Pietersen to Kohli: కోహ్లి.. ఆర్సీబీని వదిలెయ్.. క్యాపిటల్ సిటీకి వచ్చెయ్: పీటర్సన్
Pietersen to Kohli: కోహ్లి.. ఆర్సీబీని వదిలెయ్.. క్యాపిటల్ సిటీకి వచ్చెయ్ అంటూ పీటర్సన్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. ఐపీఎల్ 2023లో ప్లేఆఫ్స్ చేరకుండానే ఆర్సీబీ ఇంటికెళ్లిపోయిన తర్వాత కేపీ ఈ ట్వీట్ చేశాడు.
Pietersen to Kohli: ఐపీఎల్లో మరోసారి ఆర్సీబీ ప్లేఆఫ్స్ కూడా చేరకుండానే ఇంటికెళ్లిపోయిన తర్వాత ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్.. విరాట్ కోహ్లికి ఓ వింత సలహా ఇచ్చాడు. ఆర్సీబీని వదిలేయాల్సిందిగా సూచించాడు. ప్లేఆఫ్స్ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో విరాట్ కోహ్లి సెంచరీ చేసినా కూడా గుజరాత్ టైటన్స్ చేతుల్లో ఆర్సీబీకి ఓటమి తప్పలేదు.
దీంతో ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత కేపీ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. "విరాట్ క్యాపిటల్ సిటీకి వెళ్లాల్సిన టైమ్ వచ్చేసింది" అని ట్వీట్ చేస్తూ హ్యాష్ ట్యాగ్ ఐపీఎల్ అని పీటర్సన్ కామెంట్ చేశాడు. అంటే పరోక్షంగా ఇక కోహ్లి ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడాలని సూచించడం గమనార్హం. 16 ఏళ్లుగా విరాట్ కోహ్లి ఆర్సీబీ తరఫునే ఉన్నా.. ఇప్పటి వరకూ ఆ టీమ్ టైటిల్ గెలవలేకపోయింది. రెండుసార్లు ఫైనల్ చేరినా అక్కడ ఓటమి తప్పలేదు.
ఇక 2023లో ఎన్నో ఆశలతో బరిలోకి దిగినా.. కనీసం ప్లేఆఫ్స్ కు కూడా చేరకుండానే ఇంటిదారి పట్టింది. ఆ టీమ్ బ్యాటర్లు విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెస్సి, గ్లెన్ మ్యాక్స్‌వెల్ టాప్ ఫామ్ లో ఉన్నా కూడా ఫలితం లేకుండా పోయింది. ముఖ్యంగా కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో కోహ్లి సెంచరీ చేసినా కూడా.. అటు గిల్ కళ్లు చెందిరే సెంచరీతో జీటీని గెలిపించడంతో ఆర్సీబీ పనైపోయింది.
ఇక ఆర్సీబీతో కోహ్లి టైటిల్ గెలవడం అయ్యే పనిలా కనిపించడం లేదు. దీంతో కేపీ ఈ కీలక సూచన చేయడం విశేషం. అయితే కేపీ సలహాపై అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. ఆర్సీబీ ఫ్యాన్స్ కొందరు కేపీపై విమర్శలు గుప్పించారు. మరికొందరు స్పందిస్తూ.. కోహ్లి ఆర్సీబీని వీడితో సీఎస్కేతో చేరతాడు తప్ప డీసీకి వెళ్లడని అభిప్రాయపడ్డారు.
2008 నుంచి విరాట్ ఆర్సీబీకే ఆడుతున్నాడు. ఇప్పటివరకూ ఆ టీమ్ తరఫున 230 మ్యాచ్ లు ఆడిన అతడు.. ఒక ఫ్రాంఛైజీ తరఫున అత్యధిక మ్యాచ్ లు ఆడిన రికార్డును సొంతం చేసుకున్నాడు. అంతేకాదు లీగ్ చరిత్రలో 7 వేలకుపైగా పరుగులు, 7 సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్ కూడా కోహ్లియే. కానీ ఇంత చేసినా.. టైటిల్ గెలవలేకపోవడం అతనికి మింగుడుపడటం లేదు. అయినా తాను ఐపీఎల్లో ఎంత కాలం కొనసాగితే అంత కాలం ఆర్సీబీతోనే ఉంటానని గతంలో విరాట్ స్పష్టం చేశాడు.
సంబంధిత కథనం