Telugu News / స్పోర్ట్స్ / ఐపీఎల్ /
ఐపీఎల్ 2023 షెడ్యూల్
రాబోయే
ఐపీఎల్ మార్చి 31న ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరుగుతుంది. మార్చి 31న రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ప్రతి టీమ్ సొంతగడ్డపై ఏడు, బయట మరో ఏడు మ్యాచ్ లు ఆడతాయి. మొత్తం 12 వేదికల్లో మ్యాచ్ లు జరగనున్నాయి. అహ్మదాబాద్ తో పాటు హైదరాబాద్, మొహాలీ, లక్నో, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, కోల్‌కతా, జైపూర్, ముంబై, గువాహటి, ధర్మశాలలో ఐపీఎల్ 2023 మ్యాచ్ లు జరుగుతాయి. మొత్తంగా 52 రోజుల పాటు 70 లీగ్ మ్యాచ్ లు ఉంటాయి. అందులో 18 డబుల్ హెడర్స్ ఉంటాయి. లీగ్ స్టేజ్ మే 21న ముగుస్తుంది. మే 28న ఫైనల్ జరుగుతుంది. పది జట్లను రెండు గ్రూపులుగా విడదీశారు. గ్రూప్ ఎలో ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఉన్నాయి. ఇక గ్రూప్ బిలో చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటన్స్ ఉన్నాయి. ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ తమ తొలి మ్యాచ్ ను ఏప్రిల్ 2న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఆడుతుంది. ఈ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతుంది. ఈ సీజన్ సందర్భంగా 1000వ ఐపీఎల్ మ్యాచ్ జరగనుండటం విశేషం. ఈ మ్యాచ్ ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య మే 6వ తేదీన చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరుగుతుంది.
ఈసారి సన్‌రైజర్స్ హైదరాబాద్ తన తొలి మ్యాచ్ ను ఏప్రిల్ 2న రాజస్థాన్ రాయల్స్ తో ఆడనుంది. ఈ మ్యాచ్ హైదరాబాద్ లోనే జరుగుతుంది. గతేడాది 8వ స్థానంలో నిలిచి నిరాశ పరిచిన సన్ రైజర్స్.. ఈసారి సొంతగడ్డపై చెలరేగాలని చూస్తోంది. సన్ రైజర్స్ టీమ్ గ్రూప్ బిలో ఉంది. ఐపీఎల్ 2023 మార్చి 31న ప్రారంభం కానుంది. మే 28న ఫైనల్ జరుగుతుంది. హైదరాబాద్ లో ఈసారి ఏప్రిల్ 2, 9, 18, 24, మే 4, 13, 18 తేదీలలో జరుగుతాయి.