MS Dhoni - Video: వెరైటీగా బర్త్‌డే సెలెబ్రేట్ చేసుకున్న ధోనీ.. ఫిదా అవుతున్న నెటిజన్లు: వీడియో వైరల్
MS Dhoni - Video: తాను పుట్టిన రోజును జరుపుకున్న వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ. మహీ చేసిన పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
MS Dhoni - Video: టీమిండియా మాజీ కెప్టెన్, దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ.. సోషల్ మీడియాలో అంత యాక్టివ్‍గా ఉండడు. ఎంతో అరుదైన సందర్భాల్లో తప్ప సోషల్ మీడియా పోస్టులు పెట్టడు. సుమారు ఆరు నెలల తర్వాత ఇన్‍స్టాగ్రామ్‍లో ఓ వీడియో పోస్ట్ చేశాడు ధోనీ. శుక్రవారం (జూలై 7) ఎంఎస్ ధోనీ తన 42వ పుట్టిన రోజును జరుపుకున్నాడు. ఎంతో మంది క్రికెటర్లు, ప్రముఖులు, కోట్లాది మంది ఫ్యాన్స్ ధోనీకి శుభాకాంక్షలు చెప్పారు. అయితే, తాను బర్త్‌డే రోజున చేసుకున్న సెలెబ్రేషన్ వీడియోను నేడు (జూలై 8) ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశాడు మహేంద్రుడు. ఇది నెటిజన్లు మనసులను గెలుచుకుంటోంది. అందరూ ఫిదా అవుతున్నారు.

రాంచీలోని ఫామ్‍హౌస్‍లో తన పెంపుడు కుక్కలతో కలిసి పుట్టిన రోజును వేడుకను జరుపుకున్నాడు ఎంఎస్ ధోనీ. తన నాలుగు పెంపుడు శునకాల సమక్షంలో కొవ్వొత్తిని ఊది.. చిన్న కేక్ కట్ చేశాడు మహీ. కేక్‍ను వాటికి తినిపించాడు. ఆ తర్వాత తాను ఓ కేక్ ముక్క తిన్నాడు. ఈ వీడియోను తన ఇన్‍స్టాగ్రామ్ అకౌంట్‍లో ధోనీ పోస్ట్ చేశాడు. “నాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పిన అందరికీ చాలా థ్యాంక్స్. బర్త్‌డే రోజు నేను ఏం చేశానో ఓ చిన్న గ్లింప్స్” అని క్యాప్షన్ పెట్టాడు మహీ. ధోనీ చేసుకున్న ఈ ప్రత్యేకమైన సెలెబ్రేషన్‍కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
ఎంఎస్ ధోనీ సింప్లిసిటీ, పెంపుడు జంతువుల మీద అతడికి ఉన్న ప్రేమ చూసి మురిసిపోతున్నారు అభిమానులు. ఈ వీడియో తమ హృదయాలను హత్తుకుంటోందంటూ కామెంట్ చేస్తున్నారు. “అందుకే నిన్ను ఇంతలా ప్రేమిస్తున్నాం” అని కామెంట్లు పెడుతున్నారు.
ధోనీ పోస్ట్ చేసిన ఈ వీడియో ఇన్‍స్టాగ్రామ్‍లో సంచలనం సృష్టిస్తోంది. పోస్ట్ చేసిన గంటలోనే ఈ వీడియోకు ఏకంగా సుమారు 2.4 మిలియన్ల లైక్స్ వచ్చాయి. కామెంట్లు వెల్లువలా వస్తున్నాయి. ధోనీ సింప్లిసిటీని అభిమానులు ప్రశంసిస్తున్నారు. హ్యాపీ బర్త్ డే అంటూ కామెంట్లు చేస్తున్నారు. ధోనీ భార్య సాక్షి కూడా ఈ వీడియోకు స్పందించింది. హార్ట్ ఎమోజీలను కామెంట్‍లో పోస్ట్ చేసింది.
తాను ఫామ్‍హౌస్‍లో వ్యవసాయం కోసం ట్రాక్టర్ నడుపుతున్న వీడియోను ఈ ఏడాది ఫిబ్రవరి 8న ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశాడు. ఆరు నెలల తర్వాత ఇప్పుడు తన బర్త్ డే సెలెబ్రేషన్ వీడియోను పోస్ట్ చేశాడు.
తన కెప్టెన్సీలో టీమిండియాకు 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీని అందించాడు ఎంఎస్ ధోనీ. 2020లో అంతర్జాతీయ క్రికెట్‍కు గుడ్‍బై చెప్పాడు. ఐపీఎల్‍లో కొనసాగుతున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‍లో తన జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌ను మరోసారి విజేతగా నిలిపాడు ఎంఎస్ ధోనీ. సీఎస్కే టీమ్‍కు ఐదోసారి ఐపీఎల్ టైటిల్‍ను సాధించాడు.