Rohit Sharma: క్రికెట్ కిట్ కొనడానికి పాలు అమ్మాడు.. రోహిత్ గురించి ఎవరికీ తెలియని స్టోరీ ఇది
Rohit Sharma: క్రికెట్ కిట్ కొనడానికి పాలు అమ్మాడు రోహిత్ శర్మ. టీమిండియా కెప్టెన్ కు సంబంధించిన ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ చాలా మందికి తెలియదు. తాజాగా మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా ఈ విషయాన్ని వెల్లడించాడు.
Rohit Sharma: రోహిత్ శర్మ ఓ టాప్ క్రికెటర్ గా, టీమిండియా కెప్టెన్ గా మాత్రమే మనకు తెలుసు. కానీ అతడు ఆ స్థాయికి రావడానికి పడిన కష్టం మాత్రం చాలా మందికి తెలియదు. పుస్తకాల్లో చెప్పుకోవాల్సిన సక్సెస్ స్టోరీలకు ఏమాత్రం తక్కువ కాని స్టోరీ రోహిత్ శర్మది. తాజాగా టీమిండియా మాజీ స్పిన్నర్, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు ప్రజ్ఞాన్ ఓజా ఈ విషయాన్ని వెల్లడించాడు.
ఒకప్పుడు తాను రోహిత్ తో మాట్లాడిన సమయంలో అతడు ఎన్ని కష్టాలు పడి ఈ స్థాయికి వచ్చాడో తెలిసిందని జియో సినిమాలో వచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఓజా చెప్పాడు. ఈ ఇద్దరూ ఐపీఎల్ తొలి సీజన్ అయిన 2008లో డెక్కన్ ఛార్జర్స్ తరఫున ఆడారు. అంతేకాదు టీమిండియా తరఫున కూడా 24 మ్యాచ్ లు ఆడారు. రోహిత్ బ్యాక్‌గ్రౌండ్ గురించి అడిగినప్పుడు అతడు చాలా ఎమోషనల్ అయ్యాడని కూడా ఓజా తెలిపాడు.
పాలు అమ్మి.. క్రికెట్ కిట్ కొని..
"రోహిత్ ను తొలిసారి అండర్ 15 నేషనల్ క్యాంప్ లో కలిశాను. అతడో స్పెషల్ ప్లేయర్ అని అందరూ అన్నారు. అక్కడ రోహిత్ తో ఆడిన నేను అతని వికెట్ తీశాను. చాలా మంది బాంబే ప్లేయర్స్ లాగా రోహిత్ ఎక్కువగా మాట్లాడడు కానీ ఆడేటప్పుడు మాత్రం దూకుడుగా ఉంటాడు. ఒకరి గురించి మరొకరికి తెలియని సమయంలో అతడు నాతోనూ చాలా దూకుడుగా ఉండేవాడు. కానీ ఆ తర్వాత మా ఇద్దరి స్నేహం బలపడుతూ వచ్చింది" అని ఓజా చెప్పాడు.
"రోహిత్ మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చాడు. తన క్రికెట్ కిట్ కు డబ్బు లేని సమయాన్ని గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యాడు. ఆ కిట్ కొనడానికి పాల ప్యాకెట్లు కూడా అమ్మాడు. ఇప్పుడతన్ని చూస్తే గర్వంగా ఉంటుంది. మా ప్రయాణం ఎక్కడ మొదలై ఎక్కడి వరకూ వచ్చిందో" అని ఓజా తెలిపాడు.
రోహిత్ శర్మ తొలిసారి 2007లో ఇండియా తరఫున ఆడాడు. అదే ఏడాది తొలి టీ20 వరల్డ్ కప్ లో కూడా ప్రాతినిధ్యం వహించాడు. ఇండియా గెలిచిన ఆ టోర్నీలో రోహిత్ 4 మ్యాచ్ లలో 88 రన్స్ చేశాడు. వన్డేల్లో టాప్ ప్లేయర్ గా ఎదిగిన రోహిత్.. ఇప్పటివరకూ 9825 రన్స్ చేశాడు. అందులో 30 సెంచరీలు ఉన్నాయి.
రోహిత్ బ్యాక్‌గ్రౌండ్ అలా ఉన్నా, ఎన్నో కష్టాలు అనుభవించినా.. ఎప్పుడూ సరదాగా ఉంటాడని కూడా ఓజా చెప్పాడు. మిమిక్రీ బాగా చేస్తాడని, అండర్ 19 ఆడే రోజుల్లో తాను ఒత్తిడికి గురైన సందర్భాల్లో రోహిత్ ఎవరినైనా అనుకరించి తనను నవ్వించే వాడని తెలిపాడు.
సంబంధిత కథనం