క్రికెట్ చరిత్రలో గొప్ప ఫీల్డర్‌లలో ఒకరిగా పరిగణించబడే మహ్మద్ కైఫ్(Mohammed Kaif) తన కెరీర్ లో కొంతమంది దిగ్గజ క్రికెటర్లతో ఆడాడు. 2000లో అండర్-19 ప్రపంచకప్‌లో భారత్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన తర్వాత కైఫ్ వెలుగులోకి వచ్చాడు. ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే గంగూలీని తనకు నచ్చిన కెప్టెన్ అని కైఫ్ చెప్పాడు.
DD ఇండియాలో మాట్లాడిన కైఫ్ కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. మీరు చూసిన అత్యుత్తమ కెప్టెన్ ఎవరు అనగా.. గంగూలీని అని వెంటనే చెప్పేశాడు కైఫ్. 'సౌరవ్ గంగూలీని అత్యుత్తమ కెప్టెన్ అంటాను నేను. నేను వెళ్లి నా బెస్ట్ షాట్ ఇవ్వాలని అనుకున్నాను. నాకు మద్దతు ఇవ్వడానికి గంగూలీ ఉన్నాడని తెలుసు. అయితే గంగూలీ కూడా.. నీకు నేను ఉన్నాను, ఆడమని చెప్పాడు. ఓ యువకుడి అది పెద్ద సపోర్ట్. అలాంటి కెప్టెన్ ఉంటే యువకులకు ఎంతో ప్రోత్సాహం ఉంటుంది. అందుకే గంగూలీ అంటే నాకు ఇష్టం.' అని కైఫ్ చెప్పాడు.
సౌరవ్ గంగూలీ అద్భుతమైన కెప్టెన్ గా ఉన్నాడని కైఫ్ చెప్పుకొచ్చాడు. కెప్టెన్సీ అంటే మీరు నాయకుడిగా ఉండాలని, సరైన ఆటగాళ్లను ఎంచుకొని వారికి మద్దతు ఇవ్వాలని అన్నాడు. గంగూలీ మంచి జట్టును నిర్మించాడని గుర్తు చేసుకున్నాడు కైఫ్.
కైఫ్ తన 125 వన్డేల్లో గంగూలీ కెప్టెన్సీలో 83 ఆడాడు. 13 టెస్టుల్లో 624 పరుగులు, ఒక సెంచరీ, మూడు అర్ధ సెంచరీలు చేశాడు. 125 ODIల్లో రెండు సెంచరీలు, 17 అర్ధ సెంచరీలతో 2753 పరుగులు నమోదు చేశాడు. ఇక గంగూలీ 49 టెస్టులు, 146 ODIలకు నాయకత్వం వహించాడు. గంగూలీ కెప్టెన్సీలో విజయాల శాతం టెస్టులో 42.85, వన్డేలో 52.05 గా ఉంది.
గంగూలీ కెప్టెన్సీలో 2002 ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకుంది టీమిండియా. వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే.. ఇండియాతోపాటు శ్రీలంకను కూడా ఉమ్మడి విజేతగా ప్రకటించారు. గంగూలీ సమయంలోనే 2003 ప్రపంచ కప్‌లో రన్నరప్‌గా నిలిచింది. గంగూలీ తన ODI కెరీర్‌లో 11363 పరుగులను నమోదు చేశాడు. ఆ ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన తొమ్మిదో ఆటగాడి నిలిచాడు. సచిన్ టెండూల్కర్, ఇంజమామ్ ఉల్ హక్ తర్వాత ODIలలో 10,000 పరుగులు దాటిన మూడో బ్యాటర్ గంగూలీ. ODI ప్రపంచ కప్‌లో ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు (183) సాధించిన భారతీయ బ్యాటర్‌గా రికార్డును కూడా కలిగి ఉన్నాడు దాదా.