Suryakumar Career Turning Point: తన కెరీర్ టర్నింగ్ పాయింట్ ఏంటో చెప్పిన సూర్యకుమార్.. ముంబయి ఫ్రాంఛైజీపై ప్రశంసల వర్షం-suryakumar yadav says when i returned to mi in 2018 is big turning point in my career
Telugu News  /  Sports  /  Suryakumar Yadav Says When I Returned To Mi In 2018 Is Big Turning Point In My Career
సూర్యకుమార్ యాదవ్
సూర్యకుమార్ యాదవ్ (AFP)

Suryakumar Career Turning Point: తన కెరీర్ టర్నింగ్ పాయింట్ ఏంటో చెప్పిన సూర్యకుమార్.. ముంబయి ఫ్రాంఛైజీపై ప్రశంసల వర్షం

26 May 2023, 18:29 ISTMaragani Govardhan
26 May 2023, 18:29 IST

Suryakumar Career Turning Point: సూర్యకుమార్ యాదవ్ తన కెరీర్ టర్నింగ్ పాయింట్ ఏంటో చెప్పాడు. ముంబయి ఇండియన్స్‌ తరఫున 2018లో తిరిగి ఆడటమే తన కెరీర్‌ను మలుపు తిప్పిందని తెలిపాడు.

Suryakumar Career Turning Point: ముంబయి ఇండియన్స్ తరఫున నిలకడగా రాణిస్తున్న ఆటగాడు సూర్యకుమార్ యాదవ్. టీమిండియాలోనే కాకుండా.. ఐపీఎల్‌లోనూ తన జోరును కొనసాగిస్తున్నాడు. అతడి ప్రదర్శనతో ముంబయి ప్లేఆఫ్స్‌కు చేరడమే కాకుండా ఫైనల్ చేరేందుకు అడుగు దూరంలో ఉంది. శుక్రవారం నాడు గుజరాత్ టైటాన్స్‌తో ముంబయి ఇండియన్స్ రెండో క్వాలఫయర్ మ్యాచ్‌లో ఆడనుంది. ఈ సందర్భంగా సూర్యకుమార్ యాదవ్ తన ప్రదర్శన గురించి ఆసక్తికర విషయాలను తెలియజేశాడు. అంతేకాకుండా కెరీర్‌లో తన టర్నింగ్ పాయింట్ ఏంటో కూడా వివరించాడు.

"2018లో నేను ముంబయి ఇండియన్స్‌కు పునరాగమనం చేయడమే నా కెరీర్ టర్నింగ్ పాయింట్‌గా భావిస్తున్నాను. నా ఫ్యామిలీ వద్దకు నేను తిరిగొచ్చాననే అయ్యాననే భావన కలిగింది. జట్టు మేనేజ్మెంట్ నన్ను బాగా నమ్మింది. బ్యాటింగ్ ఆర్డర్‌లో పైన వచ్చేందుకు అవకాశం కల్పించింది. అక్కడే నా కెరీర్ మలుపు తిరిగింది. 2018 సీజన్‌లో నేను బాగా పరుగులు చేశాను. ఆ తర్వాత సంవత్సరమే నా రోల్ కూడా మారిపోయింది. అప్పటి నుంచి జట్టులో కీలక పాత్ర పోషిస్తున్నాను." అని సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు.

"జట్టు నన్ను నమ్మి నా పాత్రపై స్పష్టతనిచ్చింది. అప్పుడు నా వంతుగా వారికి కావాల్సింది ఇచ్చేలా ప్రదర్శన చేశాను. ఫలితంగా నా గేమ్ వేరే స్థాయికి చేరుకుంది. అ స్థాయికి చేరేలా కష్టపడ్డాను. అందుకోసం వాళ్లు రెండు అడుగులు వేస్తే నేను నాలుగు అడుగులు వేశాను. ఫలితంగా మా బంధం మరింత బలంగా మారింది." అని సూర్యకుమార్ అన్నాడు.

ఐపీఎల్ 2023లో సూర్యకుమార్ యాదవ్ 8వ అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. 14 మ్యాచ్‌ల్లో 42.58 సగటుతో 511 పరుగులు చేశాడు. ఇందులో ఓ శతకం సహా 4 అర్ధసెంచరీలు ఉన్నాయి. అత్యధికంగా 103 పరుగులు చేశాడు. అంతేకాకుండా అంతర్జాతీయ టీ20ల్లోనూ తనదైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.