Ravindra Jadeja: కపిల్ దేవ్, కుంబ్లే రికార్డులపై కన్నేసిన జడేజా
Ravindra Jadeja: కపిల్ దేవ్, కుంబ్లే రికార్డులపై కన్నేశాడు రవీంద్ర జడేజా. రానున్న వెస్టిండీస్ టూర్ లోనూ అతడీ రికార్డు బ్రేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి
Ravindra Jadeja: టీమిండియా ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఓ అరుదైన రికార్డుకు దగ్గరలో ఉన్నాడు. లెజెండరీ బౌలర్లు కపిల్ దేవ్, అనిల్ కుంబ్లేల రికార్డులపై జడ్డూ కన్నేశాడు. వెస్టిండీస్ తో జరగబోయే వన్డే సిరీస్ లో ఆ రికార్డును అతడు బ్రేక్ చేసే అవకాశాలు ఉన్నాయి. వెస్టిండీస్ పై వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా జడేజా నిలవనున్నాడు.
ప్రస్తుతం ఈ లిస్టులో కపిల్ దేవ్ 43 వికెట్లతో టాప్ లో ఉన్నాడు. ఇక కుంబ్లే 42 వికెట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. జడేజా 29 మ్యాచ్ లలో 41 వికెట్లతో మూడోస్థానంలో ఉండగా.. ఇప్పుడు మూడు వన్డేల సిరీస్ జరగనుండటంతో ఆ రికార్డు బ్రేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఓవరాల్ గా ఇండియా, వెస్టిండీస్ మధ్య జరిగిన వన్డేల్లో 44 వికెట్లతో కౌర్ట్నీ వాల్ష్ టాప్ లో ఉన్నాడు.
రవీంద్ర జడేజా ఇప్పటివరకు 174 వన్డేల్లో 191 వికెట్లు తీశాడు. అందులో ఒక ఇన్నింగ్స్ లో ఐదు వికెట్లను ఒకసారి తీయగా.. 2526 పరుగులు కూడా చేయడం విశేషం. వన్డే ఫార్మాట్ లో జడేజా మొత్తం 13 హాఫ్ సెంచరీలు చేశాడు. మరోవైపు ఈ నెల 12 నుంచి వెస్టిండీస్ తో ప్రారంభమయ్యే టెస్ట్ సిరీస్ కోసం టీమిండియా సిద్ధమవుతోంది.
జులై 12న తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్ ఆడనున్నాయి. తొలి టెస్ట్ జులై 12 నుంచి 16 వరకు.. రెండో టెస్ట్ జులై 20 నుంచి 24 వరకు జరుగుతాయి. తర్వాత వన్డే సిరీస్ లో భాగంగా జులై 27, 29, ఆగస్ట్ 1న మూడు వన్డేలు జరగనున్నాయి. ఆగస్ట్ 3 నుంచి ఐదు టీ20ల సిరీస్ ప్రారంభమవుతుంది.
ఆగస్ట్ 6న రెండో టీ20, 8, 12, 13న మిగతా మూడు టీ20 మ్యాచ్ లలో ఇండియా, వెస్టిండీస్ తలపడతాయి. చాలా రోజుల తర్వాత వెస్టిండీస్ లో పూర్తి స్థాయి పర్యటనకు ఇండియా వెళ్లింది. ఈ ఏడాది వరల్డ్ కప్ జరగనుండటంతో ఈ సిరీస్ కు పూర్తి స్థాయి టీమ్ ఆడుతుండగా.. టీ20లకు మాత్రం రోహిత్, విరాట్ లాంటి సీనియర్లకు అవకాశం దక్కలేదు.
సంబంధిత కథనం