు.

గతేడాది బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌కు ఎంపికైన ఉనాద్కత్.. 12 ఏళ్ల విరామం తర్వాత టెస్టు ఆడిన భారత ఆటగాడిగా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా వన్డే జట్టులోనూ ఎంపికయ్యాడు. దాదాపు 9 ఏళ్ల గ్యాప్ తర్వాత 50 ఓవర్ల ఫార్మాట్‌లో భారత్ తరఫున అంతర్జాతీయ మ్యాచ్ ఆడబోతున్నాడు. అతడు చివరగా 2013 నవంబరు 21న వెస్టిండీస్‌తో వన్డే మ్యాచ్ ఆడాడు. అదే ఏడాది హరారే వేదికగా జింబాబ్వేపై వన్డేల్లో అరంగేట్రం చేశాడు. ఆ ఏడాది తర్వాత స్థానం కోల్పోయిన ఉనాద్కత్.. జట్టులో పిలుపు కోసం 9 ఏళ్ల పాటు ఎదురుచూశాడు. చివరకు ఇప్పుడు సెలక్టర్లు ఎంపిక చేశారు. మరి అతడిని తుది జట్టులో తీసుకుంటారో లేదో చూడాలి.ఈ లెఫ్టార్మ్ పేసర్ ఇటీవల కాలంలో దేశవాళీ మ్యాచ్‌ల్లో అదరగొడుతున్నాడు. రంజీ సీజన్‌లో అద్భుత ప్రదర్శనతో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన ఉనాద్కత్.. వన్డే జట్టులో తిరిగి స్థానాన్ని సంపాదించాడు.

ప్రస్తుతం జరుగుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో రీఎంట్రీ ఇచ్చిన రవీంద్ర జడేజాను కూడా పరిమిత ఓవర్ల జట్టుకు సెలక్టర్లు తిరిగి ఎంపిక చేశారు. మార్చి 17న ముంబయి వాంఖడే వేదికగా వన్డే సిరీస్ ప్రారంభం కానున్న నేపథ్యంలో జడ్డూను ఎంపిక చేయడంపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మార్చి 17 ముంబయి వాంఖడే వేదికగా తొలి వన్డే ప్రారంభం కానుంది. రెండో వన్డే వైజాగ్ వేదికగా మార్చి 19న జరగనుంది. ఆఖరుదైన మూడో వన్డే మార్చి 22న చెన్నై చెపాక్ వేదికగా నిర్వహించనున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ తొలి వన్డేకు అందుబాటులో ఉండట్లేదని తెలుస్తోంది. కుటుంబ కారణాల రీత్యా అతడు దూరంగా ఉండనున్నట్లు సమాచారం.

ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు భారత జట్టు..

రోహిత్ శర్మ(కెప్టెన్), శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, యజవువేంద్ర చాహల్, మహమ్మద్ షణీ, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్, శార్దుల్ ఠాకూర్, అక్షర్ పటేల్, జయదేవ్ ఉనాద్కత్.

సంబంధిత కథనం