Gavskar on Shubman: అతడి ఆటకు ఆకాశమే హద్దు.. శుబ్‌మన్‌పై గవాస్కర్ ప్రశంసల వర్షం-sunil gavaskar praises shubman gill for his record ipl ton ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Sunil Gavaskar Praises Shubman Gill For His Record Ipl Ton

Gavskar on Shubman: అతడి ఆటకు ఆకాశమే హద్దు.. శుబ్‌మన్‌పై గవాస్కర్ ప్రశంసల వర్షం

Maragani Govardhan HT Telugu
May 27, 2023 06:54 PM IST

Gavskar on Shubman: సునీల్ గవాస్కర్ శుబ్‌మన్‌ గిల్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. అతడి ఆటకు ఆకాశమే హద్దని తెలిపారు. ముంబయితో జరిగిన మ్యాచ్‌లో గిల్ అద్భుతంగా రాణించాడని స్పష్టం చేశారు. ఈ మ్యాచ్‌లో శుబ్‌మన్ 60 బంతుల్లో 129 పరుగులు చేశాడు.

శుబ్‌మన్ గిల్‌పై గవాస్కర్ ప్రశంసల వర్షం
శుబ్‌మన్ గిల్‌పై గవాస్కర్ ప్రశంసల వర్షం

Gavskar on Shubman: గుజరాత్ టైటాన్స్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ ఈ సీజన్‌లో అత్యుత్తమంగా రాణిస్తున్నాడు. గత నాలుగు మ్యాచ్‌ల్లో మూడు శతకాలతో విజృంభించాడు. ఫలితంగా ఓ సీజన్‌లో అత్యధిక సెంచరీలు సాధించిన మూడో ఆటగాడిగా రికార్డు సృష్టించింది. ముంబయితో శుక్రవారం జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. ఫలితంగా ఈ మ్యాచ్‌లో గుజరాత్ విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. గిల్ అద్భుత ఆటతీరుపై సర్వత్రా ప్రశంసల వర్షం వెల్లువెత్తుతోంది. తాజాగా సునీల్ గవాస్కర్ కూడా గిల్‌పై స్పందించారు.

ట్రెండింగ్ వార్తలు

"క్రికెట్ ప్రపంచం అతడి పాదాల వద్ద ఉందనడమే కాకుండా మరిన్ని విశేషణాలు వెతకడం చాలా కష్టం. అతడికి ఆకాశమే హద్దు. ఆ విషయం మాత్రం నేను చెప్పగలను. గిల్ ఫిట్ మూమెంట్ కారణంగా అతడు ఎక్కువగా పరుగులు చేయగలుగుతున్నాడు. పాదల కదలిక, ముందుకు-వెనకకు ఆడటంలో నిలకడ అనేది మంచి బ్యాటర్‌కు ఉండాల్సిన ముఖ్యమైన లక్షణాలు. అదే సమయంలో బ్యాలెన్స్ కూడా ఉండాలి. అతడు అదే చేశాడు" అని గవాస్కర్ శుబ్‌మన్ గిల్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.

ఈ ఏడాది ప్రారంభంలో టెస్టుల్లో శుబ్‌మన్ 128 పరుగులతో అద్భుత సెంచరీ చేయడంతో అతడు దీర్ఘకాలిక ఫార్మాట్‌లో పరుగుల వరద పారిస్తాడని గవాస్కర్ అన్నారు.

"అతడు అలాగే ప్రదర్శన చేస్తుంటే పరుగల వరద పారుతుంది. క్రికెట్‌లో కరెక్ట్‌నెస్ ముఖ్యం. అతడి బ్యాటింగ్‌లో అది ఉంది. గిల్ లైన్‌లోనే ఆడినట్లు కొన్నిసార్లు అనిపిస్తుంది. కానీ నిజానికి అతడు అలా ఆడలేదు. చివరి క్షణంలో లైన్‌వలో ఆడటానికి ప్రయత్నించాడు. ఐపీఎల్‌లో మూడో శతకం చేసిన గిల్.. ప్రతి ఇన్నింగ్స్‌కూ మెరుగుపడుతున్నాడు. ఇప్పుడు 129 పరుగులు చేశాడు. ఐపీఎల్ కెరీర్‌లోనే ఇది అతడి అత్యుత్తమ స్కోరు. ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఇది గుజరాత్ టైటాన్స్‌కే కాకుండా ఇండియన్ క్రికెట్‌కే శుభపరిణామం" అని అన్నారు.

శుక్రవారం ముంబయి ఇండియన్స్‌తో జరిగిన రెండో క్వాలిఫయర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ 62 పరుగుల తేడాతో విజయం సాధించింది. శుబ్‌మన్ గిల్ 60 బంతుల్లో 129 పరుగులతో సెంచరీతో విజృంభించాడు. ఇందులో 7 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి. ఫలితంగా గుజరాత్ 3 వికెట్లు కోల్పోయి 233 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో ముంబయి ఇండియన్స్ 18.2 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది. ఈ విజయంతో గుజరాత్ వరుసగా రెండో సారి ఫైనల్‌లోకి అడుగుపెట్టింది.

WhatsApp channel