KL Rahul on Dhoni: ధోనీ ఇంతలా సక్సెస్ కావడానికి కారణం అదొక్కటే.. ఎవరికీ తెలియని సీక్రెట్ చెప్పిన రాహుల్
KL Rahul on Dhoni: ధోనీ ఇంతలా సక్సెస్ కావడానికి కారణం అదొక్కటే అంటూ ఎవరికీ తెలియని సీక్రెట్ చెప్పాడు కేఎల్ రాహుల్. తన మొదటి కెప్టెన్ గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను అతడు వెల్లడించాడు.
KL Rahul on Dhoni: ధోనీ ఇండియన్ క్రికెట్ లో చేసిన మ్యాజిక్ గురించి అందరికీ తెలిసిందే. అతడు కూల్ గా ఉంటాడు.. లక్కీ ఫెలో.. సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటాడు అంటూ అతని సక్సెస్ గురించి ఎంతో మంది ఎన్నో రకాలుగా విశ్లేషించారు. అయితే టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ ఇప్పటి వరకూ ఎవరికీ తెలియని ధోనీ మరో సక్సెస్ సీక్రెట్ బయటపెట్టాడు.
ప్రస్తుతం తన గాయానికి సర్జరీ తర్వాత రెస్ట్ తీసుకుంటున్న అతడు.. యూట్యూబర్ రణ్‌వీర్ తో మాట్లాడాడు. ధోనీ కెప్టెన్సీలోనే రాహుల్ ఇండియన్ టీమ్ తరఫున అరంగేట్రం చేశాడు. అతనితో కలిసి చాలా క్రికెట్ ఆడాడు. ధోనీని దగ్గరగా చూసిన రాహుల్.. అతని సక్సెస్ సీక్రెట్ ను కూడా పసిగట్టాడు.
ధోనీ గట్ ఫీలింగ్‌ని నమ్ముతాడు
ధోనీ గురించి చెబుతూ.. "ఈ విషయం అతడు నాతో చాలాసార్లు చెప్పాడు. ఓ కెప్టెన్ గా నీ గట్ ఫీలింగ్ ని నమ్మమని అనేవాడు. ఓ వ్యక్తిగా, కెప్టెన్ గా అతడు చేసింది కూడా అదే. మనం ఎవరమైనా ముందుగా దేన్నైనా ప్రశ్నిస్తాం. కానీ అతడు ఎప్పుడూ అలా చేయడు. ఓ విషయం గురించి తనకు గట్ ఫీలింగ్ ఉంది అంటే దానిని ప్రశ్నించడమో, రెండో ఆలోచన పెట్టుకోవడమో చేయడు.
అది సక్సెస్ అయినా కాకపోయినా దానిని అమలు చేసేస్తాడు. చాలా విధాలుగా అది అతనికి కలిసి వచ్చింది. అందుకే అతడు చాలా విధాలుగా భిన్నమైన వ్యక్తి కూడా. అప్పుడు ఎవరూ గుర్తించలేదు కానీ.. ధోనీ తన గట్ ఫీలింగ్ ను నమ్ముతాడు. అందుకే ఫలితాలు కూడా రాబట్టాడు" అని రాహుల్ స్పష్టం చేశాడు.
ఎలాంటి ప్లేయర్ అయినా ధోనీ కెప్టెన్సీలో ఆడాలని అనుకుంటాడని, అతనితో కలిసి డ్రెస్సింగ్ రూమ్ లో ఉండాలనుకుంటారని కూడా రాహుల్ చెప్పాడు. "ధోనీ నా తొలి కెప్టెన్. అతడు జట్టును ఎలా హ్యాండిల్ చేశాడో నాకు తెలుసు. ఒక్కో వ్యక్తితో ఎలా బంధాన్ని నిర్మించుకోవాలో అతన్ని చూసే నేర్చుకున్నాను.
అతడు రిటైరైన తర్వాత ధోనీ లేని లోటు ఏంటో నాకు చాలా రోజులకు తెలిసింది. అతని ఉనికి, అతని గొప్పతనం ఎలాంటిదో అప్పుడే తెలిసొచ్చింది. ధోనీ కెప్టెన్సీలో ఆడాలన్నది ప్రతి క్రికెటర్ కల. నువ్వు ఏం చూస్తావో, ఏం ఆలోచిస్తావో అదే పొందుతావన్నది ధోనీ సింపుల్ లాజిక్. ఫీల్డ్ లోనూ చాలా కామ్ గా ఉంటాడు. అతడు తాను చేసే ప్రతి పనిలోనూ చాలా బ్యాలెన్స్‌డ్ గా ఉంటాడు. జట్టులోని ప్రతి ఒక్కరి గురించి ప్రతి విషయం అతనికి తెలుసు" అని రాహుల్ తెలిపాడు.
సంబంధిత కథనం