Shubman Record IPL Century: ఆకాశమే హద్దుగా చెలరేగిన శుబ్‌మన్.. పలు రికార్డులు బద్దలు.. ముంబయి బౌలర్లు బెంబేలు
Shubman Record IPL Century: గుజరాత్ బ్యాటర్ శుబ్‌మన్ గిల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ముంబయితో జరుగుతున్న క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో రికార్డు ఐపీఎల్ సెంచరీ సాధించడమే కాకుండా భారీ లక్ష్యాన్ని నిర్దేశించడంలో కీలక పాత్ర పోషించాడు.
Shubman Record IPL Century: ఐపీఎల్ చరిత్రలో యువ సంచలనం శుబ్‌మన్ గిల్ రికార్డుల మోత మోయిస్తున్నాడు. వరుస పెట్టి శతకాలు చేస్తూ దూసుకెళ్తున్నాడు. శుక్రవారం ముంబయి ఇండియన్స్‌తో జరిగిన క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో గిల్ సెంచరీతో కదం కొక్కాడు. 49 బంతుల్లోనే 100 పరుగులు పూర్తి చేసిన ఈ యువ ఆటగాడు మొత్తంగా 60 బంతుల్లో 129 పరుగులు చేశాడు. ఇందులో 7 ఫోర్లు 10 సిక్సర్లు ఉన్నాయి. ముంబయి బౌలర్లే లక్ష్యంగా విరుచుకుపడ్డాడు. ఇది శుభ్‌మన్‌కు మూడో ఐపీఎల్ సెంచరీ కావడం విశేషం. అది కూడా ఇదే సీజన్‌లో చేశాడు. దీంతో ఓ సీజన్‌లో విరాట్ కోహ్లీ(4) తర్వాత అత్యధిక సెంచరీలు చేసిన భారత బ్యాటర్‌గా రికార్డు సాధించాడు. ఫలితంగా గుజరాజ్ 3 వికెట్లు కోల్పోయి 233 పరుగుల భారీ స్కోరు చేసింది. దీంతో పాటు పలు రికార్డులు ఈ మ్యాచ్‌లో నమోదయ్యాయి.
- ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా గిల్ రికార్డు సృష్టించాడు. 60 బంతుల్లో 129 పరుగులతో ఆకట్టుకున్నాడు.
- ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో అత్యధిక సిక్సర్లు నమోదు చేసిన ఆటగాడిగానూ ఘనత సాధించాడు గిల్. మొత్తం 10 సిక్సర్లు బాదాడు.
- కేఎల్ రాహుల్(132) తర్వాత ఐపీఎల్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా శుబ్‌మన్(129) రికార్డు సృష్టించాడు.
- ఓ ఐపీఎల్ సీజన్‌లో వంద కంటే ఎక్కువ బౌండరీలు కొట్టిన రెండో ఆటగాడిగా గిల్(111) నిలిచాడు. అతడి కంటే ముందు 122 ఫోర్లతో విరాట్ కోహ్లీ(2016) ముందున్నాడు.
- ఐపీఎల్ ప్లేఆఫ్స్‌లో మూడో అత్యధిక భాగస్వామ్యం నమోదు చేశారు శుబ్‌మన్-సుదర్శన్ వీరిద్దరూ 138 పరుగులను జోడించారు.
- ఓ ఐపీఎల్ సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాటర్‌గా శుబ్‌మన్(851) రికార్డు సాధించాడు. అతడి కంటే ముందు విరాట్ కోహ్లీ(973), జాస్ బట్లర్(863) ఉన్నారు.
- ఐపీఎల్ చరిత్రలో ప్లేఆఫ్స్‌లో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా గుజరాత్ రికార్డు సృష్టించింది. ఈ మ్యాచ్‌లో ముంబయిపై గుజరాజ్ 233 పరుగులు చేసింది.
ఈ మ్యాచ్‌లో ముంబయి బౌలర్లే లక్ష్యంగా గుజరాత్ బ్యాటర్లు అదరగొట్టారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 233 పరుగుల భారీ స్కోరు సాధించారు. గిల్ సెంచరీతో ఆకట్టుకోగా.. సాయి సుదర్శన్ 43 పరుగులతో రాణించాడు. హార్దిక్ పాండ్య 13 బంతుల్లో 28 పరుగులతో మెరుపులు మెరిపించాడు. ముంబయి బౌలర్లలో పియూష్ చావ్లా, ఆకాశ్ మధ్వాల్ చెరో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.