GT vs CSK IPL 2023: అహ్మదాబాద్‌లో భారీ వర్షం.. ఐపీఎల్ తొలి మ్యాచ్ డౌటే
GT vs CSK IPL 2023: అహ్మదాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. దీంతో శుక్రవారం (మార్చి 31) నరేంద్ర మోదీ స్టేడియంలో జరగాల్సిన ఐపీఎల్ తొలి మ్యాచ్ జరగడం అనుమానంగా మారింది.
GT vs CSK IPL 2023: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్ మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోతోంది. అయితే గుజరాత్ టైటన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి మ్యాచ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు ఓ బ్యాడ్ న్యూస్. అహ్మదాబాద్ లో గురువారం భారీ వర్షం కురిసింది. అసలు ఊహించని రీతిలో హఠాత్తుగా వాతావరణం మారిపోయి భారీ వర్షం కురవడంతో చెన్నై, గుజరాత్ టీమ్స్ ప్రాక్టీస్ సెషన్ లను రద్దు చేశారు.
గురువారం సాయంత్రం ఏదో కాసేపు చినుకులు పడి వెళ్లిపోతాయనుకుంటే ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఈ వర్షం కారణంగా ఉష్ణోగ్రతలు తగ్గి జనాలు ఊపిరి పీల్చుకున్నారు. కానీ ఐపీఎల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ మాత్రం ఉసూరుమన్నారు. మ్యాచ్ సమయానికి కూడా ఇలాగే వర్షం పడితే ఎలా అన్న ఆందోళనలో వాళ్లు ఉన్నారు.
ఐపీఎల్ తొలి మ్యాచ్ జరుగుతుందా?
అభిమానులకు కాస్త ఊరట కలిగించే విషయం ఏమిటంటే.. శుక్రవారం వర్షం పడే అవకాశాలు అసలు లేవని వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే కొన్ని రోజులుగా ఉత్తర, పశ్చిమ భారతదేశంలో ఊహించని రీతిలో సడెన్ గా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. శుక్రవారం (మార్చి 31) ఉదయం అయితే అహ్మదాబాద్ లో ఎలాంటి వర్షం లేదు.
సాయంత్రం కూడా ఇలాగే ఉంటే మ్యాచ్ సజావుగా సాగిపోతుంది. అంతేకాదు అంతకుముందు మన తెలుగు స్టార్లు రష్మిక మందన్నా, తమన్నా భాటియా, సింగర్ అరిజిత్ సింగ్ కూడా పర్ఫార్మ్ చేయనున్నారు. వరుణుడు కరుణిస్తే ఓపెనింగ్ సెర్మనీతోపాటు హైఓల్టేజ్ గుజరాత్, చెన్నై మ్యాచ్ ఎలాంటి అడ్డంకి లేకుండా సాగుతుంది.
అయితే తొలి మ్యాచ్ కు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ అందుబాటులో ఉండేది అనుమానంగా ఉంది. అతడు మోకాలి గాయంతో బాధపడుతున్నాడు. ఒకవేళ అతడు ఆడకపోతే చెన్నై కెప్టెన్సీ బాధ్యతలు ఎవరు తీసుకుంటారన్నది చూడాలి. స్టోక్స్, జడేజా, రుతురాజ్ గైక్వాడ్ రేసులో ఉన్నారు.
సంబంధిత కథనం