Yash Dayal: ఒకే ఒక్క ఓవర్ ఓ ప్లేయర్ ను హీరోను చేస్తే.. మరో ప్లేయర్ కెరీర్ నే తలకిందులు చేసింది. ఐపీఎల్ 2023లో గుజరాత్ టైటన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మ్యాచ్ చివరి ఓవర్ ను ఎవరూ అంత త్వరగా మరచిపోరు. ఆ ఓవర్లో వరుసగా ఐదు సిక్స్ లు బాది అసాధ్యమనుకున్న విజయాన్ని కేకేఆర్ కు అందించాడు రింకు సింగ్. అయితే ఆ ఓవర్ వేసిన గుజరాత్ టైటన్స్ బౌలర్ యశ్ దయాల్ పరిస్థితి మాత్రం ఇప్పుడు దారుణంగా తయారైంది.
ఆ మ్యాచ్ తర్వాత అతడు ఐపీఎల్లో ఇప్పటి వరకూ మరో మ్యాచ్ ఆడలేదు. అంతేకాదు ఇక ఈ సీజన్ లో అతడు ఆడతాడా లేదా అన్నది కూడా చెప్పలేమని కెప్టెన్ హార్దిక్ పాండ్యా అనడం గమనార్హం. ఈ సందర్భంగానే యశ్ పరిస్థితి ఇప్పుడెలా ఉందో కూడా వివరించాడు. ఆ మ్యాచ్ తర్వాత అతడు అనారోగ్యానికి గురై, ఏడెనిమిది కిలోల బరువు తగ్గినట్లు హార్దిక్ చెప్పాడు.
"ఈ సీజన్ లో అతడు మళ్లీ ఆడతాడో లేదో చెప్పలేను. ఆ మ్యాచ్ తర్వాత అతడు అనారోగ్యానికి గురయ్యాడు. 7-8 కిలోల బరువు తగ్గాడు. ఆ సమయంలో వైరల్ ఇన్ఫెక్షన్ వ్యాపిస్తోంది. ఇక అదే సమయంలో అతడు ఎదుర్కొన్న ఒత్తిడి కారణంగా ప్రస్తుతం అతడు బరిలోకి దిగే పరిస్థితి కూడా లేదు. అతన్ని మళ్లీ ఫీల్డ్ లో చూడటానికి చాలా సమయమే పడుతుంది" అని హార్దిక్ చెప్పడం గమనార్హం.
ఆ ఒక్క మ్యాచ్ తో యశ్ దయాల్ కెరీర్ తలకిందులైందని చెప్పొచ్చు. టీమంతా అతనికి అండగా నిలిచిందని సహచర ప్లేయర్స్ చెబుతున్నా.. దాని తాలూకు షాక్ నుంచి యశ్ ఇప్పటికీ కోలుకోలేకపోయాడని స్పష్టమవుతోంది. అటు యశ్ కుటుంబం కూడా ఆ మ్యాచ్ తర్వాత చాలానే బాధపడింది. అతని కుటుంబ సభ్యులు ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారు.
సంబంధిత కథనం