Naveen ul Haq on Kohli: నీ ప్రాబ్లం ఏంటి బామ్మర్ది..! ఆర్సీబీ ప్లేఆఫ్స్ చేరకపోవడంపై నవీన్ రెచ్చగొట్టే స్టేటస్
Naveen ul Haq on Kohli: గుజరాత్ చేతిలో ఆర్సీబీ పరాజయం పాలవ్వడంతో లక్నో ప్లేయర్ నవీన్ ఉల్ హఖ్ తన ఇన్ స్టాలో షేర్ చేసిన పోస్టు వైరల్ అవుతోంది. ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు చేరకపోవడంపై నవ్వుతున్నట్లుగా అతడు పోస్ట్ పెట్టాడు.
"Naveen ul Haq on Kohli: లక్నో సూపర్ జెయింట్స్ ఆటగాడు నవీన్ ఉల్ హఖ్, ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ మధ్య గొడవ చాలా దూరం వెళ్లేలా ఉంది. కోహ్లీ వదిలేసినా.. నవీన్ మాత్రం అంత సులభంగా వదిలేసేలా లేడు. వీలు చిక్కినప్పుడల్లా ఆర్సీబీ జట్టు గురించి, కోహ్లీ గురించి పరోక్షంగా తన సోషల్ మీడియా వేదికగా ప్రస్తావిస్తున్నాడు. ఆదివారం నాడు గుజరాత్ టైటాన్స్ చేతిలో బెంగళూరు పరాజయం కావడంతో ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించని విషయం తెలిసిందే. దీంతో నవీన్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పెట్టిన స్టోరీ చర్చనీయాంశంగా మారింది. ఆర్సీబీ ప్లేఆఫ్స్‌కు రాకపోవడంతో ఇన్‌స్టాలో పాపులరైన ఫన్నీ మీమ్ ఒకటి షేర్ చేశాడు. ప్రస్తుతం అతడు చేసిన ఈ పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది.
ఆర్సీబీ ఓటమిని గుర్తు చేస్తూ ఓ వ్యక్తి గట్టిగా పగలబడి నవ్వుతూ ఉన్న వీడియోను నవీన్ ఉల్ హఖ్ షేర్ చేశాడు. అంతేకాకుండా అతడు ప్రాతినిధ్యం వహిస్తున్న లక్నో సూపర్ జెయింట్స్ క్వాలిఫై కావడం, కోహ్లీ జట్టు నిష్క్రమించడంతో అతడు తన ఆనందాన్ని ఈ విధంగా ప్రదర్శించాడు. దీంతో కోహ్లీ అభిమానులకు నవీన్ తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాడు. సోషల్ మీడియా వేదికగా అతడిపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. నెటిజన్లు కూడా విశేషంగా స్పందిస్తున్నారు.
నవీన్ ఉల్ హఖ్ తన పరిమితులను అధిగమించాడని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. నవీన్ ఈ విషయాన్ని చాలా దూరం తీసుకెళ్తున్నాడని ఓ యూజర్ కామెంట్ చేయగా.. ఇదే నవీన్‌కు చివరి ఐపీఎల్ అని మరొకరు స్పందించారు. అసలు నీ ప్రాబ్లం ఏంటి బామ్మర్ది..! ఇంకొకరు పోస్ట్ పెట్టారు. అంతేకాకుండా ఓ రేంజ్‌లో అతడిని ట్రోలింగ్ చేస్తున్నారు. కేవలం నవీన్ ఉల్ హఖ్‌నే కాదు.. గౌతమ్ గంభీర్‌ను, లక్నో జట్టను కూడా ట్రోల్ చేయడం ప్రారంభించారు.
అసలు విషయానికొస్తే మే 1న బెంగళూరు-లక్నో మధ్య జరిగిన మ్యాచ్‌లో నవీన్-కోహ్లీ మధ్య మాటల యుద్ధం నడిచింది. మధ్యలో గౌతమ్ గంభీర్ కూడా కలగజేసుకోవడంతో ఈ విషయం మరింత పెద్దదైంది. గంభీర్-కోహ్లీ ఒకరినొకరు గొడవపడేంత వరకు వెళ్లింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అప్పటి నుంచి నవీన్ ఉల్ హఖ్.. కోహ్లీకి సంబంధించి ఓ చిన్న విషయం వచ్చినా.. పరోక్షంగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందిస్తున్నాడు.
ఇక ఆదివారం నాడు జరిగిన మ్యాచ్‌లో బెంగళూరుపై గుజరాత్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. 198 పరుగుల లక్ష్యాన్ని మరో 5 బంతులు మిగిలుండగానే ఛేదించింది గుజరాత్. శుబ్‌మన్ గిల్ అద్భుత శతకంతో తన జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. 52 బంతుల్లో 104 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 5 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. అతడికి తోడు విజయ్ శంకర్(53) అర్ధశతకంతో చక్కటి సహకారం అందించడంతో గుజరాత్ సులభంగా గెలిచింది. అంతకుముందు ఆర్సీబీ జట్టులో విరాట్ కోహ్లీ ఒంటరి పోరాటంతో అద్భుత సెంచరీ సాధించి ఐపీఎల్‌లోనే అత్యధిక శతకాలు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. అయినప్పటికీ ఆర్సీబీ బౌలర్లు చేతులెత్తేయడంతో గుజరాత్ సులభంగా విజయాన్ని అందుకుంది.