MI vs GT: ముంబై ఏడో సారి? - గుజరాత్ రెండోసారి? - ఫైనల్ చేరేది ఎవరో?
MI vs GT: శుక్రవారం (నేడు) ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య సెకండ్ క్వాలిఫయర్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో విజేతగా నిలిచిన టీమ్ ఫైనల్‌లో చెన్నైతో తలపడనుంది.

MI vs GT: ఐపీఎల్ ఫైనల్‌లో చెన్నైతో తలపడే జట్టు ఏదన్నది నేడు తేలనుంది. శుక్రవారం ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ మధ్య రెండో క్వాలిఫయర్ మ్యాచ్ జరుగనుంది. ఇందులో విజేతగా నిలిచిన జట్టు ఆదివారం జరుగనున్న ఫైనల్‌లో చెన్నైతో తలపడుతుంది. లీగ్‌లో అద్భుత విజయాల్ని అందుకున్న గుజరాత్ టైటాన్స్ ప్లేఆఫ్స్‌లో చెన్నై చేతిలో ఓటమిపాలై నిరాశపరిచింది.
ఫైనల్ చేరేందుకు తమకు లభించిన ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలనే ఉత్సాహంతో గుజరాత్ టైటాన్స్ బరిలో దిగుతోంది. బ్యాటింగ్ లోపాల వల్లే ఫస్ట్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో చెన్నై చేతిలో గుజరాత్ ఓటమి పాలైంది.
శుభ్‌మన్‌పైనే ఆశలన్నీ...
శుభ్‌మన్ గిల్, విజయ్ శంకర్ మినహా మిగిలిన ప్లేయర్స్ భారీ స్కోర్లు చేయడంలో విఫలమవుతోన్నారు. మరోసారి శుభ్‌మన్ చెలరేగడంపైనే గుజరాత్ గెలుపు ఆశలు ఆధారపడ్డాయి. అతడితో పాటు హార్దిక్ పాండ్య, మిల్లర్, రాహుల్ తెవాతియా బ్యాట్ ఝులిపించాల్సిన అవసరం ఉంది.
బౌలింగ్ విషయంలో ముంబై కంటే గుజరాత్ ఎక్కువ బలంగా కనిపిస్తోంది. ఈ సీజన్‌లో చక్కటి లైన్ అండ్ లెంగ్త్‌తో ఆకట్టుకుంటోన్న పేసర్ షమీ 26 వికెట్లతో పర్పుల్ క్యాప్ రేసులో టాప్‌ప్లేస్‌లో ఉన్నాడు. అతడికి రషీద్‌ఖాన్ నుంచి చక్కటి సహకారం అందుతోంది.
రషీద్‌ఖాన్ కూడా ఈ సీజన్‌లో 25 వికెట్లు తీశాడు. మరో స్పిన్నర్ నూర్ అహ్మద్ కూడా పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా వికెట్లను తీస్తుండటం గుజరాత్‌కు సానుకూలంశంగా చెప్పవచ్చు.
ఆకాష్ మధ్వాల్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్...
మరో వైపు ఎలిమినేట ర్ మ్యాచ్‌లో లక్నోపై భారీ విజయంతో ముంబై కూడా దూకుడుగా కనిపిస్తోంది. ఆ జోరును నేటి మ్యాచ్‌లో కొనసాగించి ఫైనల్‌లో అడుగుపెట్టాలని భావిస్తోంది. ప్లేఆఫ్స్ హీరో ఆకాష్ మధ్వాల్ పైనే క్రికెట్ అభిమానుల దృష్టి ఉంది.
గత రెండు మ్యాచుల్లో కలిపి 9 వికెట్లు తీసిన ఆకాష్ గుజరాత్‌ను ఎంత వరకు కట్టడి చేస్తాడన్నది ఆసక్తికరంగా మారింది. అతడితో పాటు సీనియర్ స్పిన్నర్ పీయూష్ చావ్లా నిలకడగా రాణిస్తోన్నాడు. ముంబైలో భారీ హిట్టర్లు ఉన్నా సమిష్టిగా రాణించలేకపోవడం టీమ్‌ను కలవరపెడుతోంది. సూర్యకుమార్ యాదవ్, ఇషాన్‌కిషన్, కామెరూన్ గ్రీన్, టిమ్ డేవిడ్ బ్యాట్‌తో చెలరేగితే గుజరాత్‌కు కష్టాలు తప్పవు. ఈ సీజన్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ పూర్తిగా విఫలం కావడం ముంబైకి మైనస్‌గా మారింది.
పరుగుల వరద
సెకండ్ క్వాలిఫయర్ మ్యాచ్‌కు అహ్మదబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ స్టేడియంలో ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లన్నింటిలో భారీ స్కోర్లు నమోదు అయ్యాయి. బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్ కావడంతో నేటి మ్యాచ్‌లోనూ అదే సీన్ రిపీట్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.