Mohammad Kaif on Rayudu: తన కెరీర్ లో ఆడిన చివరి ఐపీఎల్ మ్యాచ్ లో అంబటి రాయుడు భారీ స్కోరు చేయలేకపోవచ్చు. కానీ క్రీజులో ఉన్న కాసేపే మ్యాచ్ ను సీఎస్కే వైపు మలుపు తిప్పాడు. టీమ్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రాయుడు ఓ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. రాయుడు ఆట మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ కు బాగా నచ్చేసింది.
అందుకే అతడు కొట్టిన సిక్స్ ను గతేడాది టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ పై కోహ్లి కొట్టిన సిక్స్ తో పోల్చడం విశేషం. మోహిత్ శర్మ వేసిన 13వ ఓవర్లో బ్యాక్‌ఫుట్ పై లాంగాఫ్ మీదుగా రాయుడు సిక్స్ కొట్టాడు. రాయుడు కేవలం 8 బంతుల్లోనే 19 పరుగులు చేశాడు. దీంతో అతనిపై కైఫ్ ప్రశంసల వర్షం కురిపించాడు.
"అంబటి రాయుడు ఇన్నింగ్సే మ్యాచ్ ను మలుపు తిప్పింది. అప్పుడు మ్యాచ్ ఉన్న పరిస్థితుల్లో అతని ఇన్నింగ్స్ కు చాలా ప్రాధాన్యత ఉంది. అతడు బ్యాక్‌ఫుట్ పై కొట్టిన సిక్స్ నా వరకూ టోర్నమెంట్ లోనే అత్యుత్తమమైనది. టీ20 వరల్డ్ కప్ లో భాగంగా మెల్‌బోర్న్ లో పాకిస్థాన్ పై విరాట్ కోహ్లి కొట్టిన మరుపురాని సిక్స్ ను ఇది గుర్తు చేసింది. రాయుడు చాలా ఎమోషనల్ గా కనిపించాడు. కానీ ఇలాంటి విజయంతో తన ఐపీఎల్ కెరీర్ ముగించడంలో క్రెడిట్ అంతా రాయుడుకే దక్కుతుంది" అని కైఫ్ అనడం విశేషం.
ఐపీఎల్ 2023 ఫైనలే తన కెరీర్లో చివరి మ్యాచ్ అని అంతకుముందే రాయుడు అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ ను మరుపురానిదిగా మలచుకోవడానికి తనకు వచ్చిన అవకాశాన్ని రాయుడు సద్వినియోగం చేసుకున్నాడు. మూడుసార్లు ముంబై ఇండియన్స్ తరఫున, మూడుసార్లు చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్ ట్రోఫీ గెలిచిన అరుదైన రికార్డును సొంతం చేసుకొని తన కెరీర్ ముగించాడు.
దీంతో ఈ ఫైనల్ మ్యాచ్ తర్వాత రాయుడు ఎమోషనల్ అయ్యాడు. "నిజంగా ఇది ఓ కలలాంటి ముగింపు. ఇంతకంటే నాకు కావాల్సింది ఏముంటుంది. ఇది నమ్మశక్యం కానిది. గొప్ప జట్లలో భాగం కావడం నా అద్రుష్టం. సీఎస్కే కూడా అలాంటిదే. నా జీవితం మొత్తం ఈ మ్యాచ్ ను గుర్తుంచుకుంటాను. గత 30 ఏళ్ల శ్రమంతా ఫలించింది" అని రాయుడు అన్నాడు.
సంబంధిత కథనం