IPL Opening Ceremony 2023: ఐపీఎల్ ఓపెనింగ్ సెర్మనీలో తెలుగు పాటల హవా.. స్టెప్పులతో ఇరగదీసిన తమన్నా, రష్మిక
IPL Opening Ceremony 2023: ఐపీఎల్ 2023 ప్రారంభ వేడుకల్లో తెలుగు పాటల హవా కనిపించింది. నాటు నాటు సహా సామి సామి, ఊ అంటావా లాంటి పాటలకు ముద్దుగుమ్మలు డ్యాన్స్ చేశారు. తమన్నా, రష్మిక తమ హుషారైన స్టెప్పులతో అలరించారు.
IPL Opening Ceremony 2023: ఐపీఎల్ 2023 సీజన్ ఆరంభ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ ప్రారంభోత్సవానికి అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా మారింది. ఈ కార్యక్రమానికి బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, సహా కార్యదర్శి జైషా తదితరులు హాజరయ్యారు. ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణ మన ముద్దుగుమ్మలు నృత్య ప్రదర్శనలే. ఎప్పుడూ ఐపీఎల్ ప్రారంభ వేడుకల్లో బాలీవుడ్ పాటల హవానే నడుస్తుంది. కానీ ఈ సారి సౌత్ సాంగ్స్‌కు స్టెప్పులేశారు. అందులోనూ మన తెలుగు పాటలకు హోరెత్తించే రీతిలో డ్యాన్స్ చేశారు.
ముందుగా తెలుగులో టాప్ హీరోయిన్‌లో ఒకరైన తమన్నా భాటియా పుష్ప చిత్రంలోని ఊ అంటావా ఊఊ అంటావా సాంగ్‌కు అదిరిపోయేలే డ్యాన్స్ వేసింది. ఆ సాంగ్‌లో ఉన్న బీట్స్‌కు అనుగుణంగా కాళ్లు కదుపుతూ ప్రేక్షకుల చేతిలో ఈలలు కొట్టించింది. స్వతహాగా మంచి డ్యాన్సరైన మిల్క్ బ్యూటీ ఈ పుష్ప చిత్రంలోని సాంగ్‌కు తనదైన స్టెప్పులో అలరించింది. ముద్దుగుమ్మ వయ్యారాలు పోతూ స్టెప్పులేస్తుంటే చూసేందుకు రెండు కళ్లు చాలలేదు.
అనంతరం నేషనల్ క్రష్ రష్మిక మందన్నా తను నటించిన పుష్ప చిత్రంలోని సామి సామి పాటకు అద్భుతంగా డ్యాన్స్ చేసింది. నడుము ఊపుతూ తన హుక్ స్టెప్‌తో కుర్రకారును కవ్వించింది. రష్మిక ప్రదర్శనకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. అంతటితో ఆగకుండా ఈ ముద్దుగుమ్మ ఆస్కార్ విన్నింగ్ సాంగ్ నాటు నాటు పాటకు దుమ్మురేపింది. ఆమె ప్రదర్శనకు స్టేడియంలో ప్రేక్షకులు ఉత్సాహంతో కేరింతలు కొట్టారు.
అంతకుముందు బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్ కొన్ని హిందీ పాటలతో ఆడియెన్స్‌ను మెస్మరైజ్ చేశారు. చాలా కాలం తర్వాత బాలీవుడ్ నటి మందిరా బేడీ ఐపీఎల్ యాంకర్‌గా రీ ఎంట్రీ ఇచ్చారు. అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. ఈ మ్యాచ్‌తో ఐపీఎల్ 2023 ఆరంభమవుతుంది.