Gayle on CSK: ముంబైలాంటి టీమ్‌తో సీఎస్కే ఫైనల్ ఆడాలనుకోదు: క్రిస్ గేల్
Gayle on CSK: ముంబైలాంటి టీమ్‌తో సీఎస్కే ఫైనల్ ఆడాలనుకోదని అన్నాడు క్రిస్ గేల్. గుజరాత్ టైటన్స్ హోమ్ గ్రౌండ్ లో ఆడుతున్నా కూడా ముంబై టీమే ఫేవరెట్ అని అతడు స్పష్టం చేశాడు.
Gayle on CSK: ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ గతేడాదిలాగే ఈసారి కూడా అంత గొప్పగా ఐపీఎల్ ను ప్రారంభించలేదు. అయితే తర్వాత అద్భుతంగా పుంజుకొని ప్లేఆఫ్స్ చేరడమే కాదు.. ఎలిమినేటర్ లో లక్నోను ఓడించి ఫైనల్ బెర్త్ కోసం గుజరాత్ టైటన్స్ తో పోరుకు సిద్ధమైంది. ఇప్పటికే ఫైనల్ చేరిన చెన్నై సూపర్ కింగ్స్ తో టైటిల్ పోరు కోసం ముంబై, గుజరాత్ తలపడనున్నాయి.
అయితే ఫైనల్లో సీఎస్కే కచ్చితంగా ముంబైలాంటి టీమ్ రావాలని కోరుకోదని ఆర్సీబీ మాజీ ప్లేయర్ క్రిస్ గేల్ అనడం విశేషం. రెండో క్వాలిఫయర్ గుజరాత్ టైటన్స్ సొంత గ్రౌండ్ లో జరుగుతున్నా.. ముంబై ఇండియన్స్ జైత్రయాత్ర చూస్తుంటే ఈ మ్యాచ్ లోనూ ఆ టీమే ఫేవరెట్ అని గేల్ అన్నాడు. ఆ ఊపులోనే సీఎస్కేతో ఎంఐ టైటిల్ పోరుకు సిద్దం కావచ్చని అంచనా వేశాడు.
"వాళ్లు గుజరాత్ టైటన్స్ సొంతగడ్డపై ఆడబోతున్నారు. ఇదే జీటీకి ప్లస్ పాయింట్. దీనిని మనం పరిగణనలోకి తీసుకోవాలి. కానీ ప్రస్తుతం పరిస్థితులు ముంబైకి అనుకూలిస్తున్నాయి. ముంబై టీమే ఫైనల్ చేరబోతోందా? ఒకవేళ అదే జరిగితే.. కచ్చితంగా ముంబైలాంటి టీమ్ తో సీఎస్కే ఆడాలని అనుకోదు" అని జియోసినిమాలో మాట్లాడుతూ గేల్ అనడం విశేషం.
ముంబై ఇండియన్స్ తన చివరి రెండు మ్యాచ్ లలో గెలిచి ఊపు మీదుంది. లీగ్ స్టేజ్ లో డూ ఆర్ డైలాంటి మ్యాచ్ లో సన్ రైజర్స్ ను చిత్తు చేయగా.. తర్వాత ఎలిమినేటర్ లో లక్నో సూపర్ జెయింట్స్ ను సులువుగా ఓడించింది. మరోవైపు గుజరాత్ టైటన్స్.. తొలి క్వాలిఫయర్ లో ఓడిపోయింది. మరి ఆరో టైటిల్ పై కన్నేసిన ముంబై.. డిఫెండింగ్ ఛాంపియన్స్ అడ్డంకిని అధిగమించి ఐదో టైటిల్ పై కన్నేసిన చెన్నైతో ఫైనల్లో తలపడుతుందా లేదా చూడాలి.
సంబంధిత కథనం