LSG vs SRH: లక్నో ప్లేఆఫ్స్ ఆశలు సజీవం.. హైదరాబాద్‌పై ఘనవిజయం.. పూరన్ ఊచకోత-lucknow super giants won by 7 wickets against sunrisers hyderabad ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Lsg Vs Srh: లక్నో ప్లేఆఫ్స్ ఆశలు సజీవం.. హైదరాబాద్‌పై ఘనవిజయం.. పూరన్ ఊచకోత

LSG vs SRH: లక్నో ప్లేఆఫ్స్ ఆశలు సజీవం.. హైదరాబాద్‌పై ఘనవిజయం.. పూరన్ ఊచకోత

Maragani Govardhan HT Telugu
May 13, 2023 07:57 PM IST

LSG vs SRH: హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ గెలుపుతో ప్లేఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. ప్రేరక్ మన్కడ్ అర్ధశతకంతో రాణించగా.. నికోలస్ పూరన్ విధ్యవంసం సృష్టించాడు.

హైదరాబాద్‌పై లక్నో ఘనవిజయం
హైదరాబాద్‌పై లక్నో ఘనవిజయం (AFP)

LSG vs SRH: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. 183 పరుగుల లక్ష్యాన్ని మరో నాలుగు బంతులు మిగిలుండగానే ఛేదించి 7 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ విజయంతో లక్నో జట్టు ప్లే ఆఫ్స్ ఆశలు సజీవం చేసుకుంది. ప్లేఆఫ్స్ ఆశలు నిలవలాంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో లక్నో బ్యాటర్లు.. ప్రేరక్ మన్కడ్(64), నికోలస్ పూరన్(44), స్టోయినీస్(40) రాణించి తమ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. మొదటి నుంచి మ్యాచ్‌ను తన కంట్రోల్‌లో ఉంచుకున్న సన్‌రైజర్స్ చివరి ఐదు ఓవర్లలో మాత్రం చేతులెత్తేయడంతో లక్నో గెలిచింది. హైదరాబాద్ బౌలర్లలో గ్లెన్ ఫిలిప్స్, అభిషేక్ శర్మ, మయాంక్ మార్కండే తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ పరాజయంతో సన్‌రైజర్స్ ప్లేఆఫ్స్ నుంచి దాదాపు వైదొలిగినట్లయింది.

183 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన లక్నో జట్టు ఆరంభం నుంచి నిదానంగా ఆడింది. మొదటి ఐదు ఓవర్లలో కేవలం 20 పరుగులు మాత్రమే వచ్చాయి. అంతేకాకుండా కైల్ మేయర్స్ లాంటి డేంజరస్ వికెట్‌ను కూడా తీసింది. ఆ కాసేపటికే డికాక్‌కు కూడా ఔట్ కావడం, రన్ రేట్ పెరుగుతుండటంతో మ్యాచ్ హైదరాబాద్ వైపు మొగ్గు చూపింది. అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ప్రేరక్ మన్కడ్ అర్ధశతకంతో విజృంభించాడు. స్టోయినీస్ సహాయంతో ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టాడు. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 73 పరుగులు జోడించారు.

మలుపు తిప్పిన నికోలస్ పూరన్..

అప్పటి వరకు ఎస్ఆర్‌హెచ్‌కు అనుగుణంగా సాగుతున్న మ్యాచ్‌ 15వ ఓవర్లో మలుపు తిరిగింది. అభిషేక్ శర్మ వేసిన ఆ ఓవర్లో తొలి రెండు బంతులకు స్టాయినీస్ రెండు భారీ సిక్సర్లు కొడతాడు. మూడో బంతి కూడా సిక్సర్ కొట్టేందుకు యత్నించగా.. అబ్దల్ సమాద్ క్యాచ్ పట్టడంతో అతడు ఔట్ అవుతాడు. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన నికోలస్ పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మూడు బంతుల్లోనూ మూడు సిక్సర్లు కొట్టి మ్యాచ్‌ను ఏకపక్షం చేస్తాడు. ఫలితంగా ఆ ఓవర్లో మొత్తం 31 పరుగులు వస్తాయి. దీంతో మ్యాచ్ లక్నో వైపు తిరిగింది. పూరన్ కేవలం 13 బంతులు ఎదుర్కొని 44 పరుగులు చేశాడు. ఇందులో 3 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి.

ఆ తర్వాత సన్ రైజర్స్ బౌలర్లు పొదుపుగా బౌలింగ్ చేయలేకపోతారు. ఓవర్‌కు బౌండరీ, సిక్సర్లు ఇస్తూ విజయాన్ని లక్నో చేతిలో పెట్టేశారు. ఆఖరు ఓవర్లో హైదరాబాద్ విజయానికి 4 పరుగులు అవసరం కాగా.. మొదటి 2 బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించి లక్నో విజయం సాధించింది. మొత్తానికి 19.2 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. ఈ గెలుపుతో లక్నో ప్లేఆఫ్స్ ఆశలు సజీవంగా ఉంటాయి. 12 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 13 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచింది లక్నో.