IPL 2023 Points Table: టాప్ ప్లేస్ కోల్పోయిన చెన్నై.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ లిస్ట్ టాప్ 5లో మార్పులు
IPL 2023 Points Table: టాప్ ప్లేస్ కోల్పోయింది చెన్నై సూపర్ కింగ్స్. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ లిస్ట్ టాప్ 5లో మార్పులు చోటు చేసుకున్నాయి. అప్‌డేట్ అయిన లిస్ట్ ఇప్పుడు చూద్దాం.
IPL 2023 Points Table: ఐపీఎల్ 2023 పాయింట్ల టేబుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. గురువారం (ఏప్రిల్ 27) చెన్నై సూపర్ కింగ్స్ ను 32 పరుగుల తేడాతో ఓడించిన రాజస్థాన్ రాయల్స్ టేబుల్లో టాప్ ప్లేస్ లోకి దూసుకెళ్లింది. టాప్ లో ఉన్న చెన్నై మూడో స్థానానికి పడిపోయింది. ఈ మ్యాచ్ లో రాయల్స్ 202 పరుగులు చేయగా.. తర్వాత చెన్నై 170 పరుగులకే పరిమితమైంది.
చెన్నైపై మంచి మార్జిన్ తో విజయం సాధించిన రాజస్థాన్ మెరుగైన నెట్ రన్‌రేట్ తో టాప్ లోకి దూసుకెళ్లింది. ప్రస్తుతం పాయింట్ల టేబుల్లో రాజస్థాన్, గుజరాత్ టైటన్స్ పదేసి పాయింట్లతోనే ఉన్నాయి. అయితే నెట్ రన్‌రేట్ లో హెచ్చుతగ్గులతో రాయల్స్ టాప్ లో ఉండగా.. గుజరాత్, చెన్నై తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. లక్నో సూపర్ జెయింట్స్ 8 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది.
అయితే రాజస్థాన్, చెన్నై టీమ్స్ ఇప్పటికే ఎనిమిదేసి మ్యాచ్ లు ఆడగా.. గుజరాత్, లక్నో ఏడేసి మ్యాచ్ లు ఆడాయి. శుక్రవారం (ఏప్రిల్ 28) పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ తర్వా త పాయింట్ల టేబుల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి.
ఆరెంజ్ క్యాప్.. డుప్లెస్సి దగ్గరే..
చెన్నై, రాజస్థాన్ మ్యాచ్ తర్వాత ఆరెంజ్ క్యాప్ టాప్ 3లో ఎలాంటి మార్పు రాలేదు. టాప్ లో ఆర్సీబీ కెప్టెన్ డుప్లెస్సి (422 పరుగులు) కొనసాగుతుండగా.. స్టాండిన్ కెప్టెన్ విరాట్ కోహ్లి (333 పరుగులు) రెండోస్థానంలో ఉన్నాడు.
ఇక రాజస్థాన్ తో మ్యాచ్ లో విఫలమైనా.. సీఎస్కే ఓపెనర్ డెవోన్ కాన్వే 322 పరుగులతో మూడోస్థానంలోనే కొనసాగుతున్నాడు. నాలుగో స్థానంలో మరో సీఎస్కే బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ (317), ఐదో స్థానంలో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ (306) ఉన్నారు.
పర్పుల్ క్యాప్.. సిరాజే టాప్
ఇక పర్పుల్ క్యాప్ లిస్టులో ఆర్సీబీ బౌలర్ సిరాజే 14 వికెట్లతో టాప్ లో కొనసాగుతున్నాడు. గుజరాత్ టైటన్స్ బౌలర్ రషీద్ ఖాన్, చెన్నై సూపర్ కింగ్స్ బౌలర్ తుషార్ దేశ్‌పాండే కూడా 14 వికెట్లతోనే రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. కేకేఆర్ బౌలర్ వరుణ్ చక్రవర్తి.. పంజాబ్ కింగ్స్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ 13 వికెట్లతో నాలుగు, ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు.