Ipl Today Schedule: ముంబై బోణీ చేస్తుందా - ఢిల్లీ గెలుపు ఖాతా తెరుస్తుందా?
Ipl Today Schedule: ఐపీఎల్‌లో నేడు చెన్నై సూపర్ కింగ్స్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. మరో మ్యాచ్‌లో ఢిల్లీతో ఫైట్‌కు రాజస్థాన్ సిద్ధమైంది.
Ipl Today Schedule: ఐపీఎల్‌లో నేడు రెండు మ్యాచ్‌లు జరుగనున్నాయి. మధ్యాహ్నం జరుగనున్న తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనుంది. ఇప్పటివరకు ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ బోణీ చేయలేదు. ఆడిన రెండు మ్యాచుల్లో ఓటమి పాలైంది. డేవిడ్ వార్నర్ మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్ రాణించలేకపోవడం ఢిల్లీకి ఇబ్బందిగా మారింది. రంజీలో పరుగుల వరద పారించిన పృథ్వీషా, సర్ఫరాజ్‌ఖాన్ ఐపీఎల్‌లో మాత్రం విఫలమవుతోన్నారు.
మెరుపులు లేవు…
విదేశీ హిటర్లు రూసో, పావెల్ మెరుపులు లేవు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన గత మ్యాచ్‌లో అభిషేక్ పొరెల్, అక్షర్ పటేల్ నిలకడగా ఆడటంతో ఢిల్లీ మోస్తారు స్కోరు చేసింది. బౌలింగ్ పరంగా కుల్దీప్ యాదవ్, అక్షర్ రాణిస్తున్నా మిగిలిన వారి నుంచి సరైన సహకారం దొరకడం లేదు.
అశ్విన్, చాహల్…
మరోవైపు రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్, బ్యాటింగ్ పరంగా ఢిల్లీ కంటే మెరుగ్గా కనిపిస్తోంది. జోస్ బట్లర్, సంజూ శాంసన్, దేవ్‌దత్ ఫడిక్కల్‌లతో రాజస్థాన్ బ్యాటింగ్ లైనప్ స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. బౌలింగ్‌లోనూ అశ్విన్, చాహల్‌తో పాటు సీనియర్ పేసర్ బౌల్ట్ రాజస్థాన్‌కు వెన్నుముకగా నిలుస్తోన్నారు. ఇప్పటివరకు ఐపీఎల్ 2023లో రెండు మ్యాచ్‌లో ఆడిన రాజస్థాన్...సన్‌రైజర్స్‌పై విజయాన్ని సాధించగా పంజాబ్ చేతిలో ఓటమి పాలైంది. నేటి మ్యాచ్‌లో రాజస్థాన్‌ను ఎదురించి ఢిల్లీ ఏ మేరకు నిలబడుతుందో చూడాల్సిందే...
చెన్నైతో ముంబై ఢీ
ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ అయిన ముంబై ఇండియన్స్ కూడా ఐపీఎల్ 2023లో ఇంకా గెలుపు ఖాతా తెరవలేదు. తొలి మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో చిత్తుగా ఓడింది. ఈ మ్యాచ్‌లో ముంబై కీలక ఆటగాళ్లు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ పూర్తిగా విఫలమయ్యారు. నేటి మ్యాచ్‌లో వారిపై ఒత్తిడి చాలా ఉంది. ఈ ముగ్గురు రాణిస్తేనే చెన్నైపై ముంబై గెలవగలదు.
తిలక్ వర్మపైనే ఆశలు
కాగా తొలి మ్యాచ్‌లో ఒంటరిపోరాటంతో ఆకట్టుకోన్న తెలుగు క్రికెటర్ తిలక్‌వర్మ నుంచి అభిమానులు మరోసారి భారీ ఇన్నింగ్స్ ఆశిస్తోన్నారు. ప్రత్యర్థిని కట్టడిచేసే నమ్మకమైన బౌలర్ ముంబైలో లేకపోవడం దెబ్బతీస్తోంది. జోఫ్రా ఆర్చర్‌పై ముంబై ఫ్యాన్స్ భారీగానే ఆశలు పెట్టుకున్నారు. కానీ బెంగళూరుతో మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు ఇవ్వడమే కాకుండా ఒక్క వికెట్ కూడా తీయకుండా వారి ఆశల్ని వమ్ము చేశాడు.
రుతురాజ్ జోరు
మరోవైపు చెన్నై టీమ్‌లో ఓపెనర్ రుతురాజ్ ఇప్పటివరకు రెండు హాఫ్ సెంచరీలు చేసి ఫుల్ జోష్‌లో ఉన్నాడు అతడితో పాటు కాన్వే కూడా చెలరేగితో ముంబైకి కష్టాలు తప్పవు. బెన్ స్టోక్స్, మెయిన్ అలీ, అంబాటి రాయుడు భారీ ఇన్నింగ్స్‌లతో గాడిన పడాల్సిన అవసరం ఉంది. గత రెండు మ్యాచ్‌ల్లో ధనాధన్ షాట్స్‌తో ధోనీ ఆకట్టుకున్నాడు. బౌలింగ్‌లో యంగ్ ప్లేయర్ రాజ్యవర్ధన్ ఆకట్టుకుంటోన్నాడు. సీనియర్స్ జడేజా, దీపక్ చాహర్ ముంబైని ఏ మాత్రం కట్టడి చేస్తారో నేటి మ్యాచ్‌లో చూడాల్సిందే.