RR vs GT: గెలుపు గుర్రంలా దూసుకెళ్తోన్న గుజరాత్.. రాజస్థాన్‌పై భారీ విజయం-gujarat titans won by 9 wickets against rajasthan royals ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  Sports  /  Gujarat Titans Won By 9 Wickets Against Rajasthan Royals

RR vs GT: గెలుపు గుర్రంలా దూసుకెళ్తోన్న గుజరాత్.. రాజస్థాన్‌పై భారీ విజయం

Maragani Govardhan HT Telugu
May 05, 2023 10:50 PM IST

RR vs GT: జైపుర్ వేదికగా రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ ఘన విజయం సాధించింది. 9 వికెట్ల తేడాతో గెలిచింది. గుజరాత్ బ్యాటర్లలో సాహా, పాండ్య, గిల్ అదిరిపోయే ప్రదర్శనతో జట్టు విజయం కీలక పాత్ర పోషించారు.

రాజస్థాన్‌పై  గుజరాత్ ఘనవిజయం
రాజస్థాన్‌పై గుజరాత్ ఘనవిజయం (AFP)

RR vs GT: డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ ఈ సీజన్‌లోనూ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. తాజాగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 9 వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది. 119 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13.5 ఓవర్లలోనే వికెట్ నష్టపోయి ఛేదించింది. గుజరాత్ బ్యాటర్లు వృద్ధిమాన్ సాహా(44), శుభ్‌మన్ గిల్(36), హార్దిక్ పాండ్య(39) మెరుపు ఇన్నింగ్స్‌తో స్వల్ప లక్ష్యం మరింత చిన్నదైపోయింది. వరుసపెట్టి బౌండరీలు, సిక్సర్లు బాదుతూ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. రాజస్థాన్ బౌలర్లలో చాహల్ ఓ వికెట్ మినహా మిగిలినవారంతా పెద్దగా ఆకట్టుకోకపోవడంతో గుజరాత్ సునాయాసంగా విజయం సాధించింది.

ట్రెండింగ్ వార్తలు

119 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన గుజరాత్‌కు అదిరిపోయే ఆరంభం లభించింది. ఓపెనర్లు సాహా, శుబ్‌మన్ గిల్ అద్భుతమైన ఆటతీరుతో బలమైన ఆరంభాన్నిచ్చారు. వీరిద్దరూ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు బాది లక్ష్యాన్ని చిన్నది చేశారు. నిలకడగా ఆడిన వీరిద్దరూ 9.1 ఓవర్లలో 71 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. దూకుడుగా ఆడబోయిన శుబ్‌మన్ గిల్.. చాహల్ బౌలింగ్‌లో స్టంపౌట్ అయ్యాడు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన హార్దిక్ పాండ్య వచ్చి రావడంతో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. చివరి వరకు ధాటిగా ఆడి గుజరాత్ విజయాన్ని చాలా ముందుగానే ఖరారు చేశాడు. అతడికి వృద్ధిమాన్ సాహా చక్కగా సహకరించాడు. పాండ్య 15 బంతుల్లో 39 పరుగులు చేసి అదరగొట్టాడు. ఇందులో 3 సిక్సర్లు, 3 బౌండరీలు ఉన్నాయి. ఫలితంగా గుజరాత్ జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఈ గెలుపుతో గుజరాత్ పాయింట్ల పట్టికలో తన అగ్రస్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకుంది. ఆడిన 10 మ్యాచ్‌ల్లో ఏడింటిలో గెలిచి 14 పాయింట్లతో టాప్ ప్లేస్‌ను సుస్థిరం చేసుకుంది.

అంతకుముందు బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్ల ధాటికి వరుసగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. సంజూ శాంసన్ 30 పరుగులు మినహా మిగిలిన వారంతా స్వల్ప పరుగులకే పెవిలియన్ బాట పట్టారు. గుజరాత్ బౌలర్లు రషీద్ ఖాన్, నూర్ అహ్మద్.. రాజస్థాన్ బ్యాటర్లకు కళ్లెం వీశారు. రషీద్ 3 వికెట్లతో విజృంభించగా.. నూర్ అహ్మద్ 2 వికెట్లతో రాణించాడు. షమీ. హార్దిక్, జోషూవా లిటిల్ తలో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.

WhatsApp channel