IPL 2023 Points Table: నిన్నటి మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టికలో వచ్చిన మార్పులివే.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ లీడర్లు వీరే-here the updated ipl 2023 points table orange cap and purple cap list after dc vs mi match ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl 2023 Points Table: నిన్నటి మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టికలో వచ్చిన మార్పులివే.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ లీడర్లు వీరే

IPL 2023 Points Table: నిన్నటి మ్యాచ్ తర్వాత పాయింట్ల పట్టికలో వచ్చిన మార్పులివే.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ లీడర్లు వీరే

Maragani Govardhan HT Telugu
Apr 12, 2023 08:20 AM IST

IPL 2023 Points Table: మంగళవారం నాడు దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ముంబయి గెలిచి టోర్నీలో తొలి విజయాన్ని అందుకుంది. ఫలితంగా పాయింట్ల పట్టికలో ఓ స్థానాన్ని మెరుగుపర్చుకుని 8కి చేరగా.. టాప్‌లో లక్నో అలాగే కొనసాగుతోంది. ఆరెంజ్, పర్పుల్ లీడర్లుగా ధావన్, మార్క్ వుడ్ ఉన్నారు.

ముంబయి-దిల్లీ
ముంబయి-దిల్లీ (Rahul Singh)

IPL 2023 Points Table: ఐదు సార్లు ఐపీఎల్ ఛాంపియన్‍‌గా నిలిచిన ముంబయి ఇండియన్స్ గతేడాది పేలవ ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌కు కూడా చేరలేకపోయింది. ఈ సీజన్‌లో వరుస రెండు మ్యాచ్‌ల్లో పరాజయం పాలవ్వడంతో అదే వైఫల్యం కొనాసాగిస్తుందా? అని ముంబయి ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్న తరుణంలో అద్భుత విజయాన్ని అందుకుంది. దిల్లీ క్యాపిటల్స్‌తో మంగళవారం సాయంత్రం జరిగిన మ్యాచ్‌లో ముంబయి 6 వికెట్ల తేడాతో నెగ్గి ఈ టోర్నీలో బోణీ కొట్టింది. దీంతో ఈ జట్టు పాయింట్ల పట్టికలో 8వ స్థానానికి చేరుకుంది. 3 మ్యాచ్‌ల్లో ఓ విజయంతో 2 పాయింట్లు సాధించిన ముంబయి -0.879 రన్ రేట్‌ను కలిగి ఉంది. మరోపక్క దిల్లీ(0 పాయింట్లు, రన్‌రైట్ -1.576) వరుసగా నాలుగో మ్యాచ్‌లోనూ ఓడిపోయి అందరికంటే దిగువ స్థానంలో కొనసాగుతోంది.

లక్నో సూపర్ జెయింట్స్(6 పాయింట్లు, రన్ రేట్ +.1048) ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింటిలో విజయం సాధించిం 6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. రాజస్థాన్ రాయల్స్(4 పాయింట్లు, రన్‌రేట్ +2.067) మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించి రెండో స్థానంలో ఉంది. కేకేఆర్(3 గేముల్లో 4 పాయింట్లు, రన్ రేట్ +1.375), గుజరాత్ టైటాన్స్(3 గేముల్లో 4 పాయింట్లు, +0.431) మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి.

ఆరెంజ్ క్యాప్- పర్పుల్ క్యాప్..

ఇక ఈ టోర్నీలో 3 మ్యాచ్‌ల్లో 225 పరుగులు చేసి అగ్రస్థానంలో ఉన్న శిఖర్ ధావన్ ఆరెంజ్ క్యాప్‌ దక్కించుకున్నాడు. మరోపక్క 4 గేముల్లో 209 పరుగులు చేసిన వార్నర్ రెండో స్థానంలో నిలిచారు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ మార్క్‌వుడ్ ఇప్పటి వరకు 9 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్‌గా పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్నారు. అతడి తర్వాత స్థానాల్లో 8 వికెట్లతో యజువేంద్ర చాహల్, రషీద్ ఖాన్ ఉన్నారు.

మంగళవారం నాడు దిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 173 పరుగుల లక్ష్యాన్ని చివరి ఓవర్ వరకు పోరాడి గెలిచింది. ఆఖరి ఓవర్లో విజయానికి 5 పరుగులు అవసరం కాగా.. కేమరూన్ గ్రీన్, టిమ్ డేవిడ్ చివరి బంతి వరకు పోరాడి తమ జట్టుకు విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్‌లో చాలా రోజుల తర్వాత రోహిత్ శర్మ(65) అర్ధశతకంతో మెరిశాడు. అతడు ఇషాన్ కిషన్‌తో(31) కలిసి కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దిల్లీ బౌలర్లలో ముకేష్ కుమార్ 2 వికెట్లు తీయగా.. ముస్తాఫిజుర్ రెహమాన్ ఓ వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.

ఐపీఎల్ 2023 లేటెస్ట్ పాయింట్స్ టేబుల్
ఐపీఎల్ 2023 లేటెస్ట్ పాయింట్స్ టేబుల్